విజయ ఎక్కి కూర్చున్నాక కారు స్టార్ చేశాడు.
కారు రోడ్డుమీద దూసుకుపోతోంది.
ప్రశాంత్ క్రీగంట ఆమె కేసి చూశాడు.
ఆమె విండోలోంచి బయటికి చూస్తోంది.
గాలికి ఆమె పవిట చెదిరి లోనెక్ జాకెట్లోంచి ఆమె వక్షశిఖరాలు పైకి ఉబికి కనుపిస్తున్నాయి. ఆమె మెడలో వున్న ఒంటిపేట బంగారు గొలుసు రెండు శిఖరాల లోయలో చిక్కుకొని కనిపిస్తోంది.
ప్రశాంత్ విజయ గర్వంతో కారుని ముందుకి దూకించాడు.
20
విజయ క్రీగంట అతనికేసి చూసింది. అతను ఓరగా తన గుండెలకేసి చూస్తూ పెదిమలని తడుపుకోవడం గమనించింది. ఆమె మొహంలో ఓ మందహాస రేఖ వెల్లివిరిసింది.
భుజం మీద నుంచి వడిలోకి జారిపోయిన పవిటని సర్దుకోవడానికి విజయ ఎంతమాత్రమూ ప్రయత్నించలేదు.
గాలికి ఎగిరి మొహం మీద పడుతోన్న కురులని ఎడం చేత్తో నాజూకుగా వెనక్కి తీసుకొంటోంది.
"నీ టైమంతా పాడు చేస్తున్నాననుకుంటున్నావు కదూ!" అడిగింది విజయ.
"నేనెప్పుడూ అలాఅనుకోను. ఎంతో దూరంనించి ఎంతో శ్రమపడి నా కోసం వచ్చావ్. ఈ రోజంతా నీ కోసమే ఖర్చు పెట్టాలనుకుంటున్నాను...."
"ఇలా నాలాంటి అభిమానులు వచ్చినప్పుడు మీ టైమ్ నిలా పాడుచేసుకొంటావన్నమాట!"
అతను చిరునవ్వు నవ్వాడు.
"అందరికోసం ఒకేలా చేస్తే ప్రత్యేకత అంటూ వుండదు. కేవలం నీకు నేను ఇస్తున్న ఇంపార్టెన్స్ ఇది."
"దేనికి?"
"నువ్వు రాసిన మొదటి లేఖ చదివినప్పుడే నా దగ్గర నీకో ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాను విజ్జే!
నీకు తెలుసో తెలీదో, నేను ఎవర్ని పడితే వాళ్ళని ఎంటర్ టెయిన్ చేయను."
ప్రశాంత్ మాటలకి వస్తున్న నవ్వుని ఆపుకోడానికి విజయ పంటితో పెదిమలని నొక్కి పెట్టింది.
"ఇంకెంత దూరం?" అడిగింది.
"చాలా దగ్గర కొచ్చేశాం!" అన్నాడతను కారుని ఓ రోడ్ లోకి టర్న్ చేస్తూ.
"దగ్గరగానా?" ఆమె కళ్లు పెద్దవయినయి.
"ఊ!"
"ప్రశాంత్!"
"చెప్పు. నువ్వేం చెప్పినా వినడానికే ఈ రోజుని నీకు అంకితం చేస్తున్నాను!"
విజయ మందహాసం చేసింది.
"నీమాటలుకూడా నీ నవలల్లో హీరో మాటల్లానే వున్నాయి. రాసేటప్పుడు హీరో పాత్రని నీకు అన్వయించుకొంటుంటావా?"
"అది సరస్వతీదేవి కటాక్షం"
"నీకు పెళ్లయిందా? శ్రీమతి పేరేమిటి? పిల్ల లెంతమంది!"
కుతూహలంగా అడిగిన ఆమె ప్రశ్నకి ప్రశాంత్ ఆమెకేసి సగం మూసిన కళ్లతో చూసి.
"కాలేదు. కనక శ్రీమతి పేరు చెప్పలేదు. శ్రీమతి లేదు కాబట్"?టి పిల్లలు కూడా ఇంకా లేరు!"
"నిజమా? లేక పెళ్లాం. పిల్లలు, సంసారం ఇవన్నీ చెపితే నీ గ్లామర్ తగ్గిపోతుందని భయమా?" అడిగింది విజయ.
"అలా కూడా చెప్పుకోవచ్చని నాకు తెలీదే!" అతని మాటల్లో ఆశ్చర్యం.
"చెప్పకపోయినా, నీ సంగతి నాకు తెలీదా! మా ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకొంటూ వుంటాం కదా!"
కారు కొంచెం వేగం తగ్గింది.
"ఏం తెలుసు?"
"నువ్వు గ్లామర్ రైటర్ వి కదా! అందుకని అలా చెప్తున్నావేమో నని!"
ప్రశాంత్ ఆమెకేసి నవ్వుతూ, వెనకనించి చేతిని పోనిచ్చి భుజం మీద వేసి కొంచెం దగ్గరగా లాక్కున్నాడు.
ఆమె ఏ విధమైన అభ్యంతరం చెప్పకుండా జరిగింది.
"గ్లామర్ పోతుందని ముసలి వాడినైన తరువాత పెళ్లి చేసుకోమంటావా?" ఆమె భుజంపైన సున్నితంగా చేత్తో నొక్కాడు.
"అయితే త్వరలో చేసుకొనే అభిప్రాయం వుందన్నమాట?" అంది విజయ విండో స్క్రీన్ లోంచి్ రోడ్డు మీదకి చూపుని సారిస్తూ.
"నేనిష్టపడే అమ్మాయి దొరకాలి"
"మీ పెద్దవాళ్లకి నచ్చాలన్న ఇదేం లేదా!"
"నాకు సంబంధించినంతవరకూ అన్ని విషయాల్లోనూ నాకు నేనే పెద్ద."
"అంటే?"
"నాకెవరూ లేరు. ఒంటరివాడిని."
"ఓహ్! అయితే ఇంతకీ ఇష్టపడే అమ్మాయి కావాలా? లేక నచ్చే అమ్మాయి కావాలా?" విజయ మరో ప్రశ్న.
"ఇష్టపడడానికీ, నచ్చడానికీ తేడా వుంటుందా?" అడిగాడు.
