గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర కూర్చుని తాజ్ హోటల్ ని చూస్తూ పగళ్ళూ, నల్లని నీళ్ళపై ప్రతిఫలించే మేడ దీపాలను చూస్తూ రాత్రుళ్ళూ గడిపాను.
కాని, అక్కడ ఎక్కడా బోసూ, భగత్ సింగ్ ల పేరు తలచేవాళ్ళు కన్పించలేదు. భారతదేశం యావత్తూ గాంధీ మయమైపోయింది. ఏమి చేయాలో నాకూ తోచలేదు.
అప్పటికి అన్నం తిని వారం దాటింది. యాచించటం రాదు. ఓ సాయంత్రం ఆకలితో నీరసించి గేట్ వే ఆఫ్ ఇండియా వద్దనే కూలబడ్డాను. ఆ తరువాత ఏమైందో నాకు తెలియదు.
కళ్ళు తెరిచి చూసేసరికి తాజ్ లో ఓ గదిలో వున్నాను. ఎదురుగా ఓ వృద్ధురాలు కూర్చుని వుంది. ఆమె ఏ రాష్ట్రానికి చెందుతుందో వేషాన్నిబట్టి ఊహించలేకపోయాను. ఉత్తరాది వర్ణం తెలుస్తూనే వుంది. బహుశా నన్ను చూచి జాలిపడి రక్షించి వుంటుంది. కాని మాట్లాడేదెలా?
ఆమె ఏదో మాట్లాడింది నేను కళ్ళు తెరవటం చూచి. నాకు అదేదో కూడా తెలియలేదు. తరువాత ఇంగ్లీషులో ఏదో అడిగింది. తెలియదని సైగచేశాను. నీవు ఏ భాష మాట్లాడగలవని సైగ చేసింది. సంస్కృతంలో ప్రారంభించాను.
"మాది ఆంధ్రదేశం, ప్రసిద్ధమైన అమరావతిలో పుట్టాను. పవిత్రమైన అమర లింగేశ్వరుడి పాదాల వద్ద పెరిగాను, పంచకావ్యాలు చదివాను." ఆమె ముఖం విప్పారింది. సంతోషంతో తల ఊపింది.
"అయితే దిక్కుతోచని ఈ అయోమయ నగరంలో ఎందుకొచ్చి పడ్డావు?" ప్రశ్నించిందామె ప్రేమగా.
మొత్తం కథ చెప్పాను. కాని గాంధీగారికన్నా బోసూ, భగత్ నన్ను ఆకర్షిస్తున్నారని వివరించాను.
"అయితే నీవు తప్పకుండా సబర్మతి. శాంతి నికేతన్ చూడాలి. నన్ను నీ సోదరిగా భావించు" అంటూ ఆమె నిమ్మరసం తెప్పించి ఇచ్చింది. డాక్టరును పిలిచి మందులూ వగైరాలు ఏర్పాటుచేసింది. నాకవసరమైన పనులు ఆమె స్వయంగా చూడసాగింది. నేను కృతజ్ఞతాపాశంతో ఆమెకు బంధీనయ్యాను. శరత్ బాబును ప్రభావితుణ్ని చేసిన రంగూన్ వనితలు మనసులో మెదిలారు. ఏది ఏమైనా కృతజ్ఞత వల్ల నేను బందీనయిపోయాను.
పేవ్ మెంటు మీదనుండి తాజ్ లో పడ్డాను. జీవితం ఎంత విచిత్రమైనదని ఆలోచించసాగాను. అక్కడ పదిరోజులున్నాం. ఆవిడ ఏదో వ్యాపార విషయాలు స్వయంగా చూచుకుంటుంన్నది. అవన్నీ అయిపోయాక బయల్దేరి కాశీ దగ్గర ఓ పల్లెటూరికి చేరాం. అక్కడామెకు 'నా' అని చెప్పుకోదగిన వాళ్ళెవరూ లేరు. అయితే ఆమె సంపన్నురాలు కావటంచేత ఆస్థి కోసం అనేక రాబందులు చేరి ఉన్నాయి.
ఆమె మీద అంతకుముందు హత్యాయత్నాలు జరిగాయని తరువాత తెలుసుకున్నాను. నాకు హిందుస్థానీ బాగా మాట్లాడేందుకు వచ్చింది. కాని మా యిద్దరి మధ్య సంభాషణ సంస్కృతంలోనే సాగింది. అది మాకు కవచం.
ఆమెకు వ్యాపార విషయాల్లో నేను తోడ్పడటం ప్రారంభించాను. కలవారింటి ఆడపడుచుకు వుండే లక్షణాలు ఆమెలో పుష్కలంగా ఉన్నాయి. భర్త అనేక వ్యాపారాలను ఆమెకు అప్పగించి చిన్నతనంలోనే పోయాడు.
మమ్మల్ని ఏ శక్తులూ విడదీయలేనంతగా కలిసిపోయాం. ఆస్థిని కాపాడే పోరాటంలో రాజకీయాలు బాగా అలవాటయ్యాయి. సమయం దొరికినప్పుడల్లా ఇటు శాంతినికేతన్ కీ అటు సబర్మతీకి పోవటం అలవాటైంది.
గాంధీగారిని గురించి నా అపోహలు క్రమంగా హరించిపోయాయి. నేను కాంగ్రెస్ లో చేరాను. రాజకీయాల్లోకి దిగాలని ఆమెకు సూచించి ప్రోత్సహించింది.
పది సంవంత్సరాలు అలాగే గడిచిపోయాక స్వాతంత్ర్యం రాబోయేముందు ఆమె కన్ను మూసింది.
పోతూ దూరపు బంధువుల పిల్ల ఒకామెను నాకిచ్చి పెళ్ళి చేసి తన యావత్తు ఆస్థికీ వారసుడుగా విల్లు వ్రాసింది. అంతకుముందే మారిపోయిన జీవితం, ఇప్పుడా మార్పులో స్థిరపడింది. అయినా ఏకాంతంలో ఉన్నప్పుడు నా గత జీవితంలో సహచారిణి, త్యాగమూర్తి నా మనసును తట్టిలేపుతుండేది. రావాలని ప్రయత్నించటమూ తప్పనిసరి పనుల్లో పడికొట్టుకు పొవటమూ జరిగేది.
"బాబో౧ ఇప్పుడు దాదాపు నేను చివరిగంటల్లో ఉన్నాను. అందుకే అన్నీ వదులుకుని కడసారి కోర్కె 'ఆమెని చూడాలనే ఉబలాటం__తీర్చుకోవాలని వచ్చేశాను" అన్నాడాయన. ఆయన కంఠం జీరపోయింది. కన్నుల్లో నీళ్ళు చిప్పిల్లాయి. పెద్ద దగ్గు తెర వచ్చింది. చాలాసేపటికి తేరుకున్నాడు.
"అయితే బాబుగారూ! మీకోసం తన సర్వస్వాన్నీ యావత్తూ ప్రపంచాన్నీ త్యాగం చేసిన ఆ ముస్లిం బాలిక పేరు గుర్తుందా?" అని ప్రశ్నించాను. ఆపుకోలేని ఉత్కంఠతో.
జీర పోతున్న స్వరం నుండి మూడక్షరాలు వెలువడ్డాయి. "ఫాతిమా" నేను సంతోషాతిరేకంలో ఉప్పొంగిపోయాను.
ఆయనను లోపలకు పంపివేసి నా గదిలో దూరి తలుపులు బిడాయించాను. మెలకువ వచ్చేసరికి ప్రొద్దుకూకింది.
అవ్వను పలకరించి "నీకు రేపు నేనొక శుభవార్త చెబుతా" నన్నాను. ఇప్పుడే చెప్పమని అవ్వ పట్టుపట్టింది. "ఆమె హృదయం తట్టుకోగలదా? ఈ మాట విని వృద్ధురాలు జీవిస్తుందా? ఆనంధాతిరేకంతో కన్ను మూస్తుందా" సమయం కాదని తప్పుకున్నాను.
