Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 36


    మరో గడవని కాళరాత్రిలో శశాంక అసహనంగా పచార్లు చేస్తున్నాడు.


    అదే శశాంక తొలిసారి తాగడం.


    గొంతు మండుతున్నా అంతకన్నా ఎక్కువగా దహించుకుపోతున్న గుండె మంట అతడ్నింకా వివశుడ్ని చేస్తుంటే అదుపుతప్పి మందు తాగుతున్నాడు.


    కృపని చంపిందెవరు...


    ధనుష్కోటి కానప్పుడు మరొకరికి హత్య చేయాల్సిన అగత్యమేముంది.


    తను బుద్దెరిగి ఎవరికీ శతృవు కాదు. అజాత శతృవులా బ్రతికిన మామయ్య రాజమణిగాని ఆయన రక్తంలో రూపుదిద్దుకుని అసదృశ్యమైన సంస్కారంతో అరుదైన వ్యక్తిత్వంతో తన జీవిత భాగస్వామిగా మారిన కృపగాని ఎవరికీ ఏ హాని చేసి ఎరుగరే...!


    ఎందుకిలా జరిగింది.


    క్షణక్షణానికీ పెరిగిపోతున్న ఆవేశాన్ని జవాబు దొరకని నిస్సహాయతని నిభాయించుకోలేక పోతున్నాడు.


    "ఎవరు... హూ ఈజ్ ది రియల్ కల్ ప్రిట్" తూలిపోతూ నడిచి గది కిటికీని ఆనుకుని బయటికి చూశాడు.


    చుట్టూ చీకటి...


    అనంతం దాకా వ్యాపించి తన అస్తిత్వాన్ని నిశ్శబ్దంగా నిరూపించుకుంటున్న చీకటి.


    క్రమంగా ప్రపంచం మసకబారిపోతుంటే అప్పుడు గ్రహించాడు తన కళ్ళు వర్షిస్తున్నాయని...


    జుగుప్స ఆ నీళ్ళని చూస్తుంటే...


    ఆయాసంతో రొప్పుతూ బెడ్ ని చేరుకున్నాడు.


    "మీకు సైకోథెరపీ అవసరం..." కృప పలకరిస్తుంది బెడ్ పై మంచి చేతులు చాచి...


    ఉక్రోషంగా వెనక్కి మరలాడు...


    "సౌత్ విండ్ వచ్చే దట్నుంచే కదూ... అంటే మనకి పుట్టబోయే బిడ్డ తప్పకుండా..."


    కృప గొంతు వెంటాడుతుంటే దిక్కుతోచని పసికందై కదిలించిన సుప్త భుజంగమై ప్రతిధ్వనించిన లోహ విహంగమై పెనుగులాడుతూ...


    కసిగా టీపాయ్ ని తన్నేడు...


    భళ్ళుమన్న శబ్దంతో కిటికీ అద్దాలు నేలపై విరిగిపడ్డాయి...


    అంతే... నిస్సత్తువగా నేలపైకి జారి అలాగే సొమ్మసిల్లిపోయాడు.


                                                     *    *    *    *


    గుండెని రగిలించే పగకి వూపిరిపోస్తూ మరో పగలు మొదలైన సూచనగా ఆకాశంలో సూర్యుడు అప్పుడే అడుగుపెట్టాడు..


    బజర్ మోగుతున్న శబ్దంతో కళ్ళు తెరిచిన శశాంక బడలికగా పైకి లేచాడు.


    గదంతా చిందర వందరగా వుంది.


    రాత్రి జరిగింది లీలగా గుర్తుకొస్తుంటే వెళ్ళి తలుపు తీశాడు.


    ఎదురుగా వినీల నిలబడి వుంది.


    తన మొహంలో అలజడి కనిపించకూడదని, వేగంగా తన గదిలో అడుగుపెట్టాడే తప్ప తానెంత కలవరపడుతూ అక్కడికి వచ్చింది గుర్తించలేకపోయాడు.


    అతడు చేసిన పొరపాటు వినీలని పలకరించకుండా కూడా సరాసరి బాత్ రూంలోకి వెళ్ళిపోవడమే.


    ఆమె ఈలోగా పడక గదిలో అడుగుపెట్టింది.


    శశాంక స్నానం చేసి వచ్చేసరికి గదంతా ఊడ్చేసిందామె...


    "ఏంటిదీ" ఆమె అలా పనిమనిషిలా శ్రమ పడడం అతడికి నచ్చలేదు.


    "నేను క్లీన్ చేసేవాడ్నిగా"


    "మీ కంత తీరికెక్కడుంది శశాంకా... పైగా రాత్రంతా నిద్ర కూడా వున్నట్టులేదు" ఏ భావాన్ని నిగూఢంగా ఆమె వ్యక్తం చేస్తున్నది. అతడు గుర్తించలేకపోయాడు. "సో... దిసీజ్ యువర్ లైఫ్" అంది సూటిగా అతడినే చూస్తూ...


    తల తిప్పుకున్నాడు.


    "నిన్ను చూస్తుంటే సారీ ఏకవచనంలో మాటాడుతున్నాను... మన మధ్య పెరిగిన ఈ పరిచయంలో అలా చనువుగా వుండడం తప్పులేదనుకుంటాను..." అతడి మొండితనంలో పసితనమే చూసిన వినీల అక్కడున్న ఖాళీ లిక్కర్ బాల్స్ ని చూస్తూ అంది. అతడే దిక్కుకి ప్రయాణం చేస్తున్నదీ అర్థమైపోతుంటే ఆత్మీయంగా పలకరించింది" ఏమై పోతున్నావు... శశాంకా ఇప్పుడెలా వున్నావో తెలుసా..."


    ఆ గదిలో తననెప్పుడైనా నిలదీసింది తను మారాం చేస్తుంటే బుజ్జగించిందీ అతని భార్య కృప మాత్రమే!


    అప్పుడెప్పుడో కృప నిలబడిన ప్రదేశంలో ఇప్పుడు నిలబడి వినీల మనసులోని ఉద్విగ్నతని ఆపుకుంటూ అంది. "I see me feel not I am a living tomb, desired dead buried dead in the process of living some time back" ఇది నేనెప్పుడు చదివిన ఓ పొయిట్రీ అయినా ఇప్పుడు నీకు సరిగ్గా సరిపోతుంది. మాట్లాడు శశాంకా. తల తిప్పుకుంటావేం..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS