వంటరిగా ఆడపిల్లవుంటే యిన్ని సమస్యలు, ఇంకెన్నో ప్రశ్నలు ఎదురవుతాయని మాధవరావు చెప్పినప్పుడు తను అంత స్పష్టంగా వినలేదు. కావాలని అతిశయోక్తులు చెప్పుతున్నాడనే భావించించి.
అతను వెళ్ళిపోయినా దగ్గిరనుంచీ తను వేధించుతున్న హోటల్ సర్వర్సు! మేనేజరు యక్ష ప్రశ్నలు!....అంత కోపం తిరిగి తిరిగి మాధవరావుమీదకి మరలింది. అతను వచ్చిన తరువాత అడగవలసిన మాటలన్నీ అడిగేయాలనుకుంది. అందుకు మనసులోనే రిహార్సల్స్ వేసుకున్నది.
మరలా ఎవరయినా వచ్చి తలుపులు తట్టుతారేమో? అలా తిట్టితే గట్టిగా చివాట్లు వేయాలి!...లేకపోతే ఈ రూం కాళీ చేసి మరొక హోటల్ కి వెళ్ళాలి! ఈ బాధ భరించలేదు తను!
ఇంతలో యింటివద్ద తనను గురించి ఏమనుకుంటున్నారో? ఎక్కడెక్కడ వెతుకుతున్నారో?....అసలు వెతికించే ప్రయత్నం చేస్తున్నారో లేదో? ఎవరు ఎలా బాధపడినా వినాయకం బావ మాత్రం తీవ్రంగా బాధ పడతాడు. తనకసలె అభిమానం. పెళ్ళి మూడు రోజులు వుందనగా కాబోయే భార్య లేచి వెళ్ళిపోయిందని తన స్నేహితులు ఎంత హేళన చేస్తున్నారో? అసలు బైటికి వచ్చి వుంటాడా ఈ రోజున?....
ఆలోచించుతున్న కావేరికి తలుపు చప్పుడయింది. తన రూం తలుపులేనా? లేక ఇంకేదయినా చప్పుడా? అని నిదానించి విన్నది.
తలుపు చప్పుడు కావేరి ఆలస్యం చేసిన కొలదీ ఎక్కువవుతోంది. భయంతోనే వెళ్ళి నెమ్మదిగా తలుపు తెరిచింది.
ఎదురుగా మాధవరావు!
వడలిన ముఖంతోను, ఎందుకు అలిసిపోయినట్లున్న వాలకంలో కావేరీని తప్పించుకుని లోపలికి వచ్చి చేతిలోని జిప్ బాగ్ ని టేబుల్ మీద పడవేసి కూజాలోని నీళ్ళు గ్లాసులోకి వంచి గడ గడా తాగేశాడు మారు క్షణంలోనే!
తలుపులుమూసి మాధవరావునే చూస్తూ నిలబడిపోయింది.
అలా అతడిని చూస్తుంటే కోపం, దుఃఖం పెల్లుబికాయి.
ఏమంటే ఏం బాధపడతాడో? అదీగాక పరిచయంఅయి పన్నెండు గంటలుకోదా కాలేదు. తనను అపార్ధం చేసుకుంటాడేమో? జిప్ బాగ్ తెరిచి అందులోనుంచి చిన్న వెల్వెట్ బాక్స్ తీసి కావేరికోసం చూస్తే తలుపులు మూసి అక్కడే నిలబడి వుండటం చూశాడు.
"అదేమిటి? అక్కడే నిలబడిపోయావు? నేను ఆలస్యంగా వచ్చానని కోపం వచ్చిందా?" అనడిగాడు సౌమ్యంగా!
అతనలా అడుగుతుంటే దుఃఖం పెల్లుబికి వచ్చింది కావేరికి. అమాంతంగా వచ్చి మాధవరావుని చుట్టేసింది ఏడుస్తూ-
"మీరు లేకుండా నన్ను ఇక్కడ ఒక్కక్షణంకూడా వుంచవద్దు. ఇంకేదయినా హోటల్ కి వెళ్ళుదాం మీరులేకుండాచూసి సర్వర్సు, హోటల్ మేనేజరు అందరూ ననను ప్రశ్నలతో వేధించటం! భోజనం కావాలా? అని మాటిమాటికీవచ్చి తలుపులుకొట్టి అడగటం...నువ్వెవరవు, ఎక్కడ నుంచి వచ్చావు? నీ భర్తేనా అతను? అని ప్రశ్నించటం! అమ్మో! నేనిక్కడ ఇంకొక్కక్షణం వుండను వంటరిగా వుండాలంటే ఎంత భయంగానో వుంది!"
"నువ్వు భయపడతావని, ఒక్కదానివే వుండలేవనికూడా తెలుసు! ఎంత త్వరగా వద్దామన్నా పనులవలన తెమలలేదు. బయటికి వెళ్ళానంటే ఒకరా? ఇద్దరా? ఎంతోమంది సినీఫీల్డులో తెలిసినవాళ్ళున్నారుగా? ఎంత తప్పించుకుని వెళ్ళిపోవాలన్నా మరొకతను ఎదురు అవుతాడు. హోటల్లో ఎక్కడున్నా యిలాంటి ప్రస్నాలతోనే వేదిన్చుతారు....వాళ్ళనోళ్ళు మూయించటానికనే నీకని యిది తెచ్చాను...చూడు!" అంటూ వెల్వెట్ బాక్సు ఇచ్చాడు.
పెట్టె మూతతెరిచి చూసిన కావేరీకి బంగారపు సూత్రానికి పసుపుతాడు కట్టివున్నది. దాన్ని చూడగానే కావేరి ముఖం వెలవెలా పోయింది. తను యిది కట్టుకోవాలా? అంటే? తనకి పెళ్ళి అయినట్టా? ఎవరితోను? ఈ మాధవరావుతోనా? ఛా...ఛా...! ముక్కూ మొహం తెలియనివాడికి తను భార్యా? అంతలో వినాయకరావు గుర్తువచ్చాడు.
బావంటే తనకిష్టమే! కాని ఇంకో మూడురోజులలో తనమెడలో మూడుముళ్ళూ వేసే బావని వదులుకుని మద్రాసు వచ్చేసింది సినిమాలో కధానాయకి వేషాలువేసి లక్షలు సంపాయించాలని! అనుకోకుండా ఎదురయిన ఈ సంఘటన కావేరీని ఎటూ నిర్ణయించుకునేటట్టు చేయలేదు.
"ఆలోచించుతున్నావా?"
"లేదు! లేదు! చూస్తున్నాను!" తడపడింది.
"ఈ పసుపుతాడు, ఈ సూత్రం నీకు నాతో పెళ్ళి అయిందన్న లైసెన్సుకోసమే! కారుడ్రైవర్ కి లైసెన్సు లేకపోతే అతను డ్రైవింగ్ చేయటానికి అనర్హుడు! చట్టం వప్పుకోదు! అలాగే ఇతర వాహనాలకి కూడాను. ఏదయినా ఖరీదుగల వస్తువు కొన్నప్పుడు బిల్లుతీసుకోక ట్రాన్స్ పోర్ట్ చేశామనుకో చట్టం వప్పుకోదు! ఒక యిల్లుగాని, ఓ స్థలం గానీ కొనుక్కున్నామనుకో! కొన్నామని చెప్పుకుంటే సరిపోదు! డానికి సరయిన ఆధారం రిజిస్ట్రేషన్! అదివుంటేచాలు! అలాగే ఆడపిల్ల వంటరిగా వున్నదంటే చట్టమూ వప్పుకోదు! ఆ చట్టంలోవున్న మనుష్యులూ వప్పుకోరు ఈ తాళి కట్టినంత మాత్రాన నాతో కాపురం చేయమని వత్తిడి చేయను. నాకు భార్యవుంది. హోటల్ మేనేజర్ లాంటి దుర్మార్గుల నుంచి నిన్ను రక్షించటానికే ఈ తాళి! ఏ నిర్మాతదగ్గిరకయినా వెళ్ళినప్పుడు ఈ తాళితీసి పర్సులో పెట్టుకోవటమే! పెళ్ళి అయిందన్న సంగతి సినీఫీల్డులో వారెవ్వరికీ తెలియకూడదు. నీ క్షేమంకోరే తెచ్చాను. నేను యిలా హోటల్లో అడుగుపెట్టానో లేదో మేనేజరు నన్నుచూసి నీ గురించి యక్షప్రశ్నలు వేశాడు. ఎన్ని అడిగినా నువ్వు నా భార్యవనే చెప్పాను! టిఫిన్ తరువాత నువ్వేమీ తినలేదటగ? త్వరగా యిది నీమెడలో వేసుకో! క్రింద డైనింగ్ హాలులోకివెళ్ళి భోజనం చేద్దాం!" అన్నాడు.
"అమ్మో...అక్కడికి నేనురాను...అందరూ నా వైపుకే చూస్తారు!"
"తాళి మెడలో వున్నంతరకూ నిన్ను ఎవరూ ఏమీ చేయరు. పక్కన నేను వుంటానుకాబట్టి అంత సాహసం ఎవరూ చేయరు. మనకు ఇల్లు దొరికేవరకూ ఈ హోటల్గదే శరణ్యం. మనం ఈ రూంలోనే వుండాలనుకుంటే ఈ తాళి నువ్వు వేసుకోవలసిందే!" అన్నాడు కావేరీనే నిశితంగా చూస్తూ.
మాధవరావు చెప్పింది నిజమే అన్న రాజీకి వచ్చింది కావేరి! అతని అండలేకపోతే ఈ సినీఫీల్డులో తన మొహం చూసేవాళ్ళు ఎవరుంటారు! అసలు తనకెవరు తెలుసు? మాధవరావంటే అసిస్టెంటు డైరెక్టర్! పైగా ఎన్నో సంవత్సరాలనుంచి సినీఫీల్డులో వున్నాడయ్యే! ఇతనితోనే వుంటే తాను త్వరలో పెద్ద హీరోయిన్ కాగలదు! తనకి పరిచయస్తులంటూ ఎవరూలేరు! దైవవశాత్తూ ఏదో తనని ఆదుకునేందుకు వచ్చిన ఆపద్భాంధవుడిలాగా స్టేషన్ లో కలిశాడు. యింతవరకూ బాగానే చూశాడు. యింకా ముందు ముందు తనను బాగానే చూస్తాడన్న నమ్మకమూ వుంది.
