Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 36


    ఓరోజు శివరావు నీళ్ళు కట్టడానికి పొలం వెళ్ళాడు.

 

    అంతకుముందు రోజు రాత్రే ఆక్కడ కొన్ని డేరాలు లేచాయి. ఆ డేరాలు ఎవరేశారో, ఎందుకేశారో తెలియదు శివరావుకి. వెళ్ళి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. అతను పొలం దగ్గర వుండగా డేరాల్లో వుంటున్న ఓ వృద్ధుడు అక్కడికి వచ్చాడు.

 

    "బాబూ! మీదేనా పొలం?" అంటూ శివరావుతో మాట కలిపాడు ఆ వృద్ధుడు.

 

    "అవును! మీరెవరు?"

 

    "రైల్వే కాంట్రాక్టు దగ్గర పనిచేస్తున్న కూలీలం బాబూ! బ్రిడ్జి రిపేరు కోసం వచ్చాం. మది దూరపు ప్రాంతంలే" అన్నాడు అతను.

 

    "ఎక్కడ?" అని అడగలేదు శివరావు. తనకు అనవసరమనుకున్నాడు.

 

    "నా పేరు నర్సయ్య బాబూ!" అని ప్రారంభించిన ఆయన మరో అరగంట వరకు ఆ మాటా ఈ మాటా మాట్లాడి ఆ తరువాత వెళ్లాడు.

 

    అలా ప్రారంభమైన వాళ్ళ పరిచయం రెండు మూడు రోజులకి మరింత వృద్ధి చెందింది.

 

    నర్సయ్య 'ఏం శివా!' అనే స్థాయికి వచ్చాడు. ఇద్దరూ ఒకరి కష్టసుఖాలు మరొకరు చెప్పుకునేవారు.

 

    ఓరోజు సాయంకాలం శివరావు పొలం వెళ్లగానే నర్సయ్య అక్కడికి వచ్చాడు.

 

    "బాబూ! నువ్వు నాకో సాయం చేయాలి" కాస్త నసుగుతూ అన్నాడు అతను రాగానే.

 

    "ఏమిటో చెప్పు నర్సయ్యా! చేస్తాను!"

 

    "ఏం లేదు శివా! నేను కొద్దిగా బంగారం యిస్తాను. దాన్ని అమ్మిపెట్టు. డబ్బుకి కటువుగా వుంది. మా కాంట్రాక్టర్ ఊరెళ్ళి ఇంకా రాలేదు. పూట గడవడమే కష్టంగా వుంది" అన్నాడు.

 

    "కానీ ఇది పల్లెటూరు. అనుకున్నంత సొమ్ము రాకపోవచ్చు. గీచి గీచి బేరం ఆడతారు"

 

    "ఫవరాలేదు బాబూ! అవసరం మనది. వచ్చినంతే యివ్వు" అని జేబులోంచి ఓ పొట్లం తీసిచ్చాడు.

 

    అందులో చిన్న ముక్క వుంది. చూస్తూనే అది బంగారం అని పోల్చుకున్నాడు శివరావు.

 

    ఊర్లోకి రాగానే కంసాలి దగ్గరికి వెళ్ళాడు అతను. పొట్లం విప్పి అందులోని ముక్కను యిచ్చి "ఎంత తూకం వుందో చూడు. అలానే ఇది ఎంతకి కొనచ్చో చెప్పు" అని అడిగాడు.

 

    కంసాలి దాన్ని తూకం వేశాడు. అరసవరం వుంది. అంటే దాదాపు పదహారువందల రూపాయలవుతుంది.  తనే కొనుక్కుందామన్న ఆలోచన వచ్చింది శివరావుకి. పొలం అమ్మగా వచ్చిన డబ్బు చాలానే వుంది. కానీ అలాంటి సొత్తు తనకు వద్దులే అనుకున్నాడు.

 

    ఆ ఊర్లో ఒక మోతుబరి రైతున్నాడు. అతని దగ్గరికెళ్ళి బంగారం చూపించి అమ్ముతానన్నాడు.

 

    ఆ రైతు తూకం వేసుకొచ్చి "అరసవరం వుంది. మొత్తం ఎనిమిది వందలిస్తారు" అన్నాడు.


    
    అంత చీప్ గా అడుగుతున్నందుకు బాధపడ్డారు శివరావు. కానీ ఏమీ అనలేని స్థితి. ఆ ఊర్లో ఆ మాత్రం క్యాష్ రెడీగా పెట్టుకోగలిగింది అతనొక్కడే.

 

    ఎంతగా చెప్పినా ఎనిమిది వందలకి ఎక్కువ యివ్వనన్నాడు అతను.

 

    శివరావు చివరికి ఒప్పుకుని బంగారం ముక్క యిచ్చి ఎనిమిది వందలు తీసుకున్నాడు.

 

    మరుసటి రోజు పొలం దగ్గరికి వెళ్ళేసరికి నర్సయ్య రెడీగా కాచుకుని వున్నాడు. జరిగినదంతా చెప్పి ఎనిమిది వందలు చేతిలో పెట్టాడు.

 

    "ఏం చేస్తాం బాబూ! అవసరం మనది. అలాగే కానీ" అని నర్సయ్య కృతజ్ఞతతో చూశాడు.

 

    నర్సయ్య వెళ్ళిపోయాక శివరావు తిరిగి యింటికి బయల్దేరాడు. పదహారు వందలకు పైగానే విలువచేసే బంగారం కేవలం ఎనిమిది వందలకు అమ్మేసిన నర్సయ్య అమాయకత్వానికి జాలిపడ్డాడు. చౌకగా బంగారం కొన్న రైతును జూసి ఈర్ష్య పడ్డాడు. తను కొనుక్కోలేక పోయాననే దిగులు ప్రారంభమయింది.

 

    ఇంటికొచ్చాడన్న మాటేగానీ మనసు మనసులో లేదు. భోజనాలయ్యాక సత్యవతి తమ రెండు మంచాలను పెరట్లో వేసింది.

 

    అది ఎండాకాలం. అందునా వెన్నెల కాలం. ఆకాశంలోని చందమామ నిలబడి మరీ వెన్నెల కురిపిస్తున్నాడు.

 

    సత్యవతికి ఆ రాత్రి ఏదో కావాలన్నది ఆమెను చూస్తేనే తెలుస్తోంది. అప్పుడే మరోసారి స్నానం చేసింది. ఒళ్ళంతా పాండ్స్ పౌడరు రాసుకుంది. నుదుటున వెరైటీగా దోసకాయ బొట్టు పెట్టుకుంది. జాకెట్ హుక్ లు అన్నీ కూడా పెట్టుకోలేదు. మరికొంతసేపటికి ఎలానూ తీసెయ్యాలి అనుకుంటూ పైట మాత్రం కప్పుకుని వచ్చింది.

 

    కానీ శివరావు మాత్రం మూడ్ లో లేడు. ఏం చేసినా అతనిలో ఆశించినంత ఉత్సాహం రాకపోయేసరికి ఆమె మరో పావుగంటకు నిరుత్సాహంతో తన మంచంపై పడుకుంది.

 

    వారం రోజులు గడిచాయి.

 

    ఆరోజు శివరావు పొలం వెళ్ళేసరికి నర్సయ్య అతనికోసమే కాచుకుని వున్నాడు.

 

    "నీ కోసమే వున్నాను బాబూ! ఈసారి నువ్వు నాకో పెద్ద సాయమే చేయాలి" అన్నాడు.

 

    "ఏమిటి?" కుతూహలంగా అడిగాడు శివరావు.

 

    నర్సయ్య మొత్తం పది నిమిషాల్లో చెప్పాడు. వింటున్న శివరావుకి ఒళ్ళంతా పొంగింది. పైకి ఎగదన్నుకొస్తున్న ఆనందాన్ని గుండెల్లోనే అణిచివేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

 

    ఇంటికి తిరిగి వచ్చాడు.

 

    సత్యవతిని లాగి ఒళ్ళో వేసుకున్నాడు. ఆమె ఎత్తయిన ఎద చిన్న మల్లెపూల చెండులా అనిపించింది. నునుపెక్కిన నడుం ముడతలు చేతిలో ఇమిడిపోయే పూలదండల్లా కనిపించాయి. లోతైన బొడ్డు బంగారపు ముక్కలా అనిపించింది.

 

    ప్రతిరాత్రీ ఆమె భారీ పర్సనాలిటీని చూసి భయపడే శివరావు ఆ రాత్రి మాత్రం సమర్ధవంతంగా తనే యాక్టివ్ రోల్ ను పోషించాడు.

 

    భార్య నిద్రపోయాక ఖచ్చితంగా పన్నెండు గంటలకు శివరావు నిశ్శబ్దంగా పైకి లేచాడు.

 

    అంత రాత్రివేళ అతను పొలానికి బయల్దేరాడు.

 

    భర్తకు రానున్న ప్రమాదం తెలియని సత్యవతి మాత్రం అమాయకంగా నిద్రపోతోంది."

 

    అంతవరకూ చెప్పి ఆగాడు తరుణ్.

 

    "ఏం ప్రమాదం?" శృతి కుతూహలాన్ని అణుచుకోలేక ఆత్రుతగా అడిగింది.

 

    "టూరింగ్ టాకీస్ వచ్చేసింది. సినిమా వదిలాక మిగిలిన కథ వివరంగా చెబుతాను. అంతవరకూ సస్పెన్స్" అన్నాడు తరుణ్ అందరూ టాకీస్ లోకి వెళ్ళారు.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS