Previous Page Next Page 
యుద్దక్షేత్రం పేజి 35


     పల్చని ఆకుల్లాంటి చెప్పుల్లో ఆమె చిన్నిపాదాలు మురిపెంగా  కనిపిస్తున్నాయి.

     మొహం పైకి పడుతోన్న జుత్తుని చేత్తో వెనక్కి తోసుకొంటోంది విజయ.
 
     ప్రశాంత్  పెదిమలను తడిచేసుకొంటున్నాడు.

     "మమ్మల్ని, మీరు" అని నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నావు విజయ!

     మీ అభిమాన రచయితల్లో క్లోస్ నెస్ కావాలనుకొనేదానివి నన్ను "నువ్వు" అని పిలిస్తే నాకు ఆనందంగా వుంటుంది."

     విజయ కళ్లు పెద్దవి చేసి  చూసింది.
 
     "ష్యూర్ ప్రశాంత్! నీకు తెలుసా! నేను నీకు మొదటిసారి లెటర్ రాస్తుంటే మా ఫ్రెండ్సందరూ నన్ను ఎగతాళి చేశారు" అంది.

     "దేనికి?"

    "ప్రశాంత్ లాంటి పెద్ద రచయితలకి అసలు రాయడానికి తీరిక వుండదు. నీలాంటి వాళ్లు రాసే బేవర్స్ వుత్తరాలకి సమాధానం రాస్తాడా" అని.

     అప్పుడు నేను నువ్వు నాకు లెటర్ రాసి తీరతావని పందెం కాశాను"

     "అవును.  ఆ విషయం నాకు లెటర్లో రాశావు. అందుకే నిన్ను గెలిపించాలని ఆ రోజు ఎన్ని పనులున్నా నీకు రిప్లయి ఇచ్చాను."గుప్పుమని సిగరెట్ పొగని గాలిలోకి విడచి పెట్టాడు ప్రశాంత్.

     "థాంక్స్ ఎ లాట్. నేను రాసిన ఆ మొదటి వుత్తరం నీకు గుర్తున్నదంటే నమ్మలేక పోతున్నాను."
 అతను నవ్వేడు.

     "అందరివీ గుర్తుండవు. కొందరిని అలా గుర్తుపెట్టుకుంటూ వుంటాను"   

     "నేనెలా వుంటానో కూడా తెలీకుండానే నన్ను గుర్తుపెట్టుకున్నావా?" ఆశ్చర్యంగా అడిగింది విజయ.

     "చెప్పానుగా! అందరు గుర్తుండరు. నీ ఉత్తరం నాకు నువ్వు ఆ గుర్తుండేలా చేసింది" చెప్పాడు  ప్రశాంత్.

     "థ్యాంక్స్"

    "నువ్వు హైదరాబాద్ కి ఇంట్లో చెప్పొచ్చావా?" అడిగాడు.

    విజయ అతని వంక అదోలా చూసింది.

     "ఎందుకలా అడిగావు?"

    "నాకోసం నన్ను కలుసుకోవడానికి వచ్చే చాలామంది ఇళ్లల్లో చెప్పకుండా వస్తుంటారు."

    "న్నో! నేను అలాంటి కేడర్ కాదు. నేను వచ్చింది నిన్ను చూడాలని. కలుసుకోవాలనే కానీ ఒంటరిగా మాత్రం రాలేదు" అంది విజయ.

     ప్రశాంత్ ప్రశ్నార్దకంగా చూశా డామెకేసి.

     "అంకుల్ తో వచ్చాను. ఆయన లాయర్. హైకోర్టులో పనిమీద ఆయన వస్తుంటే నిన్ను కలుసుకోవచ్చని వచ్చాను" చెప్పింది విజయ.

     "పేరు?"

    "లాయర్ గోవర్దనరావు."

    "ఐసీ!' అని చేతిలో సిగరెట్ పీకని  అవతల విసిరేసి  మరో సిగరెట్ ని  వెలిగించాడు.

     "ఈ రోజు వుంటున్నావా?" అడిగాడు ప్రశాంత్.

    "లేదు. సాయంత్రం కారులో వెళ్ళిపోతున్నాం!" చెప్పింది విజయ.

     ప్రశాంత్ సిగరెట్ పొగని ఊపిరితిత్తుల్లోకి పీల్చి వదిలాడు.

     టైం చాలా తక్కువ వుంది.

     అనవసరంగా కూర్చుని కబుర్లు చెప్పుకోవడం తెలివి తక్కువ పని.

     విజయని ఇంటికి తీసుకెళ్లి కార్యక్రమం పూర్తి చేసుకోవాలి.

     ఆమెకేసి చూశాడు.

     ఆమె అతనికేసి చూస్తోంది.

     ఆ కళ్ళల్లో తనపట్ల ఆమెకి గల ఆరాధన అంతులేనిదని ప్రశాంత్ గ్రహించాడు.

     "లే వెళదాం?" అన్నాడు.

     ఆమె లేచి నిలబడుతూ.

     "ఎక్కడికి?" అడిగింది.

     "ఇంతదూరం వచ్చిన దానివి నా కుటీరం చూడకుండానే వెళ్లిపోతావా?"

    ఆమె నవ్వింది.

     "మరోసారి వస్తాను."

    అతను ప్రయత్న పూర్వకంగానే ఆమెభుజంమీద చేయివేసి -

    "న్నో అలా అకడూడదు. మరోసారి ఎలాగూ వస్తావు. కనక ఈ రోజు ముందుగా రావాలి? అది పద్దతి కూడా! అదీ కాక నీకోసం ఈ రోజు ఎంగేజిమెంట్స్  అన్ని కాన్సిల్ చేసుకొన్నాను."

    ఆమె క్షణం ఆలోచించి.

     "ఓ. కె. పద!" అంది.

    బయట పార్కింగ్ ప్లేస్ లో వున్న పియెట్ కారు దగ్గరికి నడిచాడు ప్రశాంత్, అతని వెనకే నడిచింది విజయ.
 
     అతను కారెక్కి స్టీరింగ్ ముందు కూర్చుని ఫ్రంట్ డోర్ తెరిచాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS