"పని వాళ్ళతో అలా రాచుకు పూసుకు తిరుగకూడదు రాణీ!" అంది సతీదేవి.
"ఊరికే కూర్చుంటే నాకు తోచట్లేదు బాబూ! అయినా మాట్లాడితే తప్పేంటిట.....!" అంది కీర్తి.
"తప్పు అంతే."
"తప్పు అంటే సరిపోతుందా! ఎందుకు తప్పో చెప్పాలి. అయినా ఇలాంటివి నాకు తెలియవు. మా వూళ్ళో అయితే అందరితో హాయిగ మాట్లాడుతాము. ఇలాంటి గోలలేదు. అందుకే చెప్పాను తాతయ్యతో వెళతాను అవి..." కీర్తి ఏడ్పు స్వరంతో అంది.
"సరేలే నీ యిష్టం వూరికే అన్నాను. అంతే" అంది సతీదేవి.
కీర్తి ఆడిన నాటకం వల్ల కొందరు నమ్మారు అయినా నిఘా తప్పలేదు. అదేమిటో యింతకు క్రితమే తెలిసింది.
"ఈ యింట్లో అందరూ నా పేరు రాణి నేనో వెర్రి బాగుల అమ్మాయినని నమ్మినా సరే నేను తగు జాగ్రత్తలో వుండాల్సిందే" అనుకుంది కీర్తి.
26
మాధవ్ గురుదేవ్ గదిలో కూర్చుని ఏవో కాగితాలు తిరగేస్తున్నాడు.
ఆ గది కిటికీకి ఆనుకుని గుబురు పొదవుంది. పైకి తాళ్ళు కట్టి కొన్ని లతలు పైకి పాకించారు. తీగలు వత్తుగ పైదాకా వుండటం వల్ల ఆ తీగలు చాటుచేసుకుని పొదపక్కగ దాక్కోవచ్చు. పొద దగ్గరికివస్తే తప్ప అక్కడ దాక్కున్నసంగతి ఎవరికీ తెలియదు. బైట నుంచి గది లోపలికి చూడొచ్చు గాని గదిలోవారు పొదలో దాగున్నవారినితొందరగ చూడలేరు.
కీర్తి లతలచాటున పొదపక్కగను నుంచుని గదిలోకి చూసింది.
మాధవ్ గురుదేవ్ వక్కడూ బల్లముందు కూర్చుని కాగితాలు ఏవో పరిశీలిస్తున్నాడు.
కొద్ది సేపు అక్కడే నుంచుని చూసిన కీర్తి యింక లాభం లేదని లేచి ఇవతలకి రాబోయింది. సరీగ అప్పుడే మాధవ్ గురుదేవ్ దగ్గరకు వచ్చిన ఆనంద్ మూర్తిని చూసి అక్కడే ఆగిపోయింది.
"నీ కోసమే చూస్తున్నాను. ఏమిటి విశేషం?" మాధవ్ గురుదేవ్ చేతిలో వున్న కాగితాలు పక్కన పెట్టి అడిగాడు.
"వారం రోజులు ముసలాడిని వెన్నంటి వెళ్ళాను. అనుమానించ దగిన ఏ చిన్న సంఘటన జరగలేదు." ఆనంద్ మూర్తిచెప్పాడు.
"ఎటు నుంచి ఎటు వెళ్ళాడో వివరంగ చెప్పు."
ఆనంద్ మూర్తి వివరంగ చెప్పాడు.
అది వింటూనే వులిక్కిపడింది కీర్తి. "ఈ ఆనంద్మూర్తి అనేవాడు యశ్వంత్ జీవి నీడలా అనుసరిస్తూ వెళ్ళాడన్న మాట. ముందు జాగ్రత్తలు తీసుకోవటం ఎంత మంచిదైంది!" అనుకుంది.
"ఈ నాలుగు వూళ్ళ యాత్రలు చేసిం తరువాత మార్గం మధ్యలో ఓ ప్రయాణికుడు చెపితే యాత్ర స్పెషల్ బస్ లో నెల రోజులకి టిక్కెట్టు కొని బస్సు ఎక్కాడు. నాకు తెలిసిన ఫామిలీ కూడా అదే బస్సులో యాత్రలకి వెళుతున్నారు. ముసలాడిని చూపించి చెప్పాను. ఈ ముసలాడు నెలరోజులూ ప్రయాణం చేయకుండా మార్గం మధ్యలో దిగిపోతే వివరంగా నాకు లెటర్ రాయి అని ఇక్కడ నా అడ్రస్ యిచ్చాను." ఆనంద్మూర్తి చెప్పాడు.
"చాలా మంచి పనిచేశావు." మాధవ్గురుదేవ్ అంటూ వుండగానే సంగయ్య గదిలోకి వచ్చాడు.
"ఇప్పుడేనా రావటం?" సంగయ్య అడిగాడు ఆనంద్ మూర్తిని చూసి.
"అవును." ఆనంద్ మూర్తి చెప్పాడు.
"ఈ రోజు కూడా రాణి గదిలోని పెట్టె బుట్ట సర్వం గాలించాను."సంగయ్య అంతవరకు చెప్పాడు.
"ఆగావేం చెప్పు."
"రాణి నిజంగ కాస్త వెర్రిబాగులదే. ధరించే పరికిణాలు ఓణీలు గాక రిబ్బెనలు పూసల గొలుసులు ఖాళీ అయిన తిలకం సీసాలు చిన్న పిల్లల బొమ్మలు వున్నాయి. అవిగాక...
"ఊ....అవిగాక...?" మాధవ్ గురుదేవ్ ఆత్రుతగా అడిగాడు.
"సినిమా పుస్తకాలలోని రంగు రంగుల హీరోల బొమ్మలు జాగ్రత్తగా దాచుకుంది."
"సినిమాల పిచ్చి బాగానే వుందన్నమాట."
"సినిమాల పిచ్చిగాదు అబ్బాయిల పిచ్చి."
మాధవ్ గురుదేవ్ నిర్ఘాంత పోయాడు. "ఏమిటి నీవు చెప్పేది!" తేరుకుంటూ అడిగాడు.
"నిన్న రాణి అటూఇటూ బిత్తర చూపులు చూస్తూ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. అనుమానం వచ్చి నేను కిటికీ దగ్గర చేరి చూశాను. వారపత్రిక మధ్య పేజీలో వున్న రంగు రంగుల హీరో బొమ్మని అదేపనిగముద్దులు పెట్టుకుంది ఆ తర్వాత ఆ బొమ్మని గుండెలమీద పెట్టుకునినొక్కుకుంటూ వికారాలు పోయింది. రాణి తనగదిలో దాచుకున్నవనీ కూడా హీరోల చిత్రాలే" చెప్పాడు సంగయ్య.
