Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 35


    అది చూచి "అదిగో రమోలా!" అని కంగారుగా అరిచింది విమీ.

    ఆమె నోరు మూసింది ఆమని!

    "అది మనల్ని చూచింది కాని ఏమీ తెలియని దానిలా తలదించుకు పోతోంది అంటే ఏదో కారణం ఉండాలి. వెనుక వాహనాలమీద వచ్చిన యువకులు కూడ అతని మనుషులే అయుండాలి!

    దాని ముఖంలో భయం చూడు! వారు నిలిచిన తీరుచూడు. మాటాడుకోకుండా గంభీరంగా ఉన్నారు. ఎన్ సర్కిల్ చేసినట్టు నిలబడ్డారు.

    చూడు చూడు! మనకి అర్ధం కానిది ఏదో జరుగుతోంది?" అన్నది ఆమని! విమీ నోరు మూతపడింది.

    భయంతో కళ్ళు మరింత పెద్దవిగా విచ్చుకున్నాయి.

    "నిజమే! ఏదో ప్రమాదంలో చిక్కుకుంది" అంది విమీ వణికే కంఠంతో. వారిద్దరూ మౌనంగా అయిపోయి కళ్ళు అప్పగించేశారు.

    యువకులు రమోలాకి మరింత దూరంగా పోయారు. గడ్డం పెంచుకున్న యువకుడు మాత్రం ఆమెను అంటిపెట్టుకుని తిరుగుతున్నాడు.

    మాటాడుతున్నట్టు ఎవరికీ కన్పించకుండా పెదవులు కదిలిస్తున్నాడు. రమోలా ముఖంలో అయిష్టత వ్యక్తమవుతున్నా తప్పనిసరి అయినట్టుగా అతని మాటలు వింటోంది. ఆమనికి రమోలా స్థితి అర్ధమయింది.

    కారణం మాత్రం అర్ధం కాలేదు.

    చేసుకోవాలని తీవ్రంగా ఆలోచిస్తోంది. ఏ చిన్న అవకాశం దొరికినా చాలు అన్నట్లుగా ఆశగా ఎదురు చూస్తోంది.

    తన తాలూకు మనుషులు ఎవరైనా ఉన్నారని అనుమానిస్తే వారు చుట్టుముట్టి అల్లరి చేయటానికి ప్రయత్నిస్తారు. అవసరమయితే అవలీలగా హత్య చేస్తారు.

    అందువల్ల రమోలా అతి జాగ్రత్తగా నడుచుకుంటోంది.

    కనీసం తన మనుషుల వంక కన్నెత్తి చూచినా వారికి అనుమానం కలుగుతుంది. కాని వారు తనని చూచారనే విషయం ఆమెకు రవంత ధైర్యాన్నిచ్చింది. ఏదో ఒక అవకాశం దొరకవచ్చు అని జీవితాశ కలిగింది.

    జనంలో కలకలం అధికమయంది.

    ముందుగా ఒక పోలీస్ వ్యాన్ వచ్చింది. దానిలోంచి అధికారులు దిగారు. సిబ్బంది దిగారు. వచ్చిన ప్రముఖుడు విదేశాలనించి వచ్చిన భారతీయుడే! అంతా అధికమయిన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

    వారితో పాటు ప్రొఫెసర్ అయిన డాక్టరుగారి సెక్రటరీ దిగాడు.

    ఎప్పుడయితే వారు రంగప్రవేశం చేశారో యువకులు జనం మధ్య నించి తప్పుకుని వెళ్ళిపోవటం గమనించింది ఆమని. వారు చాలా దూరం వెళ్ళి పొంచి ఉండటాన్ని చూచిందామె! గడ్డం పెంచుకున్న యువకుడు కూడ రమోలా నించి వేరు అయాడు. దూరంగా వెళ్ళిపోయాడు.

    ఇదంతా ఒక పధకం ప్రకారం జరుగుతున్న పెద్ద కుట్రలా భావించింది ఆమని. ఆమె ఆలోచిస్తూ ఉండగానే ప్రొఫెసర్ డాక్టరూ, ఆ వెనుక అయిదారు కార్లు వచ్చాయి. అందరూ క్రిందికి దిగి నేరుగా వేదిక దగ్గరకు పోయారు.

    వేదిక మీదికి రాగానే పాపను పలకరించాడు ప్రొఫెసర్.

    ముందు ఒక నగర ప్రముఖుడు లేచి ప్రొఫెసర్ గారు వైద్య శాస్త్రములో సాధించిన విజయాలు వివరించాడు. ఆయన జెనిటిక్స్ లో సాధించిన అద్భుతాలు ఉదహరించాడు.

    మరో దేశం నించి ప్రభుత్వం ప్రతినిధిగా ఆయన వచ్చారు.

    రెండు సంవత్సరాల క్రితం ఆయన భారతదేశంలో ఉండేవారు.

    అప్పటిలో ఆయన ఒక అద్భుతం సాధించాడు.

    దాని ఫలితమే ఈ పాప.

    అవన్నీ సాంకేతికమయిన విషయాలు.

    నాకన్నా డాక్టరుగారు వివరించటమే బాగుంటుంది అని ముగించాడు.

    ప్రొఫెసర్ ఆ వింత విషయాన్ని చెప్పేందుకు లేచాడు. కొన్ని కాలేజీస్ యూనివర్శిటీల నించి వచ్చిన అభిమానులు పేరుపేరున ఆయన్ని పూలదండలతో ముంచెత్తుతున్నారు. సన్మానం చేస్తున్నారు.

    వ్యాన్ చాటున పొంచి జనంలో ప్రతి ఒక్కరి కదలికని అతి జాగ్రత్తగా పరిశీలించి చూస్తున్న ఒక అధికారి దగ్గరకు చేరింది ఆమని.

    ముందుగా తను వ్యాన్ లోపలకు ఎక్కి కూర్చుంది.

    సాధారణ వ్యక్తులు ఎవరూ గమనించలేదు.

    పోలీసు అధికారి గమనించాడు. ఒక ఆడపిల్ల పబ్లిక్ ప్లేస్ లో అనుమతి లేకుండా వ్యాన్ లో ఎక్కేయటం చిత్రమయిన విషయమే!

    అతడు లోనికి తొంగి చూచాడు.

    "ఎక్స్ క్యూజ్ మి! నో నాయిస్! ప్లీజ్ కమిన్" అంది ఆమని చిన్న స్వరంతో. అతడు ఆమె అభిప్రాయాన్ని గమనించాడు. లోనికి వచ్చేశాడు.

    ముఖం ప్రశ్నార్ధకంగా అయింది.

    అక్కడ పోలీసు అధికారులు ప్రతి కదలికని ఎంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నారో అలాగే అంత జాగ్రత్తగా గమనించేవారు అయిదుగురు యువకులు. ముందు ఒక యువతి ఆ తరువాత అధికారి వ్యాన్ లోపలకు వెళ్ళటం గమనించారు. ఎంత సేపయినా వారు దిగిరాలేదు.

    లోపల అపాయింట్ మెంట్స్ ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు అని భావించాడు. తమకి వ్యతిరేకమయిన ధోరణిలో అలాంటి సంఘటన జరిగే అవకాశాలు ఏమీ లేవని ఊహించి ఉపేక్షించారు.

    ఆమని చెప్పింది శ్రద్ధగా విన్నాడు అధికారి.

    అద్దంలోంచి రమోలా ఉన్నచోటుని చూపించింది ఆమని!

    అతడు బైనాక్యులర్స్ లో చూచాడు. అది చాలా వివరాలను అందించి అయిదునిముషాల తరువాత అన్నాడు.

    రమోలా ఒక పధకం ప్రకారం వేదికవైపు నడుస్తోంది. ఎవరికి అనుమానంరాని పద్ధతిలో ఆపని చేస్తోంది.

    అంతేకాదు. ఆమె చేతిలో ఒక చిన్న వస్తువు కూడ ఉంది.

    ఎవరయినా టెర్రరిస్టులు హ్యూమన్ బాంబు ప్రయోగిస్తున్నారా?

    ఈ అనుమానం రాగానే బాగా అలర్ట్ అయిపోయాడు.

    మాగ్నెట్ లో కేంద్రాన్ని కలిపే స్పీకర్ లో అరనిముషం మాటాడి పోలీస్ కంట్రోల్ రూంకి పరిస్థితి వివరించాడు.

    వారు వైర్ లెస్ లో వేదిక దగ్గర ఉన్న అధికారులకు ఈ సమాచారం అందించారు. రమోలా రూపురేఖలు బట్టలు అభివర్ణించి చెప్పారు.

    ఎక్కడ ఎలాంటి కదలికలు లేకుండానే ప్రొఫెసర్ కి అతి సమీపంలో ఎస్కార్ట్ గా ఉన్న అధికారులు తమను గుర్తించారు.

    చేతిలో ఒక చిన్న వస్తువు వుంచుకుని పధకం ప్రకారం ముందుకు వస్తున్న రమోలా హ్యుమాస్ బాంబ్ అని వారు ధృవీకరించుకున్నారు.

    ఆమె మరో పది అడుగులు వేయాలి.

    భయంకరమయిన క్షణాలు ప్రారంభమయినాయి.

    ఒక తల్లికి అనేక మంది పిల్లలు కలగడం సహజం! కాని ఓకే బిడ్డకు ఇద్దరు తల్లులు కలిసి జన్మ యివ్వటం సాధ్యంకాదు. అది కలలో కూడ జరగని పని అనుకునేవారు ఒకప్పుడు! ఇప్పుడు కలలో కాదు. కళ్ళ ఎదుట జరిగింది.

    ఈ ఫలితాన్ని సాధించటానికి ఎన్నో సంవత్సరాలు కృషి చేశాను.

    ఇదో అద్భుతం! మీ కళ్ళ ఎదుట కన్పించే పాపకు జన్మ యిచ్చిన తల్లులు ఇద్దరు. అది ఎలా సాధ్యమంటారా?" ప్రొఫెసర్ ఏదో వివరిస్తున్నాడు.

    శ్రోతలు మంత్రముగ్ధులు అయిపోయి విజ్ఞానశాస్త్రంలో విజయవంతంగా జరిగినా ఆ అద్భుత ప్రయోగాన్ని గురించి వింటున్నారు.

    కాని అధికారులు ఆ కార్యక్రమము వొదిలిరారు.

    మరో రెండు అడుగులు ముందుకేసి అన్ని వంకలా చూచింది రమోలా.

    ఇంక ఏ క్షణంలో బాంబు ప్రేల్చివేయాలనే నిర్ణయం టెర్రరిస్టులది. వారు బయట పొంచి చూస్తున్నారు.

    ఏ క్షణంలో అయినా బాంబు ప్రేల్చవచ్చు. అయితే సక్రమంగా అనుకున్న చోటుకి ఉంచితే తను క్షేమంగా బయటకు వెళ్ళే అవకాశం మాత్రం విడిచిపెడతారు.

    ఆమె చాక్లెట్ బాంబుని ఉంచాల్సిన చోటు చేరుకుంది.

    అధికారులు అపరిమితమయిన జాగ్రత్తలో ఉన్నారు.

    కాని రమోలా ఆ విషయాన్ని తెలుసుకోలేక పోయింది.

    తనద్వారా టెర్రరిస్టులు సఫలమవుతున్నారనే అనుకుంది.

    బాంబుని బాలబాలికలకు పంచేందుకు సిద్ధంచేసి ఉంచిన చాక్లెట్స్ ప్రక్కన ఉంచింది. చాలా నిశ్శబ్ధంగా ఎవరికి అనుమానం రాకుండా ఆపని తాను చేయగలిగానని అనుకుంది.

    వెనుదిరిగి ఒక్క అడుగు వేసింది.

    ఒక నిపుణుడయిన అధికారి వచ్చి బాంబుమీద డిటోనేటర్ పౌడర్ చల్లాడు. కొద్ది క్షణాల వరకు అది ప్రేలదు. దాన్ని తీసుకుని మెరుపులా పరుగుతీసి బావిలో పడవేశాడు.

    భూకంపం వచ్చినట్టు ఒక్కసారి నేల అంతా దద్ధరిల్లింది.

    బావిలోంచి నీరు మంటలు పొగ కలిసి ప్రక్కనున్న చెట్లు అంత ఎత్తుకి లేచినాయి. జనం అంతా కకావికలు అయిపోయినారు.

    కాని అందరూ క్షేమంగా బయట పడ్డారు.

    వ్యాన్ లో అధికారి ప్రక్కన కూర్చుని ఉన్న ఆమని క్రిందికి దిగి వచ్చింది. అధికారులు టెర్రరిస్టుల వేటలో ఉన్నారు.

    గడ్డం పెంచుకున్న గెడకర్రలాంటి యువకుడు దొరికాడు.

    ఆమనిని కావలించుకుని ఏడ్చింది రమోలా! ఆమని ఓదార్చింది.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS