"నాకిలా బ్రతకడంలోనే ఆనందముంది."
"ఇలా అంటే రాత్రిలాగానా! అదే పాపం అపరాత్రిదాకా గడిపి కారులో తిరిగొచ్చావ్. అదీ సోఫియాతో.
నిరుత్తరుడైపోతూ ఆమెను చూశాడు...
"ఏం నాకెలా తెలుసని ఆశ్చర్యపోతున్నావా... చెప్పానుగా నేనో జర్నలిస్టునని... ఇలా ఇన్వెస్టిగేట్ చేస్తుంటాను" వ్యంగ్యంగా నవ్వింది... "వెళ్ళావు కదూ."
"వెళ్ళింది నిజమైనా అందుకు వెళ్ళలేదు."
"ఎందుకు వెళ్ళినా లేక అందుకే వెళ్ళినా అక్కడ అడుగుపెట్టే మగవాడు శలభంలా కాలి తప్ప బయటికి రాలేడు శశాంకా..." పెంచుకున్న ఏ బంధం ఆమె చేత అలా మాట్లాడిస్తూన్నదీ గ్రహించే స్థితిలో లేడు. "ఏం. నీకు రిలాక్స్ కావడమే ముఖ్యమైతే నన్నడగొచ్చుగా" ఆ వాక్యం ఎక్కడ తగిలిందీ అంటే కొన్ని సెకండ్లపాటు మాటాడలేక పోయాడు.
"వినీలా" శశాంక గొంతు పూడుకుపోయింది.
"ఏం నేనిలా మాటాడ్డం వూహించలేకపోతున్నావా శశాంకా... సీరియస్ గానే అంటున్నాను... ఏం... ఒక్కసారి తేరిపారచూడు... నేను సోఫియా కన్న అందంగానే వుంటాను. నువ్వు సరేనంటే సోఫియాలా అనుభవం లేకపోయినా నిన్ను అద్భుతంగా సంతృప్తిపరచగలను."
శశాంక నుదురు చెమటతో తడిసిపోతుంది.
ఇప్పుడిప్పుడే అనాగరిక ప్రపంచంలో అడుగుపెడుతున్న శశాంక సంస్కారపు మౌనరాగాలతోనే ఎదుటి వ్యక్తికి ఊరట కలిగించగల వినీల హృద్య గీతాల నైవేద్యంతో తన సన్నిధినే పునీతం చేయగల ఒక నిర్మల మనస్కురాలైన ఆడపిల్ల అలా మాటాడ్డం చూస్తూ నమ్మలేకపోతున్నాడు.
"సిగ్గుపడకు శశాంకా... మగాడివి... పైగా మానసికంగా అలసిపోయి వున్నవాడివి... "సెల్ఫ్ ఎఫిషియన్సీ పరిసరాల్లోనే వెదుక్కోవాలి. ఆ... నిజం... నువ్వు నీ భార్యతో గడిపిన క్షణాలను మరిచి ఇంత స్వల్ప కాలంలో మరో ఆడదాని పొందుకోసం వెంపర్లాడే స్థితే వస్తే నేను ఏ క్షణంలో అయినా నీతో అనుభవాన్ని షేర్ చేసుకోవడానికి సిద్ధంగా వున్నానని మరిచిపోకు."
"వినీలా" బిడియంగా ప్రకంపించిపోతూనే అరిచాడు.
"ఎందుకిలా ఆవేశపడతావు" సోఫియా సమక్షంలో అతడి తలకెక్కిన విషమేదన్నా వుంటే దాన్ని జుగుప్సాకరంగానైనా మాటాడి కక్కించాలన్నంత రోషంతో తనూ బరస్టయింది. "యూ ఆర్ నాట్ ఎనైడియలిస్టెక్ ఎచీవర్ బట్ ఏన్ ఇన్ సెక్యూర్ ఇగోయిస్ట్" కాబట్టే నిన్ను నువ్విలా నాశనం చేసుకుంటున్నావు. అసాధారణమైన భవిష్యత్తును అతి సాధారణమైన గతానికి ముడిపెట్టి అక్కడికి ఈ ప్రపంచంలో బాధాసర్పదష్టుడివి నువ్వొక్కడివే అన్న అర్థంలేని అహంకారాన్ని పెంచుకుంటూ దానికి నీ చుట్టూ జవాబును వెదుక్కోవాలనే మృగతృష్ణ లాంటి తాపత్రయంతో నిన్ను నువ్వు మాత్రమేగాక నీ చుట్టూ వున్న పరిసరాల్ని ద్వేషిస్తున్నావు... వితౌట్ నోయింగ్ దట్ ఏంగర్ యాజ్ ఏ రెస్పాన్స్ టు ది వరల్డ్ వెన్ ఇటీజ్ నాట్ ఏజ్ యూ వాంటిట్ టు ది యూ ఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్" తనను తాను నిగ్రహించుకుంటున్నట్టుగా ఓ క్షణం ఆగింది...
అప్పుడు చూసేడు ఆమె కనుకొలకుల్లో ఓ నీటి బొట్టుని. "ఏం చేయగలమో ఆలోచించడం జీవితం కాదు శశాంకా! ఏం చేస్తే ప్రపంచం ఆమోదిస్తుందో అది చేయాలి... కారణం నీ చేతలు నీ చుట్టూ వున్న వాళ్ళపై ప్రభావం చూపించే అవకాశం వుంది కాబట్టి."
కొన్ని క్షణాల నిశ్శబ్దం తరువాత నెమ్మదిగా తల పైకెత్తాడు... అతడిలో ఇమడలేని ఓ ప్రశ్నకు గొణుగుతున్నట్టుగా అడిగాడు "నా విషయంలో నువ్వెందుకింతగా రియాక్టవుతున్నావు."
భావరహితంగా చూసింది 'చెప్పమంటావా' ఓ క్షణం జాప్యం చేశాక అంది తల వంచుకుని "మన పరిచయం కొన్నాళ్ళ క్రితమే అయినా నువ్వు నన్ను మరిచిపోయి వుంటావు... కదూ!"
నిశ్శబ్దంగా వింటున్నాడు...
"కాని నేను ఏ క్షణమూ నిన్ను మరిచిపోలేదు... ఎందుకంటే అప్పటి పరిచయంలో చెప్పలేని నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆలస్యంగా తెలుసుకున్నాను కాబట్టి."
వెళ్ళిపోయింది వినీల.
చేష్టలుడిగిపోయి అలాగే వుండిపోయాడు ఓ అయిదు నిమిషాల పాటు.
"నీ మనసులోని ఆలోచనల్ని శాసించే హక్కు లేని నేను ఇది కూడదూ అని అనలేను కాని, చేతికందని ఎండమావి వెంట ఇన్ని అర్హతలు గల నువ్వు పరుగెత్తుతూ పొరపాటు చేస్తున్నావని మాత్రం చెప్పగలను వినీలా... అయామ్ సారీ" స్వగతంలోలా అనుకుంటూ నిస్సత్తువుగా సోఫాలో కూర్చుండిపోయాడు.
* * * *
"హల్లో" వినిపించింది సోఫియా కంఠం.
"నేను శశాంకని మాటాడుతున్నాను."
"ఇప్పుడు సరిగ్గా పన్నెండు గంటలైందిగా. తెలుసు నువ్వు ఫోన్ చేస్తావని." మత్తుగా పలికింది సోఫియా... "అర్థమైంది."
"ఏమని?"
"రాత్రంతా నా గురించే ఆలోచిస్తూ గడిపావని." నిర్లిప్తంగా నవ్వాడు "నీ గురించి కాదు."
"మరి?"
ఆ సీన్ చివరలో నీ ప్రవర్తన గురించి"
"అంటే?"
"నన్ను ఆపగలిగే అవకాశముండీ ఎందుకు వదిలిపెట్టావా అని" లౌక్యాన్ని ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు శశాంకా.
"చెప్పనా" ఫోమ్ బెడ్ పై వెల్లకిలా పడుకుని ఇంద్రుడి భార్య శచీదేవి కిష్టమైన ఇంద్రాణి రతీ బంధాన్ని గుర్తుచేసుకుంటూ మోకాలిని మరో కాలుతో పెనవేసింది." ఆ ప్రశ్నకి జవాబు కావాలీ అంటే ముందు చిన్న కథ చెప్పాలి.
