Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 36


    "ఐసీ!" అంది మామూలు ధోరణిలో అంటున్నట్టుగా భారతి.


    "చూడమ్మా. నీకీ విషయం చెప్పానని మీ మమ్మీతో చెప్పకు" అన్నాడు.


    తండ్రిమాటలు చాలా సిల్లీగా అనిపించాయి భారతికి.


    వాళ్ళ మధ్య ఏదో రహస్యం దాగి వున్నదన్న సంగతి మాత్రం బాగా అర్థం చేసుకొంది.


    తల్లిదండ్రుల పట్ల భారతికిష్టం, గౌరవం, భయం, ప్రేమా అన్నీ ఉన్నాయి.


    వాళ్ళ నాన్న బలహీనత ఏమిటో తెలుసుకోడానికి ప్రయత్నించి వాళ్ళని కించపరచడం ఆమెకిష్టం లేకపోయింది.


    ఆ విషయం గురించి ఆలోచించడం కూడా మానేయాలని నిశ్చయించుకొంది భారతి.


                                                                         21


    భారతి బ్యాగ్ ని భుజానికి తగిలించుకొని మెల్లగా నడుస్తోంది.


    ఆమె ఆలోచనలన్నీ రాబోయే పరీక్షలపైన ఉన్నాయి.


    ఆర్ట్స్ కాలేజీ బస్టాపు దగ్గరికి చేరబోతున్న ఆమెకి అక్కడున్న ఫియెట్ కారుని చూడంగానే బ్రేకులు వేసినట్టుగా ఆగిపోయింది.


    ఆ కారు ఎవరిదో ఆమెకు తెలుసు.


    మనోహర్ సిగరెట్ కాలుస్తూ ఓ పక్కగా నిలబడి ఉన్నాడు.


    ఆమెకి అతన్ని చూడగానే ఎక్కడలేని చిరాకూ ముంచుకొచ్చింది.


    అతని ముందు నించే వెళ్ళాలి స్టేజికి. బస్టాపుకి వెళ్ళడం అనవసరం. కారణం ఆ రోజు బస్సులు నడవడంలేదు. ఉదయం వచ్చేటప్పుడు ఆటోలో వచ్చింది. బస్టాపులో నించొంటే ఏదన్నా ఆటో వస్తుందని ఆమె ఆశ.


    భారతి అతనికేసి చూడకుండా గబగబ అడుగులు వేసింది.


    "భారతీ!" అని పిలిచాడు మనోహర్. ఆ పిలుపులో ఏదో అధికారం తనపైన అతనికున్నట్టుగా పిలిచాడు.


    భారతి ఈసడింపుగా చూసి వూరుకొంది.


    మనోహర్ నవ్వడానికి చిన్న ప్రయత్నం చేశాడు.


    "ఈ వేళ బస్సులు లేవు. నిన్ను డ్రాప్ చేద్దామనే వెయిట్ చేస్తున్నాను."


    "నాకేం అవసరం లేదు. బస్సులు లేకపోతే నడిచి వెళతాను" అంది.


    "ఎంత దూరమో తెలుసా నీకు?"


    "ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్!" అంది.


    మనోహర్ చేతులు కట్టుకుని నించున్నాడు.


    "నువ్వు ఎందుకిలా చిరాకు పడుతున్నావో నాకు అర్థంకావడంలేదు నేను నీకేమీ అపకారం చేయలేదుగా భారతీ!" మృదువుగా అడిగాడు మనోహర్.


    భారతి అతని మాటలకు ఈసడింపుగా నవ్వింది.


    "ఐ హేట్ యు. నువ్వో హంతకుడివి" అంది.


    ఆ మాటలు అతన్ని కొరడాతో కొట్టినట్టుగా సూటిగా వచ్చి అతని గుండెమీద దెబ్బకొట్టాయి. అతని మొహం ఎర్రగా కందిపోయింది.


    భారతికి అక్కడ ఒక్కక్షణం నించోవాలనిపించడంలేదు.


    బస్సులెలాగూ లేవు.


    ఏదన్నా ఆటో వస్తే బాగుండును. అక్కడికి రెండొందల గజాల దూరంలో ఓ ఆటో ఆగి వుంది. ఎవరో ఎక్కేస్తున్నారు. అది కదిలి అటే వస్తోంది.


    భారతి ముందుకొచ్చి ఆగింది ఆటో.


    "హలో!"


    భారతి తొంగి చూసింది.


    "ఛీ, వీడు దాపురించాడు!" అని మనసులో అనుకుంది.


    "ఆ కారులో వెళ్ళడం ఇష్టంలేకపోతే ఆటోలో రావచ్చు. యింటి దగ్గర దింపేస్తాను" అన్నాడు బోసుబాబు.


    భారతి ఒక్కక్షణం ఆలోచించింది. మనోహర్ నించి తప్పించుకోవాలంటే తను బోసుబాబుతో ఆటో ఎక్కి వెళ్ళిపోవాలి.


    భారతి అడుగు ముందుకేసింది.


    "భారతీ?" అని పిలిచాడు.


    ఆ పిలుపుకి ఎంత కఠినమైన హృదయమైనా సరే కరిగిపోతుంది. కానీ భారతి ఆ పిలుపుని లక్ష్యపెట్టలేదు.


    ముందుకెళ్ళి ఆటో ఎక్కేసింది. బోసుబాబు ఒక్కసారి బయటకి తొంగిచూసి మనోహర్ని ఎగతాళిగా చూసి నవ్వాడు.


    పక్కనే పళ్ళు బిగించి కూచొన్న భారతిని చూసి బోసు అన్నాడు.


    "ఆ కారులో ఉండే సుఖం ఈ ఆటోలో ఉండదు."


    "షట్ యువర్ మౌత్!" అంది కోపంగా.


    "అడగ్గానే ఆటో ఎలా ఎక్కావో మరి?" పరిహాసంగా అన్నాడు.


    "తెలీని మూర్ఖుడి కంటే తెలిసిన మూర్ఖుడు నయం. అందుకే ఎక్కాను. కానీ ఏరాయి అయినా ఒకటే పళ్ళు ఊడకొట్టుకోవడానికి."


    "పోనీలే. అతని కంటే మెరుగని ఒప్పుకున్నావు" అన్నాడు బోసుబాబు.


    చేయి చాచి కొడితే చెంపలు రెండు పగిలిపోయేంత దగ్గర్లోనే వున్నాడు బోసు. కానీ నడిరోడ్డుపైన వెళుతోన్న ఆటోలో ఓ ఆడపిల్ల మగవాడితో పేచీపడితే ఎలాంటి అనర్ధాలు జరుగుతాయో తెలీని మనిషి కాదు భారతి.


    ఓసారి తల బయటికి పెట్టి తొంగి చూసింది.


    ఫియెట్ కారు ఆటోని ఫాలో చేస్తోంది.


    అతను తన వెంట ఎందుకు పడుతున్నాడు?


    తనగురించేమనుకొంటున్నాడు? తనని కూడా అతని అందుబాటులో కెళుతోన్న ఆడవాళ్ళలా భావిస్తున్నాడా?


    తనపట్ల అతనికి ఎలాంటి భావమైనా వుండొచ్చుగాక.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS