Previous Page Next Page 
ఏటిలోని కెరటాలు పేజి 35


    "మీ బావగారి ఆరోగ్యం మళ్ళీ చెడిపోయింది. ఆయన గది విడిచి ఏ పనీ చూచుకోలేకపోతున్నారు. ఆయనకు సాయంగా ఒకరుండక తప్పదు. నాకు- ఆడతోడు లేకుండా ఎన్నాళ్ళీ ఒంటరి బ్రతుకు? కొడుకూ కోడలితో ఇల్లు కళకళలాడాలని ఆశించడంలో తప్పులేదు. దానికి యింతకంటే మార్గాంతరం కనిపించలేదు. సూర్యదేవుడూ! అక్కరకురాని కొడుకు. మా మీద అణుమాత్రం ప్రేమాభిమానాలు లేనికొడుకు ఉండీ లేడనుకోవడం దోషం కాదు!"

    "అతడికి లేదుసరే వాడిమీద తల్లివి నీకెలా ప్రేమాభిమానాలు నశించాయి, అక్కా? కొడుక్కు ద్రోహమైన పని కాదూ?"

    "అల్లుడిని వెంటేసుకురాకు నాకు చర్రుమంటుంది. నా మనసు పూర్తిగా విరిచాడు వాడు!

    "ఏమైనా....."

    "నాకు ఇద్దరు కొడుకులు పుట్టారనుకో. ఆస్తి ఒక్కడికే అంట గట్టడం లేదు ఇద్దరికీ సమానహక్కు ఉంటుంది మా ఆస్తిలో.

    అక్కది ముదిరిన తిక్కని కుదర్చడం తరంకాదని తేలిపోవడంతో బావగారి దగ్గరికి వెళ్ళారు సూర్యదేవులు. "మీరెలా అంగీకరించారు బావా?"

    "మీ అక్క సంగతి తెలియందేముంది? తన పట్టే తనది అలాగే కానీ పోయిందేమిటి?"

    భార్గవుడికి అన్యాయం జరిగిపోదూ? ఏనాటికైనా మనసుమార్చుకొని తిరిగివస్తే అతడి గతేమిటి?

    "వాడు యోగి! ఈ సంపద తృణప్రాయం ఇదంతా అనుభవించడంలోకన్నా తిరిపమెత్తుకొని జీవించడంలో బ్రహ్మానందం అనుభవించగలడు. ఆ చింత మనకక్కరలేదు."

    సూర్యదేవుల నోరు కట్టుబడింది. ఏమైనా ఈ దత్తోహమన్నది హాస్యాస్పదంగా కనిపించింది సూర్యదేవులకు. అక్కబావలమీద మనసులో కోపగించుకొని వచ్చి వేశారు. మరి చేసేదిలేక.

    ఈ విషయం నచ్చనివాళ్ళూ విడ్డూరంగా భావిస్తున్న వాళ్ళూ చాలామంది ఉన్నారు. రావుగారి ఎస్టేట్ లో. ముఖ్యంగా గోవిందస్వామి ఎన్నోవిధాల కృష్ణవేణికి నచ్చచెప్ప ప్రయత్నించాడు. ఆయన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

    "చూడవయ్యా, గోవిందస్వామీ! చినబాబుకే ఎలాగో నచ్చచెప్పి తీసుకురాలేవా? అదేమిటో కొడుకుమీద పగపట్టినట్లుంది. ఆ తల్లి ఎవడో అడ్డమైన వెధవను తెచ్చి ఆస్తి అంటగట్టి ఈ యిల్లు పట్టంగడతానంటే ఏమిటో బాధగా ఉందయ్యా నాకు" అన్నాడు వంటబ్రాహ్మడు సుబ్బయ్య.

    అదే బాధ చాలా మందికీ ఉంది.

    చినబాబు అడ్రస్ పట్టుకొని బయల్దేరాడు గోవిందస్వామి. ఆ ప్రయాణంలో మరెందరి ప్రోద్బలమో ఉన్నది. కృష్ణవేణి దంపతులది తప్ప.

    "నాయనా నీకిది ధర్మంకాదు. అమ్మా నాన్నను కష్టపెట్టి సాధించే మోక్షమెక్కడా లేదు. మూర్ఖపు పట్టువద్దు ఇంటికి రా అమ్మా నాన్నను చూసుకో.' ఇటువంటి డైలాగులెన్నో చినబాబుకు చెప్పడానికి దారి పొడువునా మనసులో వల్లించుకొంటూ పోయాడు గోవిందస్వామి. తీరా అక్కడ చేరి వాకబుచేస్తే పదిరోజుల క్రిందటే చినబాబు అక్కడినుండి వెళ్ళిపోయినట్లు తెలిసింది. మరి కొందరిని కలిసాడు గోవిందస్వామి రమణాశ్రమానికో, షిర్టిబాబా ప్రశాంతి నిలయానికో వెళ్ళి ఉంటాడని చెప్పారు ఒకరిద్దరు. ఇదమిధ్ధంగా ఎక్కడికి వెళ్ళింది ఖచ్చితంగా ఎవరు చెప్పలేమన్నారు.

    ఉసూరుమన్నాడు గోవిందస్వామి. 'ఆశ్రమాలపాలయ్యాడు. ఇక ఇంటిముఖం చూచేది కల్ల!' నిస్పృహ చెందిన గోవిందస్వామి తిరిగి ఇంటిముఖం పట్టాడు.
   


                                    14



    "నీ పిల్లను నా కొడుక్కు ఇచ్చేవాడివా, కాదా? అది చెప్పు తక్కిన సంగతులే నా కొద్దు."

    "పిల్ల నిమ్మంటున్నావు అక్కా! అన్నిసంగతులు అడగందే ఇవ్వడమెలా అవుతుంది? కొడుకు ఒకడుండగా మరెవణ్ణో దత్తు తీసుకొన్నావు. అతడికి నా పిల్ల నిమ్మంటున్నావు. అతడిని నీ కొడుకుగా ఎలా భావించగలుగుతున్నావో నాకు తెలియదు. నాకు మాత్రం అల్లుడిగా భావించడానికి మనసొప్పడంలేదు ఆ విపరీతాన్ని నేను సహజంగా తీసుకోలేకపోతున్నాను. అందుకే దత్తోహానికి పిలిచినా ఈ ఇంటినుండి ఎవరు రాలేదు.

    ఇప్పుడు దత్తపుత్రునిద్వారా పుట్టింటితో వియ్యమందాలనుకొంటున్నావు భార్గవుడికైతే దేవతను సంతోషంగా ఇచ్చేవాళ్ళం అందరూ సంతోషించేవాళ్ళు. ఇప్పుడు మాత్రం దీనికి నేనంగీకరించలేను. నీ మరదలుకూడా అంగీకరించదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS