వీరేష్ మాటలలోని భావం ఎలా ఉన్నా అతని మనసులోని ఆవేదన అర్ధమయింది మార్తాండ్ కు.
"సారీ వీరేష్! ఒక ఆడపిల్ల తండ్రిగా నేను పూర్తిగా ఓడిపోయాను" అంటూ ముఖం పక్కకు తిప్పుకున్నాడు.
వీరేష్ హృదయం బరువెక్కింది. అతను తీవ్రమైన అసంతృప్తితో వెనుదిరిగాడు.
* * * *
అరుణ నుంచి పిలుపు అందగానే అనూష బయలుదేరింది.
అనూషను చూస్తూనే సాదరంగా ఆహ్వానించాడు వీరేష్.
"ఎంతవరకు వచ్చింది సార్ మీ 'మాయ' కేసు?" అడిగింది అతన్ని ఉడికిస్తున్నట్టు, అనూష నవ్వుతూ.
"మీవంటి వారి సహకారం నేరస్థులకు ఉంటే ఎవరైనా ఎన్నిసార్లయినా చట్టం నుంచి సునాయాసంగా తప్పించుకోవచ్చు. ఇక నాబోటి ఇన్వెస్టిగేటర్ ఎవరైతేనేమీ ఓటమిని అంగీకరించక ఏం చేస్తాడు చెప్పండి?" నిష్టూరంగా అన్నాడు ఇన్ స్పెక్టర్ వీరేష్.
"మీ దర్యాప్తుకు నేనెన్నడూ అడ్డురాలేదే! అయినా, అభిమానుల చావుకూ, సమ్రాట్ కూ సంబంధం ఏమిటి?" ఎదురుప్రశ్న వేసింది.
"అయితే మీకు అతనిమీద ప్రగాఢమైన విశ్వాసమే ఉన్నట్టున్నదే!" వ్యంగ్యంగా అన్నాడు.
"అబ్బబ్బ! ఇక్కడ కూడా మీ కేసులు, దర్యాప్తుల గురించేనా? అది రాక రాక ఇంటికి వచ్చింది. మీ దర్యాప్తుతో దాన్ని విసిగించకండి." అసహనంగా అంది అరుణ లోనినుండి వస్తూ.
"భలే దానివే! నేను ఎన్ని ప్రశ్నలు వేసినా, గోడకు తగిలిన బంతిలా అవి నాకే తగులుతాయి. సమ్రాట్ అంటే ఏమనుకున్నావు? నీ క్లాస్ మేట్ కు అతనే గురువూ, దైవం! నీ స్నేహితురాలు అతగాడిమీద ఈగ వాలనివ్వదు తెలుసా?"
"మీరు అనవసరంగా దాన్ని అనుమానిస్తున్నారు. అది చిన్నప్పటినుంచి నా స్నేహితురాలు. నాకు తెలిసినంతలో అదెప్పుడూ చెడును సమర్ధించదు. నా దగ్గర ఏ విషయాన్నీ దాచదు. మీరు స్టేషన్ కు వెళ్ళండి. తరువాత నేను అన్నీ దాన్నడిగి తెలుసుకుంటాను" అంది అరుణ చిరుకోపం ప్రదర్శిస్తూ.
"అలానే వెళతాను. కాని వెళ్ళేముందు ఒక్కమాట. ఇవ్వాళ 'మీట్ ది ప్రెస్'లో సమ్రాట్ గురించిన నిజానిజాలను బయటపెట్టబోతున్నాము. ఈ విషయంలో ప్రెస్ వారు అనూషను గురించి చెడుగా రాసినా ఆశ్చర్యపోనక్కరలేదు, నీ స్నేహితురాలు మరోలా అనుకోకూడదని ముందుగానే చెబుతున్నాను." హెచ్చరికగా అన్నాడు.
వీరేష్ మాటలకు అనూష పకపకా నవ్వింది.
"అతని దగ్గర పనిచేస్తున్న నేరానికి మీ గురించి రేపు పత్రికలు చెడుగా రాయబోతున్నాయి" రెట్టిస్తూ అన్నాడు.
"అబ్బబ్బ! మీరు దాన్ని మీ మాటలతో బెదరకొట్టకండి" అసహనంగా అంది అరుణ.
"సారీ! నేనేమీ మీ స్నేహితురాలిని బెదిరించడం లేదు. వాస్తవం చెప్పానంతే."
"ఇన్ స్పెక్టర్! మీరు నా నుంచి ఏం ఆశిస్తున్నారో అర్థం చేసుకోలేని అమాయకురాలిని కాదు నేను. మీకు కావలసింది నేను సమ్రాట్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం, అంతే కదూ!" అంది ఆవేశంగా అనూష.
"నో! నో! అలా అని నేనెందుకంటాను? మీరు, అరుణ స్నేహితురాళ్ళని మీ హితవు కోరి చెబుతున్నాను. ప్రస్తుత పరిస్థితులలో మీరక్కడ పనిచేయడం మంచిది కాదు."
"బేడ్ లక్ సర్! నేను ఆ అవకాశాన్ని మీ పోలీసు శాఖకు గానీ, ప్రెస్ కు గాని ఇవ్వను. ఎందుకంటే నేను అక్కడ పనిచేయడం ఎప్పుడో మానేశాను. ప్రస్తుతం ఒక దినపత్రిక సంపాదక వర్గంలో చేరాను. ఈ కేసులలో రేపు నా సంపాదకీయం రాస్తున్నది. సమ్రాట్ గురించి దర్యాప్తులోని నిజానిజాలను మీరు బయటపెట్టగలిగితే అవే రాస్తాను. అందాకా ఊహాగానాలు అనవసరం. మీరు మీ దర్యాప్తును పూర్తిచేయండి. నేను నా విషయం చూసుకోగలను." ఆత్మస్థయిర్యంతో అంది అనూష.
వీరేష్ నిర్ఘాంతపోయాడు. తను అనుకున్నట్టు ఆమె ఏమీ భయపడలేదు. ఆమె ఎఫెన్స్ లోనే ఉంది!
ఈ పరిణామం కూడా ఒక విధంగా మంచిదే! ఆమెకూడా సమ్రాట్ గురించి నిజానిజాలు తెలుసుకోవడం కంటే తనకేం కావాలి?
"ఒక వైపున కాలేజీ విద్యార్థులు, మరొక వైపున మహిళా సంఘాలు, ఇంకొకవైపు రాజకీయ నాయకులు సమ్మెలు, ధర్నాలు చేపట్టడం చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితులలో సమ్రాట్ ను అరెస్టు చేయకుంటే పరిస్థితి ఇంకా విషమిస్తుంది. అయితే, దర్యాప్తులో నాకెవ్వరూ సహకరించడం లేదు. ఇక ప్రజోద్యమాన్ని చల్లార్చడానికి ఒక్కటే మార్గం ఉంది. ఈ కేసులలో దర్యాప్తు అధికారికి సాహితి, మీరు సహకరించడం లేదని స్టేట్ మెంట్ ఇస్తాను" అన్నాడు నవ్వుతూ వీరేష్.
తను శ్రీపతికి ఇచ్చిన మాట గుర్తుంది. అనూష సమ్రాట్ దగ్గిర పని మానేయడం తండ్రికి కొంత ఊరట కలిగించవచ్చు. మిగతా విషయాలు అరుణ నచ్చచెప్పి ఆమెను మార్చగలిగితే, తన దర్యాప్తు సుగమమవుతుంది. అరుణకు సైగ చేసి స్టేషన్ కు బయలుదేరాడు వీరేష్.
ఇక అక్కడ అన్యమనస్కంగానే కూర్చుంది అనూష.
ఆమె మౌనం అరుణను కలవరపరచింది. వీరేష్ మాటలకు నొచ్చుకుందని అర్థం చేసుకుంది.
"ఆయన మాటలకు నువ్వు అనవసరంగా ఖంగారుపడుతున్నావు. నీకేమీ కాదులేవే. పద_భోజనం చేద్దాం" అంది. అనూహ చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టింది.
"నాకు ఆకలిగా లేదే. నన్నెందుకు ఇబ్బంది పెడతావు? ఈసారికి వదిలేయరాదూ?"
"ఏమే_ ఇంటి గొడవలతో ఏమన్నా సతమతమవుతున్నావా?"
అనూష మౌనంగా ఉండిపోయింది.
"పోనీ లేవే_చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులే!"
"ఛ! ఛ! అదేమీ లేదే. అవి ఎప్పుడూ ఉండేవేగా! ఇప్పుడు కొత్తగా వచ్చినవేమీ కాదుగా!"
"ఏమైనా నలుగురూ హర్షించే విధంగా నిర్ణయాలు తీసుకోవే! పంతాలు ,పట్టింపులతో ఎందుకే బాధలు కొనితెచ్చుకుంటావు? పెళ్ళి చేసుకుని మేమంతా సుఖపడడం లేదా!"
"నీ ప్రశ్నలకు సమాధానం చెప్పగల ఓపిక ప్రస్తుతం నాకు లేదే. ఈసారి తీరిగ్గా అడుగుదువుగాని. తాపీగా సమాధానాలు చెపుతాను. సరేనా?" అంది నవ్వుతూ అనూష.
