ఇంతలో వీధి తలుపు చప్పుడయింది. 'ఎవరా' అని వెళ్ళి చూశాను.
కృష్ణశాస్త్రి గురించి శ్రీశ్రీ
కంపెనీ కారు వచ్చింది.
"రేపు ఉదయం దీపక్ గారు డైరెక్టు చేస్తున్న పిక్చర్ కి గోల్డెన్ స్టూడియోలో పూజ జరుగుతుంది. మిమ్మల్ని తప్పకుండా రమ్మన్నారు. కృష్ణశాస్త్రిగారు కూడా వస్తున్నా"రని చెప్పి మేనేజర్ వెళ్ళిపోయాడు.
"వెళదామా" అన్నారు శ్రీశ్రీగారు.
కృష్ణశాస్త్రిగారిని చాలాసార్లు చూశాను. వారితో బాగా పరిచయం కూడా వుంది. "మనం పూజకి ఎందుకండి. మీరు పాటరాయలేదుగా" అన్నాను. "రాయకపోవటం ఏమిటి సరోజా. ఎప్పుడో రాసేశాను. కృష్ణశాస్త్రిగారు వస్తున్నారంటే వారు కూడా రాసివుండాలి. ఏపాట రికార్డింగో తెలీదు" అన్నారు.
"అయితే నేనూ వస్తాను. కృష్ణశాస్త్రిగారిని మరోసారి చూడొచ్చు" అన్నాను.
మర్నాడు తొమ్మిదిన్నరకి మేమిద్దరం మా అబ్బాయీ బైజుని మా పెద్దావిడ దగ్గర వదిలేసి స్టూడియోకి వెళ్ళాం. మేం వెళ్ళేసరికి అందరూ వచ్చేశారు. నేను తిన్నగా కృష్ణశాస్త్రిగారి దగ్గరికివెళ్ళి నమస్కారం చేశాను. 'బాగున్నారా' అన్నట్లు సౌంజ్ఞచేస్తూ కుర్చీ చూపించేరు.
రికార్డింగ్ ప్రారంభమైంది. ఎవరిపాట ముందు తియ్యాలనే సమస్య.
"నీపాట ముందని శాస్త్రిగారంటే మీపాట ముందు కానివ్వండని మావారు" చివరికి ఎవరిపాట ముందయినా రెండోవారి పాట అయితే కాని వున్న చోటనుండి కదలడానికి వీలులేదని శాస్త్రిగారు కాగితంమీద రాసి శ్రీశ్రీగారికిచ్చేరు. అది చదవమని మావారు నాచేతికిచ్చారు. 'ఎవరు కదిలినా మీపాట అయితేకాని నేను మాత్రం కదలనని' రాశాను.
'వెరీ గుడ్. మంచిపిల్లవి. అందుకే నువ్వంటే నాకిష్టం' అని రాసి ఆ కాగితం కృష్ణశాస్త్రిగారు నాచేతికిచ్చారు.
రెండుపాటలు పూర్తయి మేం బయటపడేసరికి దగ్గర దగ్గర మూడుగంటలయింది. అందరం శాస్త్రిగారి కారుదగ్గరికి చేరుకున్నాం.
కృష్ణశాస్త్రిగారు నన్ను చూసి 'ఆకలేస్తుందా' అని కాగితంమీద రాసేరు. నేను వెంటనే వారి చేతిలోవున్న కాగితంమీద 'ఆకలి వేయడానికి నేనేమైనా చిన్నపిల్లనా' అని రాశాను.
'మీ ఉభయుల్ని మా ఇంటికి రమ్మని ఎన్నాళ్ళుగానో పిలుస్తున్నాను. వస్తానని నన్ను మోసగిస్తున్నావు. ఈసారి తప్పకుండా రావాలి.
లేకుంటే నాకు కోపం వస్తుంది' అని రాసి నాకు చూపించేరు. అలాగే అని తలూపాను.
'శ్రీశ్రీ! అమ్మాయిని తీసుకుని మా ఇంటికి రాకూడదా. పదండి. ఇప్పుడే వెళదాం' అని రాసి కాగితం శ్రీశ్రీగారికి ఇచ్చారు.
కృష్ణశాస్త్రిగారి చేతిలో ఓ చిన్నసైజు కాగితాల పుస్తకం, పెన్నూ ఉన్నాయి.
'ఇంకోసారి తప్పకుండా వస్తాం. ఇప్పుడుకాదు క్షమించం'డని రాయడం ఈసారి నా వంతయింది.
శాస్త్రిగారిని ముందు కారులో పంపించి తర్వాత మేం బయల్దేరాం.
"కృష్ణశాస్త్రిగారు మంచి కవి కదండీ" అన్నాను.
నాకు కృష్ణశాస్త్రిగారి పుస్తకాలతో అట్టే పరిచయంలేదు, పేరు వినడమే. శ్రీశ్రీగారి దగ్గరకు వచ్చాకే నాకు పుస్తకాలతో పరిచయం ఏర్పడింది. "ఆయన మంచి కవి అని నువ్వెలా చెప్పగలుగుతున్నావు" అని అడిగారు.
"మల్లీశ్వరిలో పాటలు ఎంతబాగా రాసేరండీ" అన్నాను.
"ఓహో సినిమాపాటలు విని అంటున్నావా" అని అడిగారు.
"మరి వారి రచనలతో నాకు పరిచయం లేదండీ" అన్నాను.
నా సిన్సియారిటీకి మావారు నన్ను ఆ క్షణంలో నన్ను మెచ్చుకోకుండా వుండలేకపోయారు.
"ఏమండీ. మీకు కృష్ణశాస్త్రిగారంటే ఇష్టమేనా" అనడిగాను.
"ఇష్టంవేరు, గౌరవాభిమానాలు వేరు. ఆరోజుల్లో కలంపట్టిన ప్రతి కవీ కృష్ణశాస్త్రిగారి ఆకర్షణకు లోనయినవాడే. నా చిన్నతనంలో నామీద రెండు ప్రభావాలు బలవత్తరంగా పనిచేసేవి. ఒకటి కృష్ణశాస్త్రిగారి ప్రభావం రెండు రెండు విశ్వనాథంగారు.
ఆంధ్రదేశం అంతటా కృష్ణశాస్త్రిగారి రేడియో ధార్మికశక్తి ప్రసరించింది. ఈనాటి యువతరంమీద సినిమా తారల ప్రభావం ఎంతవుంటుందో ఆరోజుల్లో మాలాటి వాళ్ళమీద కృష్ణశాస్త్రిగారి సమ్మోహనశక్తి అంతగానో. మరింతగానో వుండేది. దాదాపు 50 సంవత్సరాలుగా వారితో నాకు పరిచయం వుంది. కృష్ణశాస్త్రిగారికి నేనంటే విపరీతమైన ఇష్టం. ముసల్ది కొత్తగా కాపురానికి వచ్చిన రోజులవి. శాస్త్రిగారు విశాఖపట్నం వచ్చారు. నేను ఇల్లూ వాకిలీ వదిలేసి వారితోపాటు తిరగడమేకాకుండా ఆయనతోపాటు విజయనగరం కూడా వెళ్ళాను.
అలా ఒక వారంరోజులు ఇంటిముఖం చూడలేదు. ఇంటికివచ్చాక'కవుల్ని కవిత్వాన్ని మెచ్చుకోవడం బాగుంది కాని ఇంట్లోవున్న పెళ్ళాం గురించి కొంచెం ఆలోచించడం కూడా మంచిదేమో'నని మా నాన్నగారు మెత్తగా చీవాట్లు పెట్టారు.
మా నాన్నగారు నన్నెప్పుడూ గట్టిగా కోప్పడరు. ఆ మాత్రం చీవాట్లకే నా మనస్సెంతో చివుక్కుమంది. ఏదో మైకం నుండి తేరుకున్న వాడిలా అనిపించింది"
కృష్ణశాస్త్రిగారి పర్సనాల్టీ ఆనాటి యువకుల్ని అలా ఆకర్షించేది. (కృష్ణశాస్త్రిగారితో నా మొదటి పరిచయం 1928లో అయిందని వారు చెప్పినట్లు నాకు జ్ఞాపకం)