Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 37

పైకి లేస్తూనే రాడ్ ను అతని పైకి విసిరింది ధీరజ. తలను వంచి భూజాన్ని అడ్డుపెట్టాడు అతను. ఆ దెబ్బ నిప్పుకణం తాకినట్టు చుర్రుమన్నది.
కబీర్ దాదా కనులు ఎర్రబడ్డాయి.
అడ్డుగా వున్న టేబుల్ పైనుంచి దుమికి, పిడికిలి బిగించి ధీరజతో కలబడ్డాడు.
ఆ పెనుగులాటలో డార్క్ రూంలోని లైట్ పగిలిపోయింది.
పూర్తి చీకటి.....
ఉన్నట్టుండి అగ్గిపుల్ల 'చక్' మంటూ గీసి, ఆ వెలుగులో ధీరజ ఎక్కడ నిలబడి వున్నదో గమనించిన కబీర్ దాదా మెరుపులా ఆమె పైకి దుమికాడు.
ఆమె అతని ఉడుం పట్టునుంచి తప్పించుకొనలేకపోయింది.
ఇద్దరూ కింద పడ్డారు....
ఆ చీకటిలో అలా పొర్లిగింతలు పెడుతుండగానే జరిగిపోయింది ఒక సంఘటన!
పోలీసులు షట్టర్ తెరుచుకుని బిల బిల మంటూ లోనికి వచ్చారు.
లైట్లు వెలిగాయి....
ధీరజ....కబీర్ దాదా ఒకరి మీద ఒకరు !
ఆ దృశ్యాన్ని అందరూ చూశారు.
సబ్ ఇన్ స్పెక్టర్ శక్తి అదోలా నవ్వుతూ అతనిచొక్కా పుచ్చుకుని పైకి లేపాడు.
ధీరజ ముందు ఆశ్చర్య పోయినా వెంటనే తేరుకున్నది.
"ఎన్నాళ్ళనుంచి సాగుతున్నది ఈ వ్యభిచారం?"
అతని మాటలకు షాక్ తిన్నదామె!
"ఏమిటి మీరు అంటున్నది.... మతి వుండే మాట్లాడుతున్నారా?" ధీరజ ఆవేశంతో ఊగిపోతూ అన్నది.
"నామాటలు నిజమని నీ అవతారమే చెబుతుంది" గంభనంగా  నవ్వూతూ అన్నాడు సబ్ ఇన్ స్పెక్టర్ శక్తి.
అదిరిపాటుగా తన శారీరాన్ని పరిశీలనగా చూసుకున్న మరుక్షణం ధీరజ సిగ్గుతో బిక్కచచ్చిపోయింది. టీ షర్ట్ చిరిగిపోయి వుంది. బ్రా స్ట్రాప్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. షర్ట్ వున్నా లేనట్టుగానే వుంది తన పరిస్థితి.
"నేను చెప్పేది నిజం... ఇతనే దొంగతనంగా స్టూడియోలోనికి ప్రవేశించాడు. ఏం చేస్తున్నాడో చూద్దామని నేను అతని వెనుకనే లోనికి వచ్చాను. నన్ను చంపపోతుంటే మీరు వచ్చారు. అంతకు మించి నాకు ఏమీ తెలియదు."
"నీ కట్టు కథ చెవిలో పువ్వు పెట్టుకున వాళ్ళకు వినిపించు... నిజం ఏమిటో నేను చెబుతాను విను. నగరంలో ఈ మధ్య వెరయిటీ వ్యభిచారం జరుగుతుంది. అలాంటిదే యిదీనూ.... నీ ఫ్రెండ్ ది కావడం వలన ఈ స్టూడియో తాళాన్ని ధైర్యంగా తీసి లోనకు రాగలిగావు. నిన్ను బుక్ చేసుకున్న ఈ పెద్దమనిషితో లోపలే రాత్రి అంతా గడప వచ్చని నీ ఆలోచన."
"మిస్టర్...." ధీరజ గట్టిగా అరిచింది.
"షటప్__ అరుపులు పెడబొబ్బలు పెట్టినందువలన ప్రయోజనం వుండదు. వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్న నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. కమాన్ వాన ఎక్కు."
అదికాదు ఎస్.ఐ గారు..."
"కాని స్టేబుల్స్... ఆమెను జీప్ ఎక్కించండి" అంటూ బయటకు వెళ్ళిపోయాడు సాబ్ ఇన్ స్పెక్టర్ శక్తి.
కబీర్ దాదా అప్పటికే బుద్ది మంతునిలా పోయి జీప్ ఎక్కాడు.
లాఠీలతో  నెట్టు కుంటూ ధీరజ ను బయటకు తీసుకువచ్చారు కానిస్టేబుల్స్.
సిగ్గుతో తలవంచుకుని, చెంపలపైకి జారిపోతున్న కన్నీటిని తుడుచుకుంటూ ఆమె జీప్ ఎక్కింది.
అంతవరకూ జరిగే దృశ్యాన్ని దూరం నుంచి చూస్తున్న అభినయ్ పెదవులపై చిరునవ్వు మెరిసింది.
తను అనుకున్నది సాధించాలిగాను అనే తృప్తితో కారును ముందుకు దూకించాడు  అతను!
   
                      *    *    *    *
అభినయ్ రమ్ బాటిల్ ఎత్తి గడగడా తాగేసాడు.
అతని వళ్ళంతా చెమటలు పట్టాయి.... కనుగుడ్లు ఎరుపురంగుని పులుముకుని వున్నాయి....
హృదయం దహించుకుపోతుంది.
పవిత్రమయిన 'అమ్మ' అనే రెండు అక్షరాలు అపవిత్రమై ముక్కలు చెక్కలైపోయాయి.
తన తల్లిని నిందించిన ధీరజ నాలుకను వేయి ముక్కలు చేయాలి  అన్నంత కోపం వచ్చింది అతనికి.
అయినా ఆవేశాన్ని తమాయించుకున్నాడు.
యాష్ ట్రే సిగరెట్ పీకలతో నిండిపోతుంది.
అభినయ్ ఆ రాత్రి అంతా విపరీతంగా తాగుతూనే వున్నాడు. పదేపదే అతని కనులముందు ధీరజే కనిపిస్తుంది. ఆమె అన్న మాటలే చెవులలో హోరుమంటున్నాయి.
పోలీసులు అరెస్టు చేశాక జర్నలిస్టు ధీరజ బెయిల్ మీద విడుదల అయింది.
ఆమె పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తుండగా...
"హల్లో ధీరజా... ఎలా వుంది నేను ఇచ్చిన షాక్ ట్రీట్ మెంట్?" అంటూ పలకరించాడు అభినయ్.
తను వ్యభిచారిణిగా ఎందుకు చిత్రీకరించబడిందీ అప్పుడు అర్దమయిందామెకు.
"ఛీ.... నీదీ ఒక బ్రతుకేనా.... అవునులే.... నీ ఒంట్లో ప్రవహించే రక్తం కూడా మలినమయినదేగా.... అందుకే అలాంటి బుద్ధులే పుడుతుంటాయి" ధీరజ ఈసడింపుగా అన్నది.
ఆమె మాటలకు అతని తల తిరిగిపోయింది.
"ఏం కూశావే.... నన్నూ, నా తల్లిని నిందిస్తావా.... నీ పొగరు దించేస్తాను" అంటూ ఆమెను కొట్టడానికి చెయ్యి పైకెత్తాడు అభినయ్.
యూస్టుపిడ్....చెయ్యిదించు. పౌరుషం వుండగానే సరికాదు. సాటి ఆడదానిగా ఆడదాని గుట్టు బయట పెట్టకూడాడు అనుకున్నాను. నా మాటలలోని నిజం నీకు తెలియాలి అంటే వెళ్ళి నీ అమ్మనే అడుగు" అని ఆమె వేగంగా వెళ్ళిపోయింది.
అభినయ్ ఆకాశం విరిగి నెత్తిన పడినట్టు అయింది. తల్లి అంటే ఎంతో అభిమానం, ప్రేమ అతనికి. దైవంలా భావించే తన తల్లి మలినురాలా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS