Previous Page Next Page 
అగ్ని కెరటాలు పేజి 35

   
    తెల తెల వారుతుంటే ఇలా కునుకు పట్టిందో లేదో ఎదురింట్లో పనిచేసే లక్ష్మి గొంతు పెద్దగా వినిపించింది.

    "పసిబిడ్డతల్లి అని కూడా చూడకుండా చంపేశాడు కదమ్మా దుర్మార్గుడు."

     "ఏమంటున్నావే లక్ష్మీ? ప్రమీలను నిజంగా చంపేశాడా?" హేమలత వణుకుతున్న స్వరంతో అడిగింది.
 
    "అవునమ్మా! చంపి తగలబెట్టాడో బ్రతికుండగానే తగలబెట్టాడోగాని ప్రమీలమ్మకాలి  చచ్చిపోయిందమ్మా! ఆయమ్మే కాల్చుకు చచ్చిపోయిందని చెబుతున్నాడు ఆ పాపిష్టి చచ్చినోడు."

    హరిత దిగ్గున లేచి పరిగెత్తింది. లక్ష్మి దగ్గరికి.  ఆ వార్త నిజమేనని తెలిశాక, ఆవేశంగా తల్లి భుజాలు పట్టి వూపుతూ "ప్రమీలను హత్య చేయడంలో నువ్వూ పాలు పంచుకొన్నావు. ఈ హత్యలో నీకూ భాగముంది మమ్మీ" అంది.

    హేమలత ప్రమీల మరణవార్త విని స్థాణువై నిలబడి వుంది. కూతురు అంత మాట అన్నా కిక్కురు మనలేదు. ఆ మాట నిజమే! రాత్రి ప్రమీలను రక్షించి తీసుకువస్తానంది హరిత. తను అడ్డుపడకపోయివుంటే ప్రమీల బ్రతికి వుండేది కదా? వాడు పెళ్లాన్నే చంపుకొనేంత దుర్మార్గుడని అనుకోలేదు. ఎంత పనిజరిగిపోయింది. రాత్రి హరితకి అడ్డు పడి ఈ హత్యలో భాగం పంచుకొన్నట్లే అయింది కదా.

    తప్పుచేసిన దానిలా తలొంచుకునిలబడిన తల్లిని వదిలేసి ప్రక్కింటికేసి పరుగు తీసింది హరిత.

    ప్రమీల శవం గొంగళిలో చుట్టబెట్టి ముందుగదిలోనే పడుకోబెట్టివుంది. లక్ష్మీకాంతం లేడు. అతడు పోస్టాఫీసుకో, ఎక్కడికో వెళ్లినట్టు తెలిసింది. ప్రమీల పాప ఉయ్యాల్లో గుక్కుబెట్టి ఏడుస్తూంది. ఇల్లంతా శవం కాలినవాసన చుట్టు కొని వుంది.

    ఇరుగు పొరుగు భయం భయంగా ఇంటి ముందు నిలబడి తొంగి చూస్తున్నారు కాని లోపలికి రావడంలేదు.

    హరిత బయటికి వచ్చి "నేను పోలీసులకి ఫోన్ చేస్తున్నాను. పోలీసులువచ్చి అడిగితే రాత్రి జరిగింది, మీరు విన్నది, చూసింది చెప్పండి." అంది అక్కడ నిలబడిన వాళ్లతో.

    "ఏం చెబితే ఏం లాభం ఇప్పుడు? పోయిన మనిషేం రాదు. పోలీసుల ముందు ఏమైనా నోరు మెదిపామంటే సాక్ష్యమని అదని ఇదని పోలీసుస్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ త్రిప్పుతారు. ఎందుకొచ్చిన గొడవ, బాబూ!" అన్నారు వాళ్లు.

    "ఇంత అనుమానుషంగా మీ చెల్లో, మీ కూతురో హత్య చేయబడితే, ఎందుకొచ్చిన గొడవ, బాబూ అని ఇంత తేలిగ్గా అనేయగలరా? మీ హృదయం  ప్రతీకారంతో రగులుకోదా? ఈ పురుషాహంకారానికి , ఈ దుర్మార్గానికి సరైన పాఠం చెప్పకపోతే రేపు మీ చెల్లి బలి అవుతుంది. మీ కూతురు బలి అవుతుంది. దయచేసి రండి ముందుకు  ఈ దుర్మార్గానికి అడ్డుకట్ట వేద్దాం?" హరిత ఎం ఉద్విగ్న పూరితంగా మాట్లాడినా దున్న పోతు మీద వర్షం పడ్డట్టుగా వాళ్లలో చలనం కనిపించలేదు.

    "చుట్టూ ఇంతమందిమి వుండి ప్రమీలను చంపేస్తుంటే చూశాం. మర్యాదస్తులైన కుటుంబీకులం కదా? మన ప్రక్కింట్లో ఒక అమాయకురాలైన స్త్రీ దెబ్బతిని, కాల్చి చంపబడుతున్నా జోక్యం చేసుకోలేనంత మర్యాదస్తులం.  ఇదండీ మన సమాజ చైతన్యం. ఇదండీ మన సాంఘిక బాధ్యత" విరక్తిగా నవ్వింది హరిత.

    హరిత ఇంటికి వచ్చి పోలీసులకి ఫోన్ చేయబోతుంటే తండ్రి వచ్చి చెయ్యిపట్టుకొన్నాడు.
 
    "వద్దమ్మా! పోలీసులకి ఫోన్ చేయొద్దు?"

    "డాడీ!" నిర్విణ్నురాలై చూసింది హరిత.

    "అవునమ్మా! నువ్వు లేనిపోని వ్యవహారాల్లో తల దూర్చడం నా కిష్టంలేదు. పోలీసు వ్యవహారాల్లో చిక్కుకోవడం అసలిష్టంలేదు. ప్రతిదానికి నిన్నే పిలిచి అడుగుతారు. నీ చదువు మీద ఏకాగ్రత చెడిపోతుంది. ఇందులో తలదూర్చాక లేనిపోని చిక్కులు తలకు చుట్టుకొంటాయి."

    "సమాజంలో ఒక మనిషిగా ఇదేనా మనబాధ్యత?" హరిత నిస్సహాయంగా చూసింది.

    "సమాజంలో అందరూ ఎవరి బాధ్యతలు వాళ్లు నిర్వహిస్తే మనమూ మన బాధ్యత నిర్వహించవచ్చు! మనం మాత్రమే నిర్వహించాలంటే  ఊరంతా ఒకదారి, ఉలిపికట్టె దొకదారి అన్నట్టుగా అవుతుంది."

    ప్రమీల మరణం వల్ల హృదయం ఎంత మరిగిపోతున్నా తండ్రిని కాదని తనేమీ చేయలేననిపించింది హరితకు.
 
    "డాడీ! ఎన్నో డిబేట్స్ లో స్త్రీలకు జరిగే అన్యాయాల గురించి బల్ల గుద్ది వాదించి, గొంతుచించుకు అరిచి బహుమతులెన్నో తెచ్చుకొన్నాను. నా బహుమతులు చూసి మురిసిపోయేమీరు, నా కూతురని గర్వంగా చెప్పుకొనే మీరు మీ కూతురు ఒకమంచి పని , తన ఉపన్యాసాల్లో చెప్పిందే చేస్తానంటే వద్దని వెనక్కి లాగుతున్నారు. కేవలం నావి శుష్క ఉపన్యాసాలు అన్నట్టు చేశారు. ఆదర్శవంతుడైన తండ్రిగా చెప్పుకొనే అవకాశం నాకు మీరు కలుగజేయరన్న మాట!" హతాశురాలైంది హరిత.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS