Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 36

   
                                12


    గదిలో దీపాలు వెలిగినాయి. అడుగుల చప్పుడు విన్పించింది.

    తలత్రిప్పి చూచింది ఆమని. రమోలా తదితర మిత్ర బృందం లోపలికొస్తూ కన్పించారు. రమ్మీ ఉరఫ్ రమాదేవి ముందుగావచ్చి స్విచెస్ ఆన్ చేసింది.

    "ఎందుకు తల్లీ ఇంకా దీపాలు వేయలేదు?" అంది విమ్మీ.

    "ఆలోచిస్తున్నాను" అంది ఆమని గంభీరంగా!

    "చదువుకోవటం ఆలోచించటం అలాంటి పనులు ఆరోగ్యానికి అంత మంచిదికాదు. ఆ రెండు పనులు తప్ప మరో పని చేయవు నువ్వు!"

    "సినిమాకు వెడదాం పద! టికెట్స్ తీసుకువచ్చాం"

    "చింపి అవతలకొట్టు, మనం ఓ విషయం సీరియస్ గా ఆలోచించాలి?"

    "ఏమిటా విశేషం?" అందరూ చుట్టూచేరి ప్రశ్నించారు.

    "ఒక తల్లికి ఎందరయినా బిడ్డలు ఉండవచ్చు. కాని ఓకే బిడ్డకు ఇద్దరు కన్న తల్లులు ఉండటం సాధ్యమేనా?" అని ప్రశ్నించింది ఆమని!

    "మధ్యాహ్నం రూంలోకి వెళ్ళబోయే ముందు బాగానే ఉన్నావుకదే! ఇంతలో ఏమయింది నీకు? పిల్లలేమిటి? తల్లులేమిటి? అసలు నీకు మతిసారిగా పని చేస్తోందా? ఒక పిల్లకు ఇద్దరు కన్నతల్లులు ఎలా ఉంటారు.

    ఇలా మతిచలించిన వాళ్ళకి అప్పర్డ్ థింక్స్ అన్నీ జరుగుతున్నాయని అనిపిస్తుందట. అలాంటిది ఏమయినా వచ్చిందా నీకు? ఇవెన్ని వ్రేళ్ళో చెప్పమ్మా?" అంటూ అరచేయి ముందుకు చాచి అడిగింది విమ్మీ!

    "నువ్వు నోరుముయ్యి! ఛాలెంజ్ నేను అడిగే ప్రశ్నకు దమ్ముంటే ఎవరయినా సరే సమాధానం చెప్పండి. ఒక పిల్లకు ఇద్దరు కన్న తల్లులు ఉంటారా?" అని తిరిగి ప్రశ్నించింది ఆమని.

    "అప్పర్డ్! అదెలా జరుగుతుంది. ఒక తల్లికి ఎందరు పిల్లలయినా ఉండవచ్చు కాని ఒకే పిల్లకు ఇద్దరు తల్లులు అందులో కన్నతల్లులు ఎలా ఉంటారు? రెండు గర్భాలకు ఒక శిశువు ఎలా సాధ్యమే!"

    "సాధ్యమే అని నిరూపిస్తాను! ఛాలెంజ్!"

    "నిజంగానే దీనికేదో అయింది. వార్డెన్ ని పిలిచి అంబులెన్స్ కి ఫోన్ చేయండి.

    "అక్కర్లేదు. నేను చెప్పేది వింటే మతిపోయి నువ్వే సైక్రియాట్రిస్ట్ దగ్గరకు తీస్తావు! అయినా నీకేం తెలుసు. రమోలా సైకాలజీ చదువుతోంది కదా. దాన్ని అడిగి తెలుసుకో!"

    "ఇది సైకాలజీ పాయింట్ కాదు. గైనకాలజీ ప్రాబ్లం అనుకుంటా" అంది రమోలా!

    ఈ విషయం విన్న తరువాత అందరికి అద్భుతంగానే ఉంది.

    "నిజంగానే ఇద్దరు తల్లులకు ఒక బిడ్డ పుట్టటం ఎలా సాధ్యం!

    అందరూ ఆలోచించారు కాని ఎవరికి అర్ధంకాలేదు.

    "వెరీ గుడ్! ఇక నేను చెప్తాను వినండి. రమోలా కోసం వెళ్ళినప్పుడు అనాధ శరణాలయంలో ఒక ఫంక్షన్ జరుగుతోంది.

    రెండు సంవత్సరాల క్రితం ఈ వింత మన దేశంలోనే జరిగింది.

    ఒక ప్రొఫెసర్ ఈ ఫీట్ ని సాధించారు.

    దాన్ని సైన్స్ జర్నల్స్ కి ప్రచురించారు. ఆ తరువాత ఆయన ప్రపంచం దృష్టిలో పడిపోయారు. చాలా దేశాలు రీసెర్చికి రావలసిందిగా ఆహ్వానించాయి.

    ప్రస్తుతం విదేశాలలో ఉంటున్నారు.

    ఆయన ఒక బిడ్డ ఇద్దరు తల్లులకు పుట్టేలా చేశారు.

    "చిత్రంగా ఉంది కదూ!" అంది ఆమని.

    "ఇది చిత్రంకాదు. ప్రపంచంలోనే మరో అద్భుతం అనుకోవాలి! కాని ఇదంతా నిజమే అని ఒప్పుకునేందుకు మనసు అంగీకరించటల్లేదు.

    రెండు కొమ్మలకు ఒక కాయ కాయదు.

    రెండు రెమ్మలకు ఓకేపూవు పూయదు.

    ఇద్దరు తల్లులకు ఒకే బిడ్డ పుట్టదు.

    అది ప్రకృతి సిద్ధాంతం. ప్రకృతిని మార్చగల శక్తి ఎవరికీ ఉండదు.

    ఏదయినా ఒక శక్తివంతమయిన సాధ్యం ప్రజల దృష్టికి వచ్చినప్పుడు దాని పేరుమీదుగా ఎన్నో పుకార్లు ప్రచారమవుతూంటాయి.

    సైన్సు ఇవాల్టి మనిషికి అత్యంత ఆకర్షణీయమైన సాధనం.

    ఇప్పుడు నేను చెప్పే విషయం అలాంటిదే అనుకుంటున్నాను" అన్నది.

    ఆమని మండిపడింది.

    "అటువంటి పాపను నేను కళ్ళతో చూశాను."

    "మాకు కూడా చూపించగలవా?"

    "ఓ నిరభ్యంతరంగా" అంది ఆమని!

    నడిచి వెళ్ళటంలో పొంచి ఉన్న ప్రమాదాన్ని ఒకసారి రుచి చూచారు.

    అందువల్ల ఈసారి అందరూ కారులో బయలుదేరారు.

    అనాధ శరణాలయం ప్రాంగణం నిన్నటిలా సందడిగాలేదు. చాలా ప్రశాంతంగా, గంభీరంగా ఉంది. కాంపౌండులో కారు ఆపి బిలబిలమంటూ లోపలకు వెళ్ళారు. కార్యాలయంలో లావు కళ్ళద్దాలు పెట్టుకున్న వృద్ధురాలు కూర్చుని ఉంది. పరిచయం చేసుకున్న తరువాత ఆమని చెప్పింది.

    "ఇద్దరు తల్లులకు ఒకే పాప పుట్టటం గురించి ప్రొఫెసర్ ఇచ్చిన స్పీచ్ మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ విశేషాలు పూర్తిగా తెలుసుకునేందుకు వచ్చాం."

    "ఆ పాప గురించి ఆ దృష్టితో వివరించాలంటే నాకు పూర్తిగా తెలియదు. నిన్న గొడవ జరగటంతో ప్రోగ్రాం అప్ సెట్ అయింది. ఆయన వివరిస్తే కదా ఎవరికయినా అర్ధమయేది. పాపను తీసుకుపోయారు.

    అది రాష్ట్రీయంగానేకాక చట్టపరంగా కూడ అనేక సమస్యలకు కారణమయినదని విన్నాను. దాన్ని తేల్చుకునే వరకూ పాపను అనాధ ఆశ్రమంలో ఉంచమని కోర్టు ఇంటరిమ్ ఆర్డర్స్ ఇచ్చింది.

    రెండు సంవత్సరాల క్రితం ఇద్దరు కన్న తల్లులు ఉండి కూడ ఆ పాప అనాధాశ్రమానికి అప్పగించబడింది.

    ఏవో వింతలు జరుగుతుంటాయి.

    అనాధాశ్రమ ఉద్యోగిగా నా విధి ఏమిటంటే వారిని పాలించటం పెంచటం లాంటివి! వారి భవిష్యత్తుకి ఒక దారి చూపటం లాంటివి.

    అంతేకాని మిగిలిన విషయాలలో నాకు అంత ఆసక్తి ఉండదు. మీరు ప్రొఫెసర్ ని కలిస్తే ఏవైనా విశేషాలు తెలియవచ్చు." అవి వినిపించింది వృద్ధురాలు.

    "ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు?"

    "రిడ్జి హోటల్ లో ఉన్నారు కాని ఒకసారి వారిని చంపటానికి ప్రయత్నం జరిగింది. కాబట్టి పోలీసు బందోబస్తు అదీ ఏర్పాటు చేశారు.

    ప్రస్తుతం మీరు కలుసుకోవటానికి అవకాశం లేకపోవచ్చు" అందామె.

    చాలా నిరాశగా అందరూ బయటకు వచ్చారు.

    "రిడ్జి హోటల్ కి వెళ్ళి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది?" అంది ఆమని.

    "అనవసరమయిన విషయాలలో ఎక్కువగా కల్పించుకోవటంవల్ల వచ్చే అనర్ధం ఏమిటో నిన్న తెలిసింది. నేను హాస్టల్ కి వెళ్ళిపోతాను" అంది రమోలా!

    "పోనీలే ఇప్పటికయినా బుద్దొచ్చే మమ్మల్ని బ్రతికించావు" అంది ఆమని.

    అందరూ విరగబడి నవ్వారు.

    కాని అక్కడకు వెళ్ళాలన్న ఆలోచన మానలేదు.

    "అంత గొప్ప ప్రొఫెసర్ నగరానికి వస్తే ఆసక్తి కలిగిన విద్యార్ధినులు కలిసి మాటాడి సందేహం తీర్చుకోవటానికి ఎవరు అభ్యంతరపడతారు.

    భద్రతా సిబ్బందిని అడిగి వారి పర్మిషన్ తోనే వెడదాం" అంది.

    అందుకు అందరూ సిద్ధమయారు.

    ముందురోజు పడిన అగచాట్లు తలుచుకుంటోంది రమోలా!

    ఈ ప్రోగ్రాం మార్చేసుకుంటే బాగుండును అనిపిస్తోందామెకు.

    కాని ఎవరూ తను చెప్తే వినే పరిస్థితిలో లేరు.

    ప్రొఫెసర్ మరొక దేశ ప్రతినిధిగా ప్రభుత్వం పనిమీదే వచ్చారు కాబట్టి గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఆ వీధి ముందుగానే పికెట్ ఉంది.

    వారు రిడ్జి హోటల్ గా వెళ్ళే వాహనాలు మనుషులు, అందరి గురించి తెలుసుకుంటున్నారు. పోలీసు అధికారులకు కారణం చెప్పి రిడ్జి హోటల్ దగ్గరకు వెళ్ళి అనుమతి సంపాదించింది ఆమని.

    హోటల్ ముందు కారు ఆగింది.

    కాని వారికి అక్కడ మరో సమస్య ఎదురు అయింది.

    నిన్నటి దినం అనాధాశ్రమం దగ్గర ఉన్న అధికారులు ఆమెను గుర్తించారు. మీరు ముందుగా వచ్చి రమోలా గురించి చెప్పి ఒక అధికారిని కార్యరంగంలోకి దింపి పని చేయించారు. అందువల్ల క్షేమంగా బయటపడింది.

    కాని నిన్నటి ప్రమాదంలో సంబంధం వున్న వ్యక్తులుగా మీరు నమోదు అయ్యారు. మిమ్మల్ని మళ్ళీ ప్రొఫెసర్ దగ్గరకు పంపటం సాధ్యపడదు సారీ!" అని నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు పోలీసు అధికారి.

    అంతటితో ఆమని విడిచి పెట్టలేదు.

    "సరే! కలుసుకునేందుకు వీలు కాకపోతే టెలిఫోన్ లో మాట్లాడేందుకు ఏర్పాటు చేయండి! స్టూడెంట్స్ కి కొన్ని సందేహాలున్నాయి. తీర్చుకుంటారు" అని అర్ధించింది. పోలీసు అధికారి ఆలోచించాడు.

    "ఈ విషయమై ప్రొఫెసర్ ని అడుగుతాము! వారికి అభ్యంతరం లేకపోతే మాకూ అభ్యంతరం వుండదు" అంటూ వారిని విడిచి మరో చోటుకు వెళ్ళాడు.

    తాను ఏ నంబర్ కనక్షన్ తీసుకుంటున్నాడో వారికి అర్ధం కాకుండా కనెక్షన్ తీసుకున్నాడు. ప్రొఫెసర్ తో అర నిముషం మాట్లాడి తిరిగి వచ్చాడు.

    "ఆయన లైన్ లో వున్నారు మీరు మాటాడవచ్చు!" అని చెప్పాడు.

    ఆమని చాలా సంతోషపడింది. అందరూ గుంపు కొట్టి టెలిఫోన్ దగ్గరకు వెళ్ళారు. ముందుగా తనే రిసీవర్ అందుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS