Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 36

ఇన్ స్పెక్టరు దాదాపు నలభై ఫోటోలని చూపించాడు.
ఆ నలభై మందిని తానెప్పుడూ చూడలేదని చెప్పాడు పుండరీకాక్షయ్య.
చెప్పి,
అంతటితో వూరుకోక,
"వీళ్ళల్లో ఏ ఒక్కడికైనా ఎడమకన్ను కాస్త మెల్ల వుంటే బాగుండేది!" ఆలోచిస్తూ అన్నట్లుగా అన్నాడు పుండరీకాక్షయ్య.
"ఎడమ కన్ను మెల్లా?" అన్నాడు ఇన్ స్పెక్టరు.
"అవునండీ! కుడికన్ను కాదు ఎడమకన్ను!" పుండరీకాక్షయ్య వినయంగా చెప్పాడు.
"ఎడమకన్ను మెల్లా? ఎవరికి? దేనికి?" ఇన్ స్పెక్టరు కాస్త విసుగుతో అన్నాడు.
"మరి మీరు ఫోటోలు చూపించారు కదండీ, గుర్తుపట్టమని!"
"ఊ__ చూపించాను. చూపిస్తే ఏమిటి?"
"గుర్తుపట్టాలి కదా!"
"అవును, గుర్తుపట్టాలి!"
"అలాంటప్పుడు మెల్ల వుండాలి కదా!"
"నువ్వు చెప్పేది నాకు అర్థంకావటం లేదు. ఆ చెప్పేదేదో సరిగ్గా చెప్పు!" విసుక్కుంటూ అన్నాడు ఇన్ స్పెక్టరు.
"మీరిన్ని ఫోటోలు చూపించారు కదండీ! వాళ్ళల్లో ఒక్కడికి కూడా ఎడమకంటికి మెల్లలేదు."
"నేరస్తుడిని గుర్తుపట్టవయ్యా అంటే, మెల్లకన్ను లేదంటావేమిటి? నీవు నేరస్తుడిని గుర్తుపట్టటానికీ మెల్లకన్నుకీ ఏమిటి సంబంధం?"
"సంబంధం ఏమిటో తెలియదు కానీండి, నేను చూసిన నలుగురిలో ఒకడి ఎడమకంటికి బాగా మెల్ల వుంది. వాడు బస్సులో బెదిరిస్తున్నప్పుడు, నా వేపు చూశాడో మరొకడి వైపు చూశాడో తెలియక 'నన్నేనా బాబూ!' అని పలకరించబోయాను. "నోరుముయ్యరా! ముసలినక్కా!" అని వాడు ఒక్క అరుపు అరిచేసరికి, నా ప్రాణం అప్పటికప్పుడే పోయింది అనిపించింది భయంతో. ఆ దెబ్బతో మళ్ళీ పెదవి కదిపితే ఒట్టు" పుండరీకాక్షయ్య చాలా చక్కగా చెప్పాడు.
అప్పటికి ఇన్ స్పెక్టరుకి చూచాయిగా విషయం అర్థమైంది. "ఈ ముసలాడికి సాక్ష్యం చెప్పటం సరిగ్గా రాదు. ఇందాక ఈ నలుగురినీ వర్ణించినపుడే అందులో ఒకడికి మెల్ల కన్ను వుందని చెప్పవచ్చు కదా. ఇంత చిన్న విషయం కూడా చెప్పటం రాకపోయె. ఇలాంటి మూర్ఖులు వుంటే దేశం ఎలా బాగుపడేను." అని ఒక్కక్షణం తనలో తాను చింతించి, ఈ ముసలాడు ఉత్త అమాయకుడు. తనే తెలివిగా ప్రశ్నలు వేసి, సమాధానం రాబట్టుకోవాలి అనుకున్నాడు.
"ఇంక నేను వెళ్ళవచ్చాండీ!" పుండరీకాక్షయ్య వినయంగా అడిగాడు.
"ఉహు! మరికాస్త తతంగం వుంది" అన్నాడు ఇన్ స్పెక్టరు.
"తతంగమా, నా బోండా! శార్ద కర్మలు పెడుతున్నట్లు తతంగం అంట తతంగం. అందరూ అలా లోపలికి వెళ్లి ఇలా బయటకి వచ్చారు. నేనేమో ఈయన దగ్గర ఇలా ఇరుక్కుపోయాను. తిక్క సమాధానాలు చెప్తేకానీ వదిలేటట్టు లేడు ఈ ఇన్ స్పెక్టరు" అనుకున్నాడు పుండరీకాక్షయ్య.
పుండరీకాక్షయ్య మొహంలోకి ఒకసారి పరిశీలనగా చూసి, ఇన్ స్పెక్టరు ప్రశ్నల వర్షం కురిపించటం మొదలుపెట్టాడు.
"నువ్వు చూసిన నలుగురిలో, ఒకడికి మెల్ల కన్ను వుంది. మెల్ల కూడా రెండు కళ్ళకీ లేక ఒక కంటికే వుంది. అది కూడా ఎడమ కంటికి మాత్రమే అవునా!" ఇన్ స్పెక్టరు అన్నాడు.
"సరిగ్గా అవునండీ!" పుండరీకాక్షయ్య చాలా వినయంగా చెప్పాడు.
"అవునో, కాదో చెబితే చాలు. సరిగ్గా అంటూ అంత నొక్కి పలకనక్కరలేదు.
"అలాగేనండీ!"
"గుడ్! ఊ... ఇప్పుడు చెప్పు! ఆ నలుగురిలో ఒకడి ఎడమకన్ను మెల్ల అంతేనా!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS