Previous Page Next Page 
అగ్ని కెరటాలు పేజి 36


    "నువ్వెన్ని మాటల ఈటెలు విసిరినా నేనీ విషయంలో అనుమతించబోను  చక్కగాచదివి  చల్లగా ఓ అయ్య చేతిలో పెట్టేంతవరకే నా ఆదర్శంగాని నిన్ను వీరఝాన్సీలా గానో, రుద్రమదేవిలాగానో మలచాలని నా ఆశయంకాదు.

     ఆ ప్రయత్నం నేనెప్పుడూ చేయలేదని నువ్వు గుర్తు తెచ్చుకొంటే మంచిది."


                       *    *    *    *

   
    తను రాత్రి పడుకొన్న తరువాత ప్రమీల ఈ అఘాయిత్యం తల పెట్టిందని, పిల్ల గుక్కపెట్టి ఏడుస్తూంటే తనకు మెలుకువ వచ్చి చూసేసరికి ప్రక్కగదిలో ప్రమీల తగల బడిపోతూ కనిపించిందని, మంటలార్పే ప్రయత్నంలో తన చేతులు కాలాయని కాలిన తన చేతులు అందరికీ చూపాడు లక్ష్మీకాంతం. "కోపం వస్తే నేను మనిషి కాదు. పశువులా ప్రవర్తిస్తాను కాని ఇంత అఘాయిత్యం తల పెడుతుందని నేను అనుకోలేదు. బిడ్డముఖమైనా ఎందుకు చూడలేదో." అని లక్ష్మీకాంతం ఏడుస్తూంటే.

    "ఆ దొంగ ఏడుపు చాల్లేరా! పెళ్లాంమీద నీకెంత ప్రేమో మాకు తెలియదా?" అన్నాడొకాయన. "పోలీసులొస్తే బాగుండేది!  ఇది హత్యో ఆత్మహత్యో తేల్చేవాళ్లు నీ తోలు వలిచి నీ నోటినుండే జరిగింది చెప్పించే వాళ్లు." అందొకామె.

    లక్ష్మీకాంతం ఎదురుగానే నిర్బయంగా తమ వ్యాఖ్యానాలు సాగిస్తున్నారు.
 
    పోలీసులొస్తే బాగుండేదని అందరూ అంటున్నారు గాని పోలీసులకీ విషయం తెలియజేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు.

    ప్రక్క వూళ్లోనే వున్న లక్ష్మీకాంతం తల్లీ, అక్కా బావగారు పదిగంటలకల్లా దిగారు. హడావిడిగా శవ సంస్కారానికి ఏర్పాట్లు చేస్తూంటే ఎవరూ అడ్డగించే ప్రయత్నం చేయలేదు. ఇళ్లమధ్య శవం వుంటే స్నానాలు భోజనాలు చేయమని, శవం ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత తొందరగా స్నానం చేసి వండుకోవచ్చని ఎదురుచూస్తున్నారు.
 
    పదిన్నరకల్లా శవాన్ని తీసుకుపోయి బూడిద చేయడం అయిపోయింది.

    బూడిద చేసివచ్చాక అప్పుడు ప్రమీల పుట్టింటికి టెలిగ్రాం ఇచ్చారు ప్రమీల చనిపోయిందని.

    మరునాడు మధ్యాహ్నం అందింది టెలిగ్రాం. తల్లి, తండ్రీ, చెల్లెళ్లూ గోలుగోలున ఏడుస్తూ వచ్చిపడ్డారు. చూచుకోవడానికి కూతురి శవం కూడా మిగల్లేదని తెలిసే సరికి వారి దుఃఖం పరాకాష్టనందుకొంది.

    ఓ గంట తరువాత -

    గర్బశోకంతో ఇంటికి వచ్చిన ప్రమీల తల్లిని చూసి,  తప్పుచేసిన దానిలా తలదించుకొంది హేమలత.

    "ఇప్పుడేడిస్తే లాభమేమిటండీ! ముందే వుండాలి ఈ తెలివి చంపినా, నరికినా మీ ఇష్టం అని అల్లుడి చేతిలో పెట్టినరోజు ఏమైంది ఈ కన్న మమకారం?" ఎత్తిపొడుపుగా అంది హరిత.

    "పెళ్లాలని కొట్టే దురలవాటు చాలా మంది మగవాళ్లలో వుంటుందమ్మా! కొడితే రెండు దెబ్బలే కదా! పడ్డవాళ్లు చెడ్డవాళ్లు కాదు కొంచెం ఓపిక పడితే ప్రమీలకు మంచిరోజులొస్తాయనుకొన్నాను గాని ఏకంగా పిల్లను కాల్చి చంపేస్తాడని అనుకోలేదు. నాకిలాంటి క్షోభ పెడతాడని అనుకోలేదు!" ఆవిడ బోరుమంది.

    "అది హత్య అని మీకు నమ్మకంలేదా?"

    "ముమ్మాటికీ ఇది హత్యేనమ్మా! మగడంటే ఎంత అసహ్యమున్నా  పిల్లఅంటే  దానికి చెప్పలేని  మమకారం. తల్లిలేని పిల్లను చేసే  నిర్ణయం అది ఎప్పటికీ తీసుకోదు! ఎన్ని కష్టాలున్నా ఆ పిల్లకోసం బ్రతికేది. ఖచ్చితంగా వాడే నా కష్టాలున్నా ఆ పిల్లకోసం బ్రతికేది.  ఖచ్చితంగా  వాడే నా  బిడ్డను చంపేశాడు!  బ్రతికుండగానే ఒంటిమీద  కిరోసిన్ పోసి తగలబెట్టి చంపాడు.  వంటచేస్తున్నప్పుడు కాస్త చురుక్కున  కాలితేనే గిలగిల్లాడిపోతామే! అయ్యో బిడ్డా!  బ్రతికుండగానే నిన్ను కాల్చేస్తుంటే ఎంత విలవిల్లాడావో కదా ఎంత నరకం అనుభవించావో కదా?" ఆవిడ గుండెలు బాదుకొని ఏడవసాగింది.

    "ఏడిస్తే కడుపుమంట చల్లారుతుందా? వాడికి తగిన ప్రతీకారం చేసి ప్రమీల ఆత్మకు శాంతి చేకూర్చండి."

    "ఇప్పుడేం ప్రతీకారం చేయగలనమ్మా?" అంతా అయిపోయింది? పిల్ల శవాన్ని కూడా మిగల్చలేదుకదా?

    "శవం మిగల్చకపోయినా, రాతరి ప్రమీలను కొట్టగ ఆ శబ్దాలు విన్న వాళ్లు, ప్రమీల గావుకేకలు విన్నవాళ్లు వున్నారు. మీరు కేసు పెడతామంటే డౌరీడెత్ కమిటీ వాళ్లను మీ వెనుక నిలబడేట్టు చేస్తాను. సాక్ష్యాలు సేకరించడం, కేసు నడపడం అంతా వాళ్లే చూచుకొంటారు! కేవలం మీరు కేసు పెట్టడానికి సమ్మతించడమే!"
    "మేం ఉండేది ఒక ఊళ్ళో. అది చచ్చింది ఒక ఊళ్ళో! కేసు పెట్టి తిరగడానికి మాకు డబ్బులు ఎక్కడివమ్మా?"
    "ఖర్చు కూడా కమిటీవాళ్లె భరిస్తారు!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS