Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 36

అతని రాజకీయ జీవితం సమాధి అయిపోతుంది.
ధీరజ ఆలోచనలతో హాస్పిటల్ నుంచి యింటికి బయలు దేరింది.
దారిలో ఆమెకు మారుతీ వ్యాన్ ఎదురయింది.
స్టీరింగ్ ముందు వున్న కబీర్ దాదాను చూడగానే గుర్తుపట్టింది ఆమె.
తనను చంపటానికి ప్రయత్నించిన కిరాయి గూండా ఎక్కడికో వెళుతున్నాడు. అతని చేతిలోనే సుధాకర్ కత్తిపోట్లు తిన్నాడు.
ఎక్కడికి వెళుతున్నాడో, అతని మాక్టివిటీస్ ఏమిటో తెలిస్తే తన పరిశోధనకు ఉపయోగిస్తుందనే వూహతో హోండాను వెనక్కి తిప్పి ఆ వ్యాన్ వెనకునే బయలుదేరింది.
ఎవరయినా తనను అనుసరిస్తారేమోననే జంకులేకుండా నింపాదిగా వెలుతున్నాడతను.
మూతబడి వున్న సుధాకర్ స్టూడియో ముందు వాన ఆగింది. కిందకు దిగిన కబీర్ దాదా తనని ఎవరూ గమనించటం లేదని నిర్దారించుకున్నాక దొంగతాళాలతో స్టూడియో ను తెరవడంలో మునిగిపోయాడు.
ఆశ్చర్యం, అనుమానం ఒక్కసారిగా ధీరజ ను ఉక్కిరి బిక్కిరి చేశాయి.
హాస్పిటల్ పాలు కావడం వల్ల స్టూడియో ను ఎవరూ తెరవడం లేదు.
ఫోటోలను జయచంద్ర ఎప్పుడో సంపాదించాడు. మరి ఇప్పుడు ఏ అవసరం వుంది కిరాయి గూండాను పంపి వుంటాడో ఊహించలేక పోతుంది.
వాస్తవానికి గవర్నర్ పి.ఏ నుంచి ఫోన్ అందుకున్న వెంటనే క్రిమినల్ లాయర్ సత్యమోహన్ తన మేధస్సుకు పదును పెట్టాడు.
అంత ధైర్యంగా గవర్నర్ తో సాక్ష్యాలు తెస్తాను అని చెప్పిందంటే ధీరజ దగ్గర ఆమె తీసిన ఫోటోలకు సంబందించిన సమాచారం ఇంకేదో వుండి వుండాలని వూహించాడు. ఆలోచిస్తుంటే మరొక విషయం స్పురణకు వచ్చింది.
ఆ హడావుడిలో ఫోటోలను అయితే తెప్పించాడు కానీ వాటి నెగిటివ్స్ అక్కడే వుండాలనే వూహ తట్టింది. ఆ ధైర్యంతోనే అలా మాట్లాడిందని భావించి వెంటనే కబీర్ దాదాను స్టూడియో కు పంపించాడు సత్యమోహన్.
ఆ రోజు ఫోటోలతోపాటు నెగిటివ్స్ కూడా వాళ్ళ చేతులలో పడ్డాయనే  అనుకుంటుంది ధీరజ. నెగిటివ్స్ ఇంకా ఆ స్టూడియోలోనే వున్న విషయం ఆమెకు తెలియదు!
కబీర్ దాదా ఇంకా స్టూడియో షట్టర్ ను తెరిచే ప్రయత్నంలో వుండగానే, ఆ దృశ్యాన్ని కెమేరాలో బంధించింది ధీరజ.
షట్టర్ ను పూర్తిగా తెరవకుండానే సగం తెరిచి ఒంగొని లోనికి వెళ్ళాడు అతను.
మిగిలిన షాపులవాళ్ళు అది చూసినా ఎవరూ పట్టించుకోలేదు.
షట్టర్ ను మూసి పోలీసులకు ఫోన్ చేసి పిలిపించాలనుకున్నది. కానీ అంతలోనే మరొక అనుమానం. అతను లోపలకు ఎందుకు వెళ్ళాడోననే ఆలోచన రావడంతో ధీరజ కూడా అతను అనుసరించిన మార్గానే లోనికి వెళ్ళింది.
అక్కడకు కొద్ది దూరంలో ఆగి వున్న కారులో నుంచి ధీరజను గమనిస్తున్న ఒక వ్యక్తి చకచకా ముందుకు వచ్చి బయట నుంచే స్టూడియో షట్టర్ ను మూసి తాళం వేశాడు.
అతను.... అభినయ్!
తనలో తనే నవ్వుకుంటూ తన కారు దగ్గరకు వెళ్ళాడు అతను.
కబీర్ దాదా డార్కు రూమ్ లోని నెగిటివ్స్ ను పరిశీలించడాన్ని గమనించింది ధీరజ.
అసలు విషయం అప్పుడు అర్దమయింది ఆమెకు.
తను తీసిన ఫోటోల నెగిటివ్స్ వారి చేతికి చిక్కలేదని తెలియడంతో ఉత్సాహం పొంగుకువచ్చింది ఆమెలో.
తన శ్రమ వృధా పోలేదు.
ఎలాగయినా వాటిని శత్రువుల చేతికి చిక్క నివ్వకూడదు అని అనుకున్నది.
ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం ధీరజ కంటికి కనిపించిన ఇనుప రాడ్ ను చేతితో అందుకుని అడుగులో అడుగు వేస్తూ అతనని సమీపించింది.
రాడ్ తో బలంగా తల మీద కొట్టాలని ఆమె ఆలోచన.... అయితే చీకట్లో పాదాలకు అడ్డుగా వున్న స్టూల్ ను గమనించలేదు. ధీరజ స్టూల్ తగిలి ముందుకు తూలింది.
గళ్ళున శబ్దం....!
అదిరిపడి చూశాడు అతను.
బోర్లా పడిపోయిన ధీరజ  పైకిలేస్తున్నప్పుడే కబీర్ దాదా ఆమెను గుర్తుపట్టాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS