Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 37


    సినిమా హాలు రష్ గా వుంది. జనం గుంపులు గుంపులుగా నిలబడి సినిమా కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. స్త్రీలైతే అలంకరించుకుని పేరంటానికి వచ్చినట్లున్నారు. వాళ్ళ రంగు రంగుల చీరలను చూస్తుంటే తమవి పాలిపోయిన చీరల్లా అనిపించాయి. అనాథ సదన్ మహిళలకు, నైల్ పాలిష్ వుండడం వల్ల ఆ మాత్రం రంగన్నా ఒంటిమీదుంది.  

 

    అనాథ మహిళా సదన్ లాంటి ప్రశాంతమైన వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడున్న గందరగోళం హాయిగా వుంది. అంతకుమించి థ్రిల్లింగ్ గా వుంది. తమలో లేని జీవం అక్కడున్న వాళ్ళలో వున్నట్లు గుర్తించారు.

 

    "జనం బాగా వున్నారు. స్త్రీలకైతే ఈజీగా టిక్కెట్లు దొరుకుతాయి. ఇద్దరు వెళ్ళి టిక్కెట్లు పట్రండి" అన్నాడు తరుణ్.

 

    కైవల్య, శృతి ముందుకొచ్చారు.

 

    వాళ్ళు డబ్బులు తీసుకుని టిక్కెట్లకోసం వెళ్ళారు.

 

    "ఇంతమంది జనం మధ్య వుంటే తప్ప నాకు తోచదు. అనాథ మహిళా సదన్ లో వుండడం జైల్లో వున్నట్లుంది నాకు. అయితే ఒకటే వూరట - మీరు" అన్నాడు మెల్లగా పక్కనున్న మౌనికతో.

 

    ఆమె అన్నీ మరిచిపోయి హాయిగా నవ్వింది. నవ్వాక తనంత అద్భుతంగా నవ్వినందుకు తనకు తనే ఆశ్చర్యపోయింది. తనూ ఈ లోకపు ఇంద్రజాలంలో ఇరుక్కుపోతున్నట్లు తోచింది.

 

    అంతలో కైవల్య, శృతి టిక్కెట్లు తీసుకొచ్చారు. జనంలో దూరి టిక్కెట్లు తేవడంవల్ల బాగా అలిసిపోయారు. గుప్పెట్లో మూసుకొచ్చి తెచ్చిన టిక్కెట్లు నలిగిపోయి గులాబీరేకుల్లా వున్నాయి.

 

    "సాధించారన్నమాట. పదండి పోదాం. టైటిల్స్ నుంచి చూస్తే తప్ప సినిమా చూసినట్లుండదు నాకు" అన్నాడు ముందుకి నడుస్తూ.

 

    అమ్మాయిలు అనుసరించారు.

 

    వాళ్ళు లోపలికి వెళ్ళగానే గణపతిరాజు తన అనుచరులతో ప్రవేశించాడు.

 

    పాటలు నిలిచిపోయాయి. మరికాసేపట్లో సినిమా పారంభమవుతుందని సూచిస్తూ బెల్ మ్రోగింది.

 

    రాజు హడావుడిగా టిక్కెట్లు తెచ్చాడు. ముగ్గురూ గేటు దగ్గర టిక్కెట్లు యిచ్చి లోపలికి అడుగు పెట్టగానే లైట్లు ఆరిపోయి, సినిమా ప్రారంభమైంది.

 

                             *    *    *    *    *

 

    అమ్మాయిలు పూర్తిగా సినిమాలో లీనమైపోయారు. అవి బొమ్మలుగా కాకుండా నిజంగా తమ ఎదుటే మనుషులు అలా ప్రవర్తిస్తున్నారన్నంతగా ఇన్వాల్వ్ అయిపోయారు. ఆ బొమ్మలతో పాటు నవ్వారు. వాళ్లతో పాటు ఏడ్చారు.

 

    సినిమా పూర్తయ్యిందిగానీ ఆ హాంగోవర్ నుంచి బయటికి రాలేకపోయారు. ఇంకా కళ్ళ ముందు సినిమా ఆడుతున్నట్లుగానే వుంది.

 

    ఇంట్రవెల్ లో తరుణ్ ఏవైనా తినడానికి తెస్తానని లేవబోయాడు గానీ మౌనిక వారించింది. లేకుంటే గణపతిరాజు కళ్ళల్లో పడేవాడే.

 

    సినిమా వదిలిపెట్టాక ఆ జనంలోంచి బయటపడి తమ దారిలోకి రావడానికి పదినిముషాలు పైగానే పట్టింది. అప్పటికి రిలీఫ్ దొరికింది.

 

    "ఎలా వుంది సినిమా?" తరుణ్ ప్రశ్నించాడు.

 

    "బ్రహ్మాండం" మౌనిక వెంటనే చెప్పింది. ఆమెకి అంత బాగా నచ్చింది. తన హోదాను మరిచిపోయి చాలా రోజులే అయింది. ఇప్పుడామె అనాథ మహిళా సదన్ ఇన్ ఛార్జ్ గా వ్యవహరించడం లేదు.

 

    "ఇంతకీ శివరావుకి వచ్చిన ప్రమాదం ఏమిటో చెప్పరా?" శృతి బ్రతిమలాడుతున్నట్లు అంది.

 

    కథ విషయం ఇంకా మరిచిపోలేదన్నమాట."

 

    "ఎలా మరిచిపోతాం? సినిమా చూస్తున్నప్పుడు కూడా అప్పుడప్పుడూ కథ గురించి ఆలోచించాను."

 

    "ఓ.కె. చెబుతాను" అంటూ తరుణ్ ప్రారంభించాడు.

 

    అందరూ వింటూ నడుస్తున్నారు.

 

    "శివరావు ఆ రోజు అర్థరాత్రి ఎవరికీ చెప్పకుండా పొలానికి బయల్దేరాడు. ఊరికి కొత్తవాడు గనుక ఇంకా అలవాటు కాని కుక్కలు అరవడం మొదలుపెట్టాయి. అయితే ఇదేమీ గమనించే స్థితిలో లేడు శివరావు. ఒళ్ళంతా టెన్షన్ తో అదురుతోంది. మనసుకు కూడా చెమటపట్టే పరిస్థితి. అతని ఆలోచన అంతా నర్సయ్యమీదే వుంది. ఏ మాత్రం ఆలస్యం అయినా నర్సయ్య వెళ్ళిపోతాడేమో నన్న భయం పట్టుకుంది.

 

    అందుకే అతను వడివడిగా అడుగులేస్తున్నాడు.

 

    పొలాలమధ్య నుండే బాట అతి ఇరుగ్గా వుంది. అతను నడుస్తున్న చప్పుడుకి పురుగూ, పుట్రా భయంతో దాక్కుంటున్నాయి.

 

    దూరంగా నక్కలు ఏడుస్తున్న చప్పుడు. అతని రాకను ముందుగా తెలుసుకున్నట్లు ఒకటీ అరా పిట్టలు అదేపనిగా అరుస్తున్నాయి. ఆకాశం నల్లగా పగిలిపోయిన కుండపెంకులా వుంది.

 

    మరో పదినిముషాలకి శివరావు తన పొలానికి చేరుకున్నాడు. అంతవరకు మిషన్ పక్కనే కూర్చున్న ఆకారం అతన్ని చూస్తూనే లేచి నిలబడింది.

 

    కటిక చీకటే అయినా ఆ ఆకారం నర్సయ్యేనని శివరావు కనిపెట్టాడు. కొద్దిగా టెన్షన్ తగ్గింది. దాని స్థానే ఆనందం భర్తీ అయింది. "నర్సయ్యా!" మరింత నమ్మకం కలగడానికి పిలిచాడు శివరావు.

 

    "శివరావు బాబూ" పలికింది నర్సయ్యే.

 

    శివరావు ఒక్క అంగలో పంటకాల్వను దాటి నర్సయ్యను చేరుకున్నాడు.

 

    "ఉంటావనుకోలేదు. కొద్దిగా ఆలస్యమైంది."

 

    "ఎందుకుండను బాబూ! నా బిడ్డలాంటివాడివి" అన్నాడు.

 

    ఆ అభిమానానికి ఉబ్బితబ్బిబ్బయి పోయాడు శివరావు.

 

    "తెచ్చారా?" నర్సయ్య రహస్యంగా అడిగాడు.

 

    "ఆఁ" అని అతను తువ్వాలు కింద దాచిపెట్టుకొచ్చిన కరెన్సీ కట్టలను చూపించాడు.

 

    "రండి బాబూ! అలా కూర్చుందాం"

 

    ఇద్దరూ వెళ్ళి మోటార్ దగ్గరున్న బండరాయి మీద కూర్చున్నారు.

 

    స్విచ్ బోర్డుకున్న ఎర్రటి జీరో వాల్ట్స్ బల్బు రక్తపు బొట్టులా వుంది.

 

    నర్సయ్య బొడ్లోంచి బంగారపు కడ్డీ తీశాడు. అది ఎర్రటి వెలుగులో మరింత పచ్చగా మెరుస్తోంది.

 

    "మొత్తం ముప్ఫై సవర్ల బంగారపు కడ్డీ. మీరు కాబట్టి ముప్ఫై వేలకు యిచ్చేస్తున్నా. మన స్నేహం ముందు డబ్బు ఎందుకూ కొరగానిది. ఏమంటావు?" అని నర్సయ్య తన చేతిలోని కడ్డీని శివరావుకి యిచ్చాడు.  

 

    శివరావు దాన్నందుకునేప్పుడు చేతులు వణికాయి. ముప్ఫై సవర్ల బంగారం. అదే మాటల్ని మనసులో రెండుమూడుసార్లనుకున్నాడు.

 

    తన చేతుల్లోని ముప్ఫైవేల రూపాయల్ని నర్సయ్యకి అందించాడు. అన్నీ నూర్రూపాయలే. మొత్తం మూడుకట్టలు. పొలం అమ్మగా వచ్చిన డబ్బు అది.  

 

    "లెక్క వేసుకో"

 

    "వద్దులే బాబూ! మనిషికి కావాల్సింది నమ్మకం"

 

    శివరావు బంగారపు కడ్డీని ఎంతో భద్రంగా బొడ్లో దోపుకున్నాడు.

 

    "ఇక నే వస్తా బాబూ" నర్సయ్య లేచాడు.

 

    "అలానే నర్సయ్యా! ఎప్పుడైనా ఇటొచ్చినప్పుడు మా ఇంటికి రావడం మరిచిపోవద్దు"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS