Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 36

    శ్రీశ్రీగారు  ఎప్పుడూ  మల్లీశ్వరిలో  రెండు పాటలు  పాడమనేవారు  నన్ను. 'ఎవరే పిలిచేరల్లన మెల్లన_పిల్లల గ్రోవిని_ప్రియా ప్రియా' అనేది ఒకటి. ఆపాట  వారికి చాలా ఇష్టం. కూనిరాగాలతో  తరచుగా ఆపాటే  పాడేవారు. రెండవది నా ఫేవరేటు పాట. 'ఎందుకే నీకింత తొందరా' అన్నదొకటి. 'పిల్లనగ్రోవి  ప్రియా ప్రియా' అని నేను పాడుతూవుంటే  శ్రీశ్రీగారు 'పిల్లనగ్రోవితో  అని పాడు సరోజా' అని ప్రతిసారీ చెప్పేవారు. మల్లీశ్వరి పాటల ద్వారానే కృష్ణశాస్త్రిగారి పేరు  నాకు బాగా  జ్ఞాపకం  వుండిపోయింది.

    శ్రీశ్రీగారి దగ్గరికి వచ్చిన తర్వాత కృష్ణశాస్త్రిగారి గురించి  వారు చెప్పటం, మేం తరచుగా వారిని స్టూడియోల్లో  కలుసుకోవడమూ  జరుగుతూవుండేది. ఒకరోజు  నన్ను శ్రీశ్రీగారు అడిగేరు. "కృష్ణశాస్త్రిగారి రికార్డింగ్ కు వెళదామా  అంటే వెంటనే  బయల్దేరతావుకదా. వారి పాటలంటే  నీకంత ఇష్టమా" అని.

    "సినిమా రంగంలో మళ్ళీ ఇలాంటి పాటలు రాయడానికి వీల్లేదన్నట్లుగా  మల్లీశ్వరి పాటలు రాసి  పారేశారండి. ఔనా కాదా" అని అడిగాను.

    "నిజమే" అన్నారు.

    "వారి గొంతు ఎప్పుడు పోయిందని?" అడిగాను.

    "మల్లీశ్వరి  తర్వాతనే అనుకుంటా" అన్నారు.

    తన దగ్గరికి  వచ్చిన వాళ్ళతో  కృష్ణశాస్త్రిగారు  చిన్న చిన్న నోట్ బుక్ ల మీద రాసి ప్రసంగించేవారు. నా దురదృష్టం నేను  వారిని చూసి వున్నాను.

    అదీ పరిస్థితి. వారి మాటను  వినలేకపోయాననుకుంటూ "ఏమండీ కృష్ణశాస్త్రిగారికి మీరంటే ఇష్టమేనా?" అని అడిగాను.

    "కృష్ణశాస్త్రిగారు  వారు రాసిన ఒక పుస్తకంలో శ్రీశ్రీ గొప్పకవి. అతనిమీద  ఈగవాలినా  నేను సహించలేనని రాశారట. దాన్నిబట్టి  అర్ధం చేసుకో" అన్నారు.

    "అట అంటున్నారు మీరు చూడలేదా?" అని అడిగాను.   

    "లేదు. వారు స్వయంగా  చెప్పారు. నామీద  వారికెప్పుడూ సదభిప్రాయమే వుంది. నాకు కూడా  వారిమీద వల్లమాలిన  అభిమానం. నా మనస్సుమీద చెరగని ముద్రలు వేసిన ముఖ్యాతి ముఖ్యులలో  కృష్ణశాస్త్రిగారిని ప్రముఖంగా పేర్కొంటాను" అన్నారు.

    (కృష్ణశాస్త్రిగారి  ప్రసక్తి వచ్చింది కనుక వారి ఆఖరి విషయం కూడా ఇక్కడే చెబుతున్నాను)

    కృష్ణశాస్త్రిగారు  చనిపోయిన రోజున నేను, శ్రీశ్రీగారు, మా అబ్బాయి బైజు_వెంకటరమణ జిన్నూరులో వున్నాం. అక్కడ  నిరీశ్వరాశ్రమం వార్షికోత్సవ సభలో  పాల్గొనడానికి వెళ్ళాం అన్నమాట. (మేం ప్రయాణంలో వుండగానే శాస్త్రిగారు చనిపోయారు.)

    అక్కడ మమ్మల్ని  ఆదరించిన మిత్రుల  పేర్లు జ్ఞాపకం  లేకపోయినందుకు విచారిస్తున్నాను.

    పేర్లయితే  మరిచిపోయాను  కాని మంచిది మారు పేరనుకొనే  ఆ భార్యాభర్తలిద్దరూ  తలుచుకున్నప్పుడల్లా  నా కళ్ళముందు మెదులుతూ వుంటారు. వారి రూపాలు మరిచిపోలేదు. ప్రాణం పెట్టేరు. నేను ఎన్నో ఊళ్ళు  తిరిగాను  కానీ  వాళ్ళని మాత్రం మరిచిపోలేదు.

    శ్రీశ్రీగారు అలవాటు ప్రకారం పెద్ద టర్కీ టవల్  కట్టుకుని  వరండాలో వున్న వాలుకుర్చీలో నడుం వాల్చారు. నేను లోపల వున్నాను.

    "సరోజా" అని కేకవేశారు.

    "ఏమిటండీ" అంటూ  వచ్చాను.

    "సిగరెట్ పెట్టె తీసుకురా" అన్నారు.

    ఇచ్చేసి  మళ్ళీ లోపలికి వెళ్ళబోయాను.

    "కూర్చో సరోజా" అన్నారు.

    ఇంతలో  ఒక కుర్రవాడు వారిని చూడటానికి వచ్చాడు. నేను లేవబోయాను. "ఫరవాలేదు కూర్చో" అన్నారు. ఆ కుర్రవాడు నాకు కూడా నమస్కారం చేశాడు. నేను ప్రతి నమస్కారం చేశాను.

    అతను శ్రీశ్రీగారిని  చూసి "ఉదయం ప్రాంతీయ వార్తలు విన్నారా" అని అడిగాడు.

    శ్రీశ్రీగారు  వెంటనే  అనుమానంగా  చూస్తూ_"లేదు ఏమిటీ సంగతి" అని అడిగారు.

    "కృష్ణశాస్త్రిగారు హైదరాబాదులో  చనిపోయారండీ" అన్నాడు.

    అంతే ఒక్కక్షణం  ఏమీ మాట్లాడలేకపోయారు. తేరుకుని "శాస్త్రిగారు హైదరాబాదులో మరణించడం ఏమిటి? ఆయన మద్రాసులో కదా వున్నార"ని  అడిగారు.

    పాపం  ఆ కుర్రాడు  తొట్రుపాటుతో  "హైదరాబాదు వార్తల్లో విన్నాను" అన్నాడు.

    శ్రీశ్రీగారు  ఈసారి  ఓ అయిదు  నిముషాలదాకా  మాట్లాడలేదు. వారు ఏమైనా చేబుతారనుకున్న  ఆ కుర్రవాడు వారి మౌనం చూసి నిరుత్సాహంతో  వెళ్ళిపోయాడు.

    హఠాత్తుగా విన్న  కృష్ణశాస్త్రిగారి  మరణవార్త  నన్ను ఎంతో  బాధపెట్టిందో  అంతగానూ  భయపెట్టింది. అసలే వేదాంతం పుట్టని, ఎంత గొప్ప వాళ్ళయినా  అంతేకదా  అనుకుంటూ  కళ్ళవెంట నీళ్ళు పెట్టుకుని నిర్ఘాంతపోయి  కూర్చున్నాను.

    శ్రీశ్రీగారు రెండు, మూడుసార్లు  పిలిచినట్లున్నారు. నా బుర్రకేమీ  ఎక్కలేదు. బాగా పరిచయం వున్న వారి మరణవార్త  నన్ను బాగా  కృంగదీసింది.

    పిచ్చి పిచ్చి ఆలోచనతో  నేను మునిగిపోయి  వుండటంతో  ఇక నన్ను పిలిచి లాభం లేదనుకున్నారో ఏమో"సరోజా" అంటూ  వీపుమీద  ఒక్క  చరుపు  చరిచేరు.

    "ఏమిటండీ" అన్నాను తృళ్ళిపడి.

    "వెళ్ళి కాగితం ,పెన్నూ  పట్టుకురా" అన్నారు.

    వెంటనే వెళ్ళి తీసుకు వచ్చాను.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS