బెల్ మ్రోగింది. రాధాదేవి ఈ లోకంలోకి వచ్చింది. బెల్ ఒకటే మ్రోగుతూంది. రాధాదేవి విసురుగా తలుపులు తెరిచింది.
ఎదురుగా హిప్పీరావూ, హేమ కన్పించారు.
"మళ్ళీ ఎందుకొచ్చారు?" అరిచినట్టే అంది రాధాదేవి.
రాధాదేవి రూపం చూసి హిప్పీరావూ, హేమా బెదిరిపోయారు. ఒక్కరికీ నోరు పెగల్లేదు.
"వెళ్ళిపోండి! వెంటనే వెళ్లిపోండి! ఊఁ! నడవండి"
"మేం రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నాం! డబ్బు అయిపోయింది" ఎలాగో గొంతు పెగల్చుకుని అన్నాడు హిప్పీరావు.
"ఇక్కడే నిల్చోండి! లోపలకు రాకండి" అంటూ రాధాదేవి లోపలకు వెళ్ళింది.
రెండు నిముషాల్లో తిరిగొచ్చింది___"ఇవిగో తీసుకెళ్ళండి! రెండువేలు వెళ్ళండి" హిప్పీరావు చేతిలో డబ్బు కట్టలు పెడ్తూ అన్నది రాధాదేవి.
అంత డబ్బు చేతిలో పడగానే హిప్పీరావు ముఖం విప్పారింది. ఏదో అనబోయాడు__
"ఇంకేం మాట్లాడొద్దు. ఈసారి నేను రమ్మనేంతవరకూ రాకండి" అంటూ తలుపులు దభాల్న వేసింది.
బయట ఎవరితోనో తల్లి మాట్లాడుతున్నట్లు వినిపించి ఇందిర బయటకు వచ్చింది.
తలుపులు మూసి వెనక్కు తిరిగిన రాధాదేవి కూతుర్ని చూసి వెలవెలబోయింది.
"ఎవరమ్మా వచ్చింది?" అడిగింది ఇందిర.
"ఎవరోలే! నీకెందుకు?" విసురుగా అని తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుంది.
ఇందిర ఓ క్షణం మూసిన తలుపులకేసి చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చింది.
28
"నిజం చెప్పు- ఆ ముసలాడి కూతుర్ని లేవదీసుకొచ్చి ఎక్కడ పెట్టావు?" రమ అంజిబాబును నిలదీసి అడిగింది.
అంజిబాబు అనుకోకుండా ఎవరో తలమీద కర్రతో గట్టిగా కొట్టినట్టు స్తంభించిపోయాడు.
"నాకేం తెలియదు" పూర్తిగా షాక్ నుంచి తేరుకుని అంజిబాబు యాంత్రికంగా జవాబిచ్చాడు.
"అబద్ధం! నువ్వే ఆ పని చేసివుంటావు. లేకపోతే ఆ పెద్దమనిషి అలా ఎందుకు నిలదీశాడు? అన్నీ దొంగవేషాలే" అంజి ముఖంలోకి అనుమానంగా చూస్తూ అన్నది రమ.
"పెళ్లాన్నే పోషించలేని నాకు మరో ముండకూడా ఎందుకు?" అన్నాడు అంజి విసుగ్గా_
"నా నెత్తిమీద చెయ్యి పెట్టి చెప్పు"
"నిజంగా నీతోడు! అమ్మతోడు! ఆ ముసలాడ్ని గాని వాడి కూతుర్ని గానీ నేను ఎప్పుడూ చూళ్ళేదు" అన్నాడు అంజి నెత్తిమీద చెయ్యి పెట్టి.
"అది సరేగాని! మనం అనవసరంగా తిరిగి సమయం వృధా చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది! ఆ సాక్షులు దొరకరు."
"మన ప్రయత్నం మనం చేద్దాం రమా! ఈ విషయంలో నువ్వు పూర్తిగా సహకరించాలి!"
రమ అంగీకరించింది.
అంజిబాబుకు ఓ ఆలోచన తట్టింది. జ్యోతిష్యుని వేషం వేసుకుని ఊరిబయట మర్రిచెట్టు క్రింద కూర్చున్నాడు. రమ కూడా వేషం మార్చి ప్రక్కన కూర్చుంది.
చేతులు చూపించుకోవటానికి వచ్చిన యువతుల్ని ముఖ్యంగా ప్రకటనలో వున్న పోలికలున్న యువతుల చేతులు చూస్తూ "నీ కూతురికి నీళ్ళగండం తప్పింది" అని చెప్పి వారి ముఖాల్లోకి చూడసాగాడు! కొందరు ఆడపిల్లలు లేదన్నారు! ఒకామె మాత్రం తనకి పిల్లలు లేరనీ, తన చెల్లి పిల్లకి నీళ్ళగండం తప్పిందనీ చెప్పింది. అంజి కళ్ళు ఆనందంతో మెరిశాయి!
"అవును ఆ పిల్లను ఒక యువకుడు రక్షించాడు. ఆ పిల్ల బంతికోసం పరిగెత్తుతూ నీళ్ళలో పడింది" అన్నాడు అంజి.
"అరే! అచ్చం చూసినట్టు చెప్పారే?" అన్నది ఆ యువతి ఆశ్చర్యంగా.
దాంతో అంజికి ఉత్సాహం వచ్చింది.
"నాకు పిల్లలు కలుగుతారా?"
"చెప్పలేను! మీ రేఖలూ, మీ చెల్లెలి రేఖలూ మారిపోయాయి. అందువల్లనే మీ చెయ్యిచూసి మీ చెల్లెలి కూతురి సంగతి చెప్పగలిగాను. మీ చెల్లెల్ని తీసుకురండి ఆమె చెయ్యిచూసి మీకు పిల్లలు పుడతారో లేదో చెబుతాను" అన్నాడు అంజి.
రమ భర్త తెలివి తేటలకు మురిసిపోయింది.
"మా చెల్లెలు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది" ఆ యువతి దిగాలుపడిపోతూ.
అంజి ఉత్సాహం అంతా నీళ్ళల్లో పోసిన ఉప్పులా కరిగిపోయింది.
జ్యోతిష్యానికి సంబంధించిన పుస్తకాలు దూరంగా పారేసి లేచి నిలబడ్డాడు.
ఆ యువతి ఆశ్చర్యంగా అంజి ముఖంలోకి చూస్తూ నిలబడిపోయింది.
రవీ, ఇందిరా పార్కు బెంచీమీద కూర్చుని ఉన్నారు. గడువు ఇంకా మూడు రోజులు మాత్రమే వుంది. రవి చాలా విచారంగా కన్పిస్తున్నాడు. మనిషి బొత్తిగా క్రుంగిపోయాడు.
"బాధపడుతున్నావా రవీ! ఇంకా మూడు రోజులు గడువుంది. నాకు ఇంకా ఆశగానే వుంది" అన్నది ఇందిర.
