"అడిగేదేదో నెమ్మదిగా అడగండి. ఆడపిల్లమీద చేయి చేసుకొంటారేమిటి?" అంది నాగలక్ష్మి.
"నెమ్మదిగా అడగాలా? దొంగల్ని నెమ్మదిగా అడిగితే వస్తువుల్ని ఇస్తారా?"
"నేనేం దొంగని కాదు!" రోషంగా అంది పారిజాత.
"దొంగవి కాకపోతే పతకం ఎక్కడ పోయింది? మర్యాదగా ఇవ్వు. ఇది ఏం చేసి వచ్చిందో మీకు తెలుసా? పెళ్ళి పీటలమీదనుండి పారిపోయివచ్చింది. నలుగుర్లో నవ్వుల పాలు చేసి వచ్చింది."
"ఆ పిల్లకు ఇష్టంలేని పెళ్ళి ఎందుకు చేయాలనుకొన్నారు?"
"ఇష్టంలేని పెళ్ళా? ఎవరన్నారు ఇష్టంలేని పెళ్ళని? తను ఒప్పుకొన్నాకే కదా ముహూర్తం పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొంది. తీరా పీటలమీదనుండి పారిపోయి వస్తుందా? వస్తే ఊరుకొంటామనుకొందా? కాళ్ళు చేతులు కట్టేసి మరీ తీసుకువెడతాను! అప్పుడు ఏం చేస్తుందో, దీనికి అడ్డం ఎవడు వస్తాడో చూస్తాను!"
పారిజాతను సమర్ధిస్తూ ఏదో మాట్లాడబోయింది నాగలక్ష్మి.
రంగనాథం కఠినంగా, "నువ్వేమిటి మధ్య?వాళ్ళ పిల్ల! వాళ్ళు ఏమైనా చేసుకొంటారు. పెళ్ళి చేసుకోకపోతే చంపి పాతర వేసుకొంటారు" అన్నాడు భార్యను కసురుతూ.
"హవ్వ! ఇవాళ హఠాత్తుగా వాళ్ళపిల్ల ఎలా అయిందండీ!"
"వాళ్ళపిల్ల కాకపోతే నీ పిల్లనా?"
"ఆ పిల్లకు ఎవరూ దిక్కులేదని ఇలా బలవంతపు పెళ్ళి జరిపిస్తారా!"
"వాళ్ళు చేసుకోకపోతే నువ్వు పెళ్లి చేస్తావా? ఎవరికో ఇచ్చేబదులు తమ కొడుక్కే చేసుకొంటున్నారు. నయం కాదా?"
అప్పటికే ఈ గోలకు ప్రేక్షకులు చాలానే తయారయ్యారు. కోమలమ్మ ఎప్పుడు వచ్చిందో ఆవిడా వచ్చింది. మనోహర్ కూడా వచ్చాడు. అతడు దూరంగా చేతులు కట్టుకు నిలబడి మౌనంగా ఆ ఇంటి వరండాలో జరుగుతూన్న సన్నివేశాన్ని తిలకిస్తున్నాడు.
భర్త తీక్షణంగా చూస్తూ గద్దించినట్టుగా మాట్లాడేసరికి ఇక నోరు మూసుకోక తప్పలేదు నాగలక్ష్మికి. ఇహ ఎవరూ ఎదిరించేవాళ్ళు లేకపోయేసరికి రెచ్చిపోయాడు బసవయ్య.
"ముందు ఆ పతకం బయటికి తియ్యి."
"లేని పతకం తియ్యమంటే ఎక్కడనుండి తీస్తాను? బాబాల్లాగా నాకు మహిమలు, మంత్రాలు తెలియవు!"
"తెలిసేలా చేస్తానే!" ఆయన చేతిలో బెత్తం పైకి లేచింది. పారిజాత భుజంమీదా, మెడమీదా వాటంగా పడ్డాయి రెండు దెబ్బలు. కణకణలాడే నిప్పులు పడ్డట్టుగా అయ్యాయి పారిజాతకు. కెవ్వుమని పరిగెత్తి మనోహర్ కాళ్లకు చుట్టుకుపోయింది. "మనూ! నువ్వుతప్ప ఆ రాక్షసుడి బారినుండి రక్షించే వాళ్ళెవరూ లేరు. నీకు తెలియదా నేనెలాంటిదాన్నో? నేను దొంగతనం చేస్తానా? ఆవిడ నన్ను పెళ్లి కూతుర్ని చేసి పెట్టిన సొమ్ములివే. లేని పతకం తెచ్చివ్వమంటే ఎక్కడినుండి తెస్తాను?" ఏడవసాగింది.
పారిజాత మెడ వెనుక భాగంమీద ఎర్రగా తేలిన వాతను చూచేసరికి మనోహర్ కి కళ్ళు తిరిగినంత పనయింది. అతడి కళ్ళలో ఎర్రజీరలు చోటు చేసుకున్నాయి మనిషి ఉగ్రుడైపోయాడు. గంభీరంగా ఒక్కో అడుగేస్తూ బసవయ్యను సమీపించాడు. చప్పున అతడి చేతిలోని బెత్తం లాక్కుని ఎడాపెడా వాయించసాగాడు ఆగ్రహంతో. "అక్కడ పెట్టిన కష్టాలు చాలవని అక్కడా నీ దౌర్జన్యం చెలాయించడానికి వచ్చావా? ఎవరూ అడిగే దిక్కులేదని నీ కొండముచ్చు కొడుక్కి ముడిపెట్టాలని అనుకున్నావా? ఊరికే లొంగదని దొంగతనం అంటగట్టి బెదిరించి నీతో తీసుకుపోవాలని ఈ ఎత్తుతో వచ్చావా?"
"తెలియదు బాబూ!" చెంపలు కొట్టుకున్నాడు బసవయ్య. "ఏదో తల్లీతండ్రీ లేని పిల్లని దగ్గరికి తీశాం. మాకేం తెలుసు దానికి కావలసినవాళ్ళే ఉన్నారని, అసలైనవాణ్ణే పట్టిందన్నమాట!" రెండు అర్ధాలతో మాట్లాడసాగాడు బసవయ్య.
"ఏం కూశావురా?" జ్వలిస్తున్న అగ్నిలా కనిపించాడు మనోహర్.
పరిస్థితి విషమించడం గమనించి కోమలమ్మ చప్పున తెప్పరిల్లింది. "మనూ?" కొడుకు చేతిలో బెత్తం లాక్కొని ఆజ్ఞాపూర్వకంగా అంది. "నువ్వు ఇంట్లోకి వెళ్ళు. నేను చూచుకొంటాను ఇతడి సంగతి! తన్నుకొంటే తేలతాయా సమస్యలు?"
మనోహర్ ఒక్క క్షణం తల్లి ముఖంలోకి చూశాడు. అక్కడ ఎటువంటి భావాలు చదువుకొన్నా, పాలపొంగు మీద నీళ్లు చల్లినట్టుగా అతడి ఆగ్రహం చప్పున దిగిపోయింది. గిరుక్కున వెనుదిరిగి తమ ఇంటివైపు నడిచాడు.
"ఊఁ ఇప్పుడు చెప్పండి బసవయ్యా! ఆ పిల్లను మీతో తీసుకుపోయి పెళ్లి చేయాలని వచ్చారా?"
"అవునమ్మా!"
