"ఆ పిల్లకు ఇష్టం లేనప్పుడు బలవంతాన చేస్తే లాభమేమిటి? ఆ పిల్ల అతడితో కాపురం చేస్తుందన్న గ్యారంటీ ఏమిటి?" "చేస్తుందో, చేయదో? తనీ పెళ్లికి ఒప్పుకొన్నాకే పెళ్ళి ఏర్పాట్లు చేసుకొన్నాం. ఇంటినిండా చుట్టపక్కాలు వచ్చి చేరాక ఇలా పారిపోయి వస్తే ఎంత నగుబాటు? ఎంత నష్టం?"
"అబద్ధం అత్తా! ఈయన కొడుకో కొండముచ్చులా వుంటాడు. పగలు చూస్తే రాత్రి కలలోకి వస్తాడు.మొదటే చెప్పాను చేసుకోనని. నన్ను ఇంట్లో బంధించి ఎలాగైనా ఆ పెళ్ళి అయిందనిపించాలని కుట్రపన్నారు. స్నానానికి వెడితే. దొడ్డికి వెడితే నా వెనుక ఓ మనిషిని కాపలాపెట్టారు."
"ఏం పెద్దమనిషి? తేరగా చిక్కిం దనుకొన్నారా ఈ పిల్ల? తల్లిలేని పిల్లని తండ్రి ఎంత గారాంగా పెంచుకొన్నాడో తెలుసా? ఈ పిల్ల నాకు చుట్టమేంకాదు. అయినా న్యాయం మాట్లాడే మనిషిని నేను. చిన్నప్పటినుండి ఆపిల్లను చూస్తున్న వాళ్ళు ఈ కాంపౌండ్ లో చాలామంది వున్నారు. ఆ పిల్ల దొంగతనం చేస్తుందంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. ఇక పోతే ఆ పిల్లను బలవంతంగా తీసుకుపోయి పెళ్ళి చేయడానికి నీకేం అధికారం లేదు. రేపొద్దున్న ఆ పిల్ల ఆత్మహత్య లాంటిది చేసుకొంటే మేమంతా సాక్ష్యం వుంటాం. ఆ పిల్లకు ఎవరూ లేరు కాబట్టి తీసుకెళ్ళి వుంచుకో. మీకు బుద్ది పుడితే మీ తాహతుకు తగినట్టు మరో సంబంధం చూచి పెళ్ళి చేసి మీ బావమరిది ఆత్మకు శాంతి చేకూర్చండి. అంతే గాని......."
"మాకేంపట్టింది దాని పెళ్లికి ముండమోయడానికి!" చీత్కారంగా ఉత్తరీయం దులపరించుకొని వెళ్లిపోయాడు బసవయ్య, ఇక తన ఆటలు సాగవని గ్రహిస్తూనే.
పారిజాతను ఇంటికి తీసుకుపోయి అడిగింది కోమలమ్మ. "పారిపోయి వచ్చావు. సరే, ఇంక ఎలా బ్రతుకుదామని నీ వుద్దేశ్యం! ఆడపిల్లవు, దిక్కులేని దానిలా ఏడుస్తూంటే జాలేసి మీ మామయ్యను సాగనంపాను. ఉన్న ఒక్క బంధువునూ పోగొట్టుకొన్నావు"
"ఇప్పుడు నా ఆత్మ బంధువువి నువ్వే అత్తా. నువ్వే నాకేదైనా దారి చూపు. నువ్వు తల్చుకుంటే నా కేదైనా సాయం చేస్తావు!"
"బాగుంది. నేనేం చేస్తాను!" కోమలమ్మ విచిత్రంగా చూసింది.
"నీ ఇంట్లో పనిమనిషిగా ఉంటాను. నాకు కాస్త ఆశ్రయమివ్వు చాలు."
"బాగుందే! కొరివితో తలగోక్కున్నట్టు నిన్నెక్కడ తగిలించుకోను? నిన్నిక్కడ చూసినప్పుడే నా గుండెల్లో రాయి పడింది."
"నేనేం చేశానత్తా?"
"నువ్వేం చేయలేదే! నీ అందం నీ వయస్సు చేస్తాయి ఎంత పని అయినా. మనోహర్ మనసు నీ నుండి మరల్చే సరికి తాతలు దిగొచ్చారు. నువ్వు కాస్త కనుమరుగు కాబట్టి పెళ్ళిచూపులకు వచ్చి, ఆ సంబంధం ఒప్పుకొన్నాడు. ఇప్పుడు మళ్లీ ఏం ముంచుకు వస్తుందోనని భయపడి చస్తున్నాను."
"మీరంతా అనుకొన్నంత ఇదిగా మనూ నన్ను ప్రేమించలేదత్తా! చిన్నప్పటి నుండి తెలిసిన చనువు తప్ప మరేమీ లేదు!" విరక్తిగా అంది పారిజాత. "నిజంగా నీకదే భయమైతే దేవుడిసాక్షిగా చెబుతున్నాను. మనూని నేను ఏ పరిస్థితిలోనూ కోరను. అతడి జీవితానికి నేను ఏవిధంగానూ అడ్డు వెళ్లను. నీకు మాటఇస్తున్నాను. నా ప్రాణంపోయినా సరే. నేనుమాటతప్పను. నీ నీడలో నన్ను తలదాచుకోనీ. తల్లీదండ్రీ ఎవరూ లేని అనాథను! చదువుమానేసి నేనెంత పొరపాటుచేశానో నాకిప్పుడు తెలుస్తోంది. అత్తా! ఆ స్కూల్ ఫైనల్ పూర్తిచేసినా ఎక్కడో చిన్న ఉద్యోగం దొరికేది. నా కాళ్ళమీదనేను నిలబడగల అవకాశం వుండేది. నేనిలా అనాధనై పోతానని కలలో కూడా అనుకోలేదు. నువ్వు చెప్పిన పనంతా చేస్తాను. కాస్త తిండి పెట్టు. ఈ సంవత్సరం పరీక్షకి కడతాను. నీనీడలో నేను మనిషిని కాగల అవకాశం ఇవ్వు, అత్తా!"
కోమలమ్మ అవసరంవస్తే కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడగలదు. ఎంత కఠినంగానైనా వ్యవహరించ గలదు. కాని, ఆ పిల్ల తననో పెద్దమనిషిగా, మంచి మనిషిగా భావించి నువ్వేదిక్కు అన్నట్టుగా మాట్లాడే సరికి మెత్తబడిపోయింది. అంత ప్రాధేయ పడుతూంటే ఎలా కాదనాలి?
"సరే కాని పెట్టిన చేతినే కాటువెయ్యవు కదా?" అని అడిగింది.
"ఉహుఁ. అది నా స్వభావానికే విరుద్దం. ప్రాణం పోయినాసరే. నేను నీపట్ల కృతఘ్నురాలిని కాలేను, కాను. ఒక్క సంవత్సరం నన్ను నీ ఇంట్లో ఉండనివ్వు చాలు."
ఇదీ ఒకందుకు మంచిదే అనుకొంది కోమలమ్మ. నిజంగా వాళ్ళు ప్రేమించుకొని పెళ్ళిచేసుకోదలచుకొంటే ఎవరూ ఆపలేరు. మగపిల్లల్ని ఆపడం అసలే కష్టం ఇలాంటి వాటిలో. ఇహ పారిజాతనే తన చేతిలో పెట్టుకోవాలి. మనూ తొందరపడినా ఈ పిల్ల కాదనేలా చేస్తే చాలు.
"మంచిది నిన్ను వుంచుకొంటాను. కాని, కొన్ని షరతులు నువ్వు మనూ కేసి కన్నెత్తి చూడకూడదు. అతడికి ఏ పరిస్తితిలోనూ ఎదురుపడకూడదు. పెదవి కదిపి మాట్లాడకూడదు!"
