"మీరు యింకా యేమీ అడగలేదు సార్" వినయంగా అన్నాను.
"ఏమిటీ? ఇంకా నేను ఏమీ అడగలేదా?" అని కించిత్ ఆశ్చర్యపోయి, అహోబిలం వేపుకు తిరిగి, తనింకా ఏమీ అడగలేదు అన్నమాట నిర్ధారణ చేసుకొని ఆ తరువాత మళ్ళీ నావేపుకి తిరిగి...
"నాకో ఫోను వచ్చింది. కోటీశ్వరుడు ముకుందదాస్ యింటిలో కోటీ యాభై లక్షల విలువచేసే వజ్రాలు పోయినట్లు అంతక్రింతమే మా పోలీస్ ఫైల్లోకి కేసు ఎక్కి వుంది. సరీగా ఆ కోటీ యాభై లక్షల వజ్రాల గురించీ మీ బాస్ గాడు నాకు ఫోను చేశాడు.
ఆ కోటీ యాభై లక్షల వజ్రాలూ మీ దగ్గరే ఉన్నాయి అని అది తెలిసే మీ ఇద్దర్నీ తాను బందీ చేశానని చెప్పాడు.
మిమ్మల్ని బెదిరించి ఆ రహస్యం మీనుంచి లాగే లోపల మేము వాళ్ళ స్థావరం మీద రైడ్ చేయటం, దాంతో తెలివిగా బాస్ పారిపోవటం జరిగింది, కొందరు చనిపోవటం జరిగిందట.
మిమ్మల్ని ఇప్పుడు విడిచిపెడితే ఆ వజ్రాలు మీరు తీసుకుని పారిపోతారుట.
అందుకని మిమ్మల్ని వదలొద్దని కుళ్ళబొడవమనీ గట్టిగా చెప్పాడు. ఆ వజ్రాలను నేను ఎలాగూ వదలదలుచుకోలేదు.
ఒకటా రెండా కోటీ యాభై లక్షలు విలువగల వజ్రాలు. అన్నట్లు వదలదలుచుకోలేదూ అంటే అర్థం నేను తీసుకుంటానని కాదు, పట్టుకుని ముకుందదాస్ కి అప్పగించేదామని. అంతే!
ఊ...ఇప్పుడు చెప్పండి! ఆ వజ్రాలు ఎక్కడ దాచారో? మీకు తెలుసో తెలియదో నిజం చెబితే మీకు శిక్ష తగ్గుతుంది. రెండు కత్తిపోట్ల కన్నా ఒక కత్తిపోటు బెటర్ కదా!" అంటూ అసలు విషయం ముగించాడు వర్ధనరావు.
విషయం పూర్తిగా అర్థమైంది నాకు.
"తగలరానిచోట తగిలితే ఒక్క కత్తిపోటు చాలు సార్! ప్రాణం తియ్యటానికి" అన్నాను నేను.
"అఫ్ కోర్స్! అఫ్ కోర్స్! అదీ నిజమే" అన్నాడు వర్ధనరావు.
"బాస్ స్థావరాన్నీ, బాస్ దొంగల ముఠా నాయకుడినీ వాళ్ళు చేసేది స్మగ్లింగు అనీ, ఇదంతా మేము కనిపెట్టేశాం కదా సార్!
బహుశా ఇప్పుడు వాడి స్థావరం మీదికి మీరు దండెత్తి వెళ్ళారు కదా! అది కూడా మా పనే అనుకుని ఇలా తప్పుడు సమాచారం ఫోను ద్వారా అందించాడు.
మీరేమో వాడి సంగతి తాత్కాలికంగా వదిలేసి వజ్రాలు ఆరా తీసే విషయంలో మా వెనుక పడతారు కదా!
మీ కన్ను ఇటు మలిపి ఇదే సందులో వాడు అటు వజ్రాలు తీసుకుని చాలా దూరం పారిపోవాలని చూస్తున్నాడు. ఇంత చిన్న సత్యం ఈపాటికి మీ ఊహకి వచ్చే వుండాలే" అన్నాను నేను.
"వచ్చింది. అయినా పోలీసు అన్న తరువాత అనుమానించడమె ముఖ్య ధ్యేయంగా పెట్టుకోవాలి.
బాస్ మాట నమ్మకూడదనీ, నీమాటే నమ్మాలనీ ఎక్కడుంది? పైగా వాడు ఎంత వివరంగా చెప్పాడంటే గుండేరావ్ గుండెలు తీసిన బంటు అని బల్లగుద్ది మరీ చెప్పాడు..."
వర్ధనరావు అంటూ వుంటే నా కళ్ళు కొత్త ఆలోచనరాగా చమక్ మని మెరిశాయి. హాయిగా వూపిరి పీల్చి విడుస్తూ "హమ్మయ్య" అని అన్నాను.
"ఏమిటయ్యా? హమ్మయ్యా! ఇక ప్రశ్న నేను ప్రశ్న చెబుతూంటే నీకు వేషాలుగా వుందా?" ఇన్ స్పెక్టర్ వర్ధనరావు గద్దిస్తూ అడిగాడు.
"నన్ను పట్టుకోంగానే, పోలీసు ఫైల్లోకి నన్ను ఎక్కించే ముందు నా పేరూ వివరాలు అడిగారా లేదా?"
"అడిగాను"
"అప్పుడు నాపేరు ఏమని చెప్పాను?"
"ఏమిటీ? నా జ్ఞాపకశక్తిని పరీక్షిస్తున్నావా? పిచ్చి పిచ్చి వేషాలేస్తే పుచ్చెగిరిపోద్ది. నీపేరు విజయరాజ్ అని, నీ మిత్రుడి పేరు రామ్ సింగ్ అని చెప్పావు. అయితే ఏంటి?"
"అయితే ఏంటి? అంటూ జోకులు వెయ్యకండి సార్! నా పేరు విజయరాజ్ అయితే మధ్యలో ఈ గుండూరావ్ ఎవడు?
బాస్ ఫోనులో చెప్పిన ప్రకారం అయితే గుండేరావ్ అనేవాడు ఇంకోడు ఉండే వుంటాడు. లేకపోతే మిమ్మల్ని తికమక పెట్టటాన్కి ఈ కథయినా మీకు చెప్పి వుంటాడు.
మామీద కచ్చ ఎలా తీర్చుకోవాలో తెలియక ఇలా కథ కల్పించి చెప్పుంటాడు. నన్నడిగితే గుండేరావ్ అనేవాడు ఎవడూ లేడు. బాస్ గాడే గుండేరావ్ అయుంటాడు.
ఒకవేళ అలా కాకపోయినా ఆ వజ్రాలు మాత్రం ఖచ్చితంగా వాడిదగ్గరే ఉండి వుంటాయి. మిమ్మల్ని తికమక చేయటానికి ఇదో పెద్ద పథకం.
ఈసరికి బాస్ వజ్రాలు తీసుకొని చాలాదూరం పారిపోయి వుంటాడు. మీరేమో అనవసరంగా మమ్మల్ని నిలదీసి ప్రశ్నిస్తున్నారు. బాస్ ని పట్టుకుని నాలుగు ఉతకండి సార్! వజ్రాల రహస్యం బయట పడుతుంది."
