అని అనుకున్నది కావేరి...
మరో అరగంట అలాగే ఆలోచనలతో గడిపింది.
మరలా తలుపు తట్టిన చప్పుడయింది.
మాధవరావు వచ్చాడేమోనని త్వరగా వెళ్ళి తలుపు తెరిచిన కావేరీకి నిరాశే ఎదురయింది.
ఈసారి తలుపు తట్టినది మరో సర్వర్!
అతడిని చూడగానే కోపం వచ్చింది.
"మీకు భోజనం తీసుకురమ్మంటారా?"
ఆ మాటతో అగ్గిమీద గుగ్గిలం అయిపోయింది కావేరి.
"భోజనం! భోజనం! నాకు ఆకలి వేస్తే నేను అడగనా? వెళ్ళండి అవతలకి!"
అంటూ భళ్ళున తలుపులు మూసి వచ్చి మంచంమీద వాలిపోయింది....యింకా కోపం తగ్గలేదు కావేరికి.
అదే కారణం!...మాధవరావు వెళ్ళటం చూశారు. భోజనం నెపంతో యిలా వచ్చి తనను వేధించుతున్నారని, యిక్కడ వంటరిగా వుంటే ఇలాగే అడపా తడపా వచ్చి తలుపులు తట్టి పిలుస్తారని, ఇక్కడ వుండకుండా యింకెక్కడయినా మంచి హోటల్లో వుండాలని అనుకుంది.
మాధవరావు తనకన్నీ చెప్పాడు. యిక్కడ వంటరి ఆడపిల్ల కనిపించితే ఎలా వలలో వేసుకోవాలో కూడా చూస్తారని చెప్పింది నిజమే! తను ఆలస్యంగా వస్తానని చెప్పాడు తనకోసం ఎదురు చూడకుండా భోజనం చేసి పడుకోమని మరీ మరీ చెప్పాడు.
"భోజనం తీసుకురమ్మంటారా?"
అని అడగడానికి వచ్చిన వారిని తరిమికొట్టింది.
తనెందుకలా చేసిందో అర్ధం కాలేదు.
"మాధవరావు ఎంత త్వరగా వస్తే అంత బాగుండును!" అని అనుకోసాగింది. అలా ఆలోచించుతూనే తిరిగి నిద్రలోకి జారిపోయింది కావేరి.
తిరిగి మెలుకువ వచ్చేసరికి గదిలో చీకట్లు ఆవరించాయి.
"ఇదేమిటి...?"
అని అనుకుంది. టైం ఎంతయిందో చూసేందుకు తన చేతికి గడియారం అన్నా లేదు. ఎలా? అనుకుంటూనే మంచం దిగి కిటికీ తలుపులు తెరిచి బైటికి చూసింది.
బజారు లైట్లన్నీ వెలుగుతున్నాయి. షాపులు తెరిచి వున్నాయి. జనం అటూ యిటు హడావిడిగా తిరుగుతున్నారు. అంటే యిప్పుడు రాత్రి అయిందన్నమాట! తను ఎంతగా నిద్రపోయింది? తను మధ్యాహ్నం భోజనం చేయలేదన్నది అప్పుడు గుర్తు వచ్చింది.
"భోజనం కావాలని"
ఎవరిని అడగాలో అర్ధం కాలేదు...మాధవరావు యింకా రానందుకు బాధపడింది. తనను తీసుకొచ్చి ఈ గదిలో వుంచి వెళ్ళిపోయాడు. తను యింతవరకూ పత్తాలేడు. తనేమయి పోతాననుకున్నాడు? తను కనిపించకపోతే తన తిప్పలేవో తను పడేది! యిప్పుడు చూడు ఏమయిందో? అనుకుంది కోపంగా!
తలుపుమీద టకటక కొట్టిన చప్పుడు వినిపించింది కావేరీకి.
తియ్యాలా? వద్దా? అని ఆలోచించసాగింది.
మరలా హోటల్ సర్వర్సు అయివుంటారు! తియ్యకూడదు! అని తీర్మానించుకుంది.
ఈసారి యింకా బలంగా కొట్టుతున్న చప్పుడవటంతో-
"ఒకవేళ మాధవరావేమో? ఈవేళ అయినా రాకుండా ఎలా వుంటాడు అందుకే అంత గట్టిగా కొడుతున్నాడు!"
అని అనుకుని గబగబా వచ్చి తలుపులు తెరిచింది కావేరి! తను ఊహించినట్టు మాధవరావు కాదు!....
ఎవరో? తనసలు చూడనే లేదు అతడిని! తెల్లని సిల్కు లాల్చీ, అదే లుంగీ కట్టుకుని నుదుట మూడుచారల విభూతి పెట్టుకుని, చెవులకి బంగారు కుండలాలు పెట్టుకుని తీక్షణమయిన చూపులతో తననే చూస్తున్న ఆ నలభై సంవత్సరాల వ్యక్తిని చూసేసరికి నోటమాట రాలేదు కావేరీకి.
"ఎవరివమ్మా నువ్వు?" ఆ వ్యక్తి తీక్షణంగా కావేరీని చూస్తూనే మృదువుగా అడిగాడు.
"నేను! నేను కావేరినండీ?.." అతని వెనుక నిలబడిన సర్వర్ ని చూస్తూ జవాబు యిచ్చింది.
"ఎందుకు వచ్చావు? ఎక్కడనుంచి వచ్చావు? నువ్వు ఒక్కదానివేనా? నీ భర్త కూడా వచ్చాడా?"
"ఆఁ...వచ్చారండీ?..." తడుముకోకుండా జవాబు యిచ్చింది.
"ఏడి అతను?..." గది లోపలికి చూస్తూ అడిగాడు.
"పనివుండి బైటికి వెళ్ళారు..."
"అతను నీ భర్తేనా?...లేక?" కావేరీనే పరిశీలనగా చూస్తూ అడిగాడతను.
"ఇంతకీ మీరు ఎవరు?" మాధవరావు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని కావాలనే కోపం ప్రదర్శించింది.
"నేను ఈ హోటల్ కి మేనేజరుని! ఉదయంనుంచీ తలుపులు తెరవలేదని మా సర్వరు చేసిన ఫిర్యాధుని పురస్కరించుకుని వచ్చాను!"
అప్పటికే పక్క రూముల్లోని వాళ్ళు ఈ వింత చూస్తూ నిలబడిపోయారు. రూముల్లోనే వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు మేనేజరు ఒక అమ్మాయితో ఘర్షణపడటం ఏమిటని? చూస్తూ వెళుతున్నారు.
ఇలా అందరూ తననే వింతగా చూస్తూ వుండటంతో కావేరీకి భయం కలిగింది. ఆ భయంతో తడబాటుకూడా వచ్చేసింది. తనను ఎవరయినా గుర్తుపట్టే వాళ్ళుంటే ప్రమాదంగా భావించింది. ఆ సంభాషణను ఎలా తప్పించాలా? అని ఆలోచించుతోంది.
"ఇప్పుడు చెప్పు!" అన్నాడు మేనేజరు.
"వారు వచ్చిన తరువతః మాట్లాడుతారులెండి....యింక మీరు వెళ్ళి రావచ్చును." అంది తెచ్చిపెట్టుకున్న కోపంతో!
ఆ అమ్మాయినుంచి అలాంటి జవాబు వస్తుందని ఎదురుచూడని మేనేజరుకి కోపం వచ్చింది. అయినా తమాయించుకున్నాడు. కారణం!
ఆ అమ్మాయి న్యూసెన్సు కంప్లయింట్ పోలీసులకి యిచ్చినదంటే తన హోటల్ కే పెద్ద ప్రమాదం! అందువలన తగ్గి అన్నాడు.
"నీ భర్తరాగానే కౌంటర్ దగ్గిరకు రమ్మనమని చెప్పు. అతనితో మాట్లాడాలి!" అంటూ సర్వర్స్ తో కలిసి వెళ్ళిపోయాడు.
"హమ్మయ్యా!"
అనుకుంటూ గుండెలమీద చేతులుంచుకోబోయి ఆగిపోయి ఆ చేతులలోనే తలుపులు మూసి వచ్చి కుర్చీలో కూలబడిపోయింది కావేరి.
