Previous Page Next Page 
ఏటిలోని కెరటాలు పేజి 36


    "నాన్న పోయినప్పుడే ఈ ఇంటిలో నా విలువపోయింది రావడం నా తెలివితక్కువే."

    "అక్కా" బాధపడ్డాడు సూర్యదేవులు.

    అంతవరకూ మౌనంగా కూర్చొని అక్కా తమ్ముళ్ళ మాటలు వింటూన్న శ్రీలక్ష్మి కల్పించుకొంది.

    "అలా నిష్ఠూరాలు వేస్తావేం, వదినా? మామగారు పోతే నువ్వు ఈ ఇంటి ఆడపడుచువు కాదా? ఆ గౌరవాభిమానాలకు లోటెప్పుడూ జరుగదు కాని. నీ దత్త పుత్రుడికి దేవినివ్వడం ఎలా సంభవం? చాలా అసహజమైన సంగతి అది."

    "నా మంచి చెడ్డలు విచారించనివాడు నా కొడుకు. అందుకు ఒకడిని ఏర్పాటు చేసుకొంటే అతడిని నా కొడుకుగా భావించలేరు!" కృష్ణవేణి గాద్గదికంగా అన్నది. రమణ ఎంత బుద్ధిమంతుడు? మూర్తీభవించిన వినయం. భార్గవుడు కల్పించినలోటు వాడుతీరుస్తున్నాడు. "అమ్మా అమ్మా" అని వెంట తిరుగుతూ తండ్రికి ఎంత ఆసరా? ఆయనమీద ఎలాంటి బరువు పడకుండా అన్ని పనులూ నేర్పుగా చేసుకొంటున్నాడు. గొప్ప చదువులు అబ్బలేదన్న మాటేగాని చురుకుదనానికి లోపం లేదు.

    వాడికి పిల్లనిచ్చేవాళ్ళు కరువయ్యారనికాదు. దేవతను కోడల్ని చేసుకోవాలన్న ఆలోచన తొలుతనుండి ఉన్నది కనుక వచ్చాను. అలుసు చేసి మాట్లాడవలసిన పనిలేదు." అభిమాన్యం వ్యక్తపరిచింది కృష్ణవేణి.

    మరి అక్కడుండకుండా స్నానానుష్ఠానాలకు లేచివెళ్ళిపోయారు సూర్యదేవులు.

    "సరేగానిలే, వదినా ముందు స్నానం భోజనం కానీయి తరువాత నిదానంగా మాట్లాడవచ్చు." అన్నది శ్రీలక్ష్మి.

    "ఉహుఁ. ఏ సంగతి తేల్చంది లేవను మీ పిల్లను ఇవ్వదలుచుకోలేదని ఖచ్చితంగా చెప్పండి. ఈ ఇంట గంగకూడా ముట్టుకోకుండా వెళ్ళిపోతాను. మళ్ళీ నాకో పుట్టిల్లుందని కూడా గుర్తుచేసుకోను."

    స్నానంచేసి పట్టుపంచ చుట్టుకొంటూ వచ్చారు సూర్యదేవులు "నువ్వు మరీ అంత నిర్మొహంగా మాట్లాడినప్పుడు నేనూ అలానే మాట్లాడవలసి వస్తుంది. ముందు లే, అక్కా, స్నాన భోజనాలయ్యాక మాట్లాడుదాం. అంతవరకూ నేనేం మాట్లాడను. దేవికూడా ఇష్టపడాలికదా."

    మరి లేవక తప్పింది కాదు కృష్ణవేణికి.
   


                                    15



    దూరంగా కొండవెనుక నుండి పచ్చని పైర్లమీదుగా సాగివస్తూన్న గాలి, డాబామీద నీరెండలో కూర్చొనున్న దేవదాసిని చక్కిలిగింత పెడుతూన్నది. దూరంగా ఈతచెట్లు గుంపులో నుండి ఎగిరివచ్చి దేవదాసి కూర్చొనున్న గోడమీదికి కొమ్మలువాల్చి ఉన్నదానిమ్మ చెట్టుకొమ్మ మీద ఆగింది ఓ పిచ్చుక, చిత్రంగా తోక ఆడిస్తూ కొద్దిగా ఆకుపచ్చ, ఎరుపు మిళితమైన బంగారు పూతతో, భాస్కరుని బంగారు కిరణాలతో పోటీపడుతున్నది. చేతిలోకి తీసుకొని ముద్దుపెట్టుకోవాలనిపిస్తూంది కాని, అది స్వేచ్ఛా విహంగం. మానవుల చేతిలో నిలువలేదు. తనకు పిచ్చుకలంటే భలే యిష్టం. చిలుకను పెంచాలని ఎన్నోసార్లు అనుకొంది. అందువల్ల తను పొందేది ఆనందమే అయినా అడవుల్లో హాయిగా విహరించే పక్షిని తెచ్చి పంజరంలో బంధించి వినోదించడమన్నది ఒక పాపకృత్యం. అందుకని ఆ సరదానే వదులుకొంది.

    బావ ఒకవిధంగా స్వేచ్ఛా విహంగంవంటివాడే మక్కువ కలిగినా బంధించడానికి మనస్సంగీకరించలేదు. బావను పొందాలన్న ఆశను ఏనాడో తుడిచిపెట్టేసుకుంది. తాతగారి మరణంవల్ల తనలో కలిగిన ఊహలూ, ఆలోచనలూ, తనలో చిత్రమైన మార్పును తీసుకువచ్చాయి. నిర్వేద గాంభీర్యాలతో నిండి ఉంటుంది మనసెప్పుడూ.

    మేనత్త రావడం, ఆమె దత్తపుత్రుడికి తననివ్వమనడం, అమ్మా, నాన్న అంగీకరించకపోవడం అన్నీ చూస్తున్నది. తిరుమలాపురం సంబంధం ఇదివరకే చెడిపోయింది. తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చినవారు తాతగారి పాడె ఎత్తవలసి రావడంతో పిల్ల లక్షణవతి కాదన్న కళంకం ఒకటి తనకంటగట్టి మరో సంబంధం చూసుకొన్నారు వాళ్ళు. ఈ కళంకం వెంటబెట్టుకు వెళ్ళి తనకు మరో సంబంధం తీసుకు రాగలరా అమ్మా నాన్న? "నయం, మీ ఇంట్లో లేచిన పీనుగ మా ఇంట్లో లేవలేదు" అన్నారట తిరుమలాపురం వాళ్ళు. ఈ మాట మరోచోట మటుకు ఎదురుకాదా? అవమానాలు పొందేకంటే అత్త పెంపుడు కొడుక్కు ఇవ్వడమే బాగుంటుందేమో? బావను భర్తగా పొందలేకపోయినా మేనత్తనైనా అత్తగా పొందడం గుడ్డిలో మెల్లగా ఉంటుంది.

    "అక్కా, అమ్మ పిలుస్తున్నదే." సువర్ణ ప్రతిమ వచ్చి పిలిచింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS