ప్రేమకథ
విజయవాడ స్టేషన్ లో ప్లాట్ ఫారం రద్దీగా వుంది. మెయిల్ వచ్చి ఆగింది. బండి స్టేషన్ లో చాలాసేపు ఆగుతుందని అందరికీ తెలుసు. అయినా ఎవరి ఆత్రుత వారిది. ఎక్కేవాళ్ళను దిగేవాళ్ళు ఎక్కనివ్వడం లేదు. దిగేవాళ్ళను ఎక్కేవాళ్ళు దిగనివ్వడం లేదు.
రైలు కదలటానికి సిద్ధంగా వుంది. భాస్కర్ ఆదరాబాదరగా వచ్చి ఫస్టుక్లాసు కంపార్టుమెంటులోకి ఎక్కాడు. అతన్ని సాగనంపటానికి వచ్చిన జవాను సామాను సర్ది హోల్డాల్ పరిచి, సలాంకొట్టి దిగి ప్లాట్ ఫారం మీద చేతులు కట్టుకొని నిల్చున్నాడు.
రైలు కదిలింది. భాస్కర్ సర్దుకొని వెనక్కు వాలి కూర్చుని సిగరెట్ వెలిగించాడు. యధాలాపంగా ఎదురుగా కూర్చుని వున్న జంటపై చూపులు నిలిపాడు.
యువకుడు కిటికీలోనుంచి బయటకి చూస్తున్నాడు. యువతి భాస్కర్ని పరీక్షగా చూస్తూంది. ఆమెను చూస్తున్న కొద్దీ ఎక్కడో చూసినట్టు అన్పించసాగింది భాస్కరుకు. భాస్కరు పరీక్షగా చూస్తున్నట్టు గమనించగానే ఆ యువతి గిర్రున తల తిప్పుకుంది. తల తిప్పుకోబోయే ముందు ఆమె కళ్ళల్లో కదిలిన బెదురు భాస్కరుకు కన్పించక పోలేదు.
ఆ యువకుడు తలతిప్పి ఆ యువతితో చిన్నగా ఏదో అంటున్నాడు.
భాస్కరు బుర్రలో ఏదో తొలుస్తూ వుంది. ఏదో జ్ఞాపకం అస్పష్టంగా కదులుతూ వుంది.
అతను ఏదో మాట్లాడుతూనే వున్నాడు. ఆ యువతీ మాత్రం తల తిప్పకుండానే "ఊఁ ఆఁ" అంటూ వుంది.
తనను చూసి ఆ యువతీ ఎందుకు అలా బెదిరిపోతుంది? తల తిప్పడానికి కూడా భయపడుతుందేం? తన భ్రమ కాదు గదా! పరాయి మగవాడు పరిశీలనగా చూస్తూ ఎదురుగా కూర్చుంటే ఆ యువతి ముఖ్యంగా భర్త ప్రక్కన వున్నప్పుడు బెదిరిపోదు!
అంతేనా? కాని తనకు ఆమెను ఎక్కడో చూసినట్టు వుందేం?
ఉన్నట్టుండి భాస్కరు మెదడులో మరుగుపడిన స్మేఉతి రెక్కలు టప టప లాడించింది.
అవును! ఆమే! అదే ఎత్తు! అదే రంగు! అదే ముక్కు! కింది పెదవి క్రింద పెసర బద్దంత గోధుమరంగు పుట్టుమచ్చ! ఆమే!
భాస్కరు మరోసారి ఆమె ముఖం చూడటానికి ప్రయత్నించాడు. కాని లాభం లేకపోయింది. ఆమె కిటికీలో ముఖం దూర్చి బయటికి చూస్తూ కూర్చుంది.
సందేహం లేదు. ఆమే! తనను అంత పరిశీలనగా చూసి, తను చూడగానే బెదిరిపోయి ముఖం తిప్పుకుంది.
"మీ పేరు అమల కదూ!" భాస్కరు ప్రశ్నించాడు.
ఆ యువతితోపాటు, ఆమె పక్కనవున్న యువకుడు కూడా ఒక్కసారిగా చివ్వున తిరిగి చూశాడు.
ఆమె కళ్ళల్లో, ముఖంలో భయం, గాభరా కన్పించాయి. చటుక్కున తల తిప్పుకుంది.
"కాదు! అనిత! ఏం అలా అడిగారు?" ఆమె పక్కన కూర్చునివున్న యువకుడు విస్మయంగా ప్రశ్నించాడు.
"కొంతకాలం క్రితం ఒకామెను రైలుస్టేషన్ లోనే కలుసుకున్నాను. ఆమె పేరు అమల అని చెప్పింది. అచ్చం అవే పోలికలు..." అంటూ ఆగి ఆ యువతికేసి చూశాడు.
ఆమె కిటికీ చువ్వను గట్టిగా పట్టుకుంది.
"మనిషిని పోలిన మనుషులు వుంటూనే వుంటారు" అన్నాడు ఆ యువకుడు.
"మీ పేరు?" భాస్కర్ అడిగాడు.
"ఆనందరావు."
"ఏం చేస్తుంటారు?"
"స్టేట్ బ్యాంకులో ఏజెంటుగా పని చేస్తున్నాను." ఈసారి కొంచెం విసుగ్గానే సమాధానం ఇచ్చాడు ఆనందరావు.
"మీ పేరు?" అడిగాడు ఆనందరావు.
