మా ఊళ్ళో ఒక రిటైర్డ్ తాసిల్దార్ ఉండేవాడు. అతడు మద్రాసులో బ్రిటిష్ టైంలో పనిచేశాడు. ఆయన కూతురు కృష్ణ బాగా చదువుకుంది. లోకం తెలిసిన పిల్ల కావటాన మమ్మల్ని బాగా అర్థం చేసుకుంది.
అప్పుడప్పుడూ మమ్మల్ని ఇద్దర్నీ పిలిపించి మీరు భయపడనక్కర్లేదని ప్రోత్సహించేది.
చివరకు మా ప్రేమ రెండు వర్గాల మధ్య కొట్లాటగా రూపుదాల్చే అవకాశాలు ఏర్పడ్డాయి. మావల్ల ఇటువంటి గొడవలు జరగటం నాకు సుతరామూ ఇష్టంలేదు. కృష్ణను కలిసి మాట్లాడాను.
'వర్మా మీరిద్దరూ వెంటనే పెళ్ళి చేసుకోండి' చెప్పిందామె.
'అది సాధ్యపడే విషయమేనా?' నా ప్రశ్న నాకే అసహ్యమనిపించింది. నేను పిరికిపందనని నాకే తెలిసింది.
'వర్మా! మరి ఆపిల్లనెందుకు రోజూ కలుస్తావు?'
'ఆమెను చూడకుండా నేను జీవించలేననిపిస్తున్నది.'
'అందుకే నీవామెను పెళ్ళాడాలి. ఆడపిల్లకు ఆశలు కల్పించావు, ఇప్పుడు పిరికిపందలా పారిపోతావా? నీకు సిగ్గులేదూ! చదువుకున్నదెందుకు? ఇప్పుడు నువ్వామెను పెళ్ళాడకపోతే ఏమి జరుగుతుందో తెలుసా! నువ్వు అగ్రజన్మ ఎత్తాననే అహంకారంతో ప్రాణాలు బలిపెట్టబోయి ప్రాణాలతో చెలగాటమాడటం నీవంటి విద్యావంతులు చెయ్యకూడని పని, పెళ్ళి చేసుకుని బ్రతకటమే గొప్పతనం. ఈ ఊళ్ళో అలా వుండగలగటం అసాధ్యమనిపిస్తే ఎటైనా వెళ్ళి స్వతంత్రంగా బ్రతకండి' మందలించింది కృష్ణ.
నా కంటిమీద పొరలు తెగిపోయాయి. వెంటనే ఆమెను పెళ్ళిచేసుకుని ఆ ఊరు విడిచాను.
ఆమె నన్ను ఎంతగా ప్రేమించిందంటే, నాకోసం మొత్తం మానవ ప్రపంచాన్ని త్యాగం చేసి ఈ కొండవీడు మీదికొచ్చింది. ఇక్కడే కాపురం పెట్టాము. కొన్నాళ్ళు ఎలాగో బ్రతికాం.
"తరువాత ఏమైందో చెప్పండి త్వరగా" ఆదుర్దాగా ప్రశ్నించాను.
"చెప్తాను బాబూ! ఆ తరువాతనే జీవితమంటే ఏమిటో నాకు తెలిసింది. కొన్నాళ్ళు కష్టపడి జీవించాం. పొట్టపోసుకోవటానికి కాయకష్టాన్ని ఆశ్రయించాం. అయినా బాధనిపించలేదు. కాని, అది ఎన్నాళ్ళో సాగలేదు. నేను కట్టెలమ్మేందుకు గ్రామాల్లో తిరిగేవాడిని. అప్పుడప్పుడూ పేపరు దొరికితే చదివేవాడిని. దేశం విప్లవజ్వాలల్లో అట్టుడికిపోతున్నది. ఎందరో మహామహులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు.
ఇదంతా చూస్తూ ఏమీ పట్టనట్లు ఊరుకోవటం మోసమనిపించింది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ప్రాణాలను తృణప్రాయంగా భావించి స్వాతంత్ర్యోద్యమంలో దూకుతున్నారు.
ఓ రోజు అలా అలా బేరాలు చూచుకుంటూ రైలు స్టేషన్ వైపు వెళ్ళాను. స్టేషన్ మొత్తం చాలా హడావుడిగా ఉంది. జనం గుంపులు గుంపులు వచ్చి చేరుతున్నారు. అక్కడ స్వాతంత్ర్య సమరోత్సాహం వెల్లివిరుస్తున్నది. నేనేమి చేస్తున్నానో నాకే తెలియకుండా ఆ సంరంభంలో కలిసిపోయాను.
కొంతసేపటికి పొగలు క్రక్కుతూ రైలొచ్చింది. ఆ రైల్లో పూజ బాపూజీ వున్నారట! దక్షిణాదిన సభల్లో ప్రసంగించి వస్తున్నారాయన. రైలును స్టేషన్ లో బలవంతంగా ఆపు చేయించారు. బాపూజీ బోగీ మీద వాకిట్లో నిలిచి చిరునవ్వులు చిందిస్తూ నిలచి వున్నారు. ప్లాటుఫారం మీది జనం మీద సమ్మోహనాస్త్రం వేసినట్లయింది. మహోత్సాహంతో జేజేలు పలుకుతూ రైలు మీద విరుచుకుపడ్డారు. బోగీల లోపలా, బోగీల మీదా జనం ఎక్కేశారు. అడ్డగించేవారు లేరు. నేను వారితో కలిసి కొట్టుకుపోయాను. నాకు వెనుకకు తిరిగి ఆలోచించే అవకాశం వచ్చేసరికి నేను కొండవీటికి చాలా దూరంలో వున్నాను. నాకూ వెనుకకు పోవాలనిపించలేదు.
రైలు బొంబాయిలో ఆగింది. అన్నం నీళ్ళూ లేవు.
బొంబాయిలో బిల బిలమంటూ జనం దిగిపోయారు.గాంధీజీ కూడా ఏదో సభలో ఉపన్యసించటానికి వెళ్ళిపోయారు. ఆ సంరంభంలో ఎవరూ పట్టించుకోలేదు కనుక రైలు స్టేషన్ లో నుండి బైటపడ్డాను. కాని నా పని బంగాళాఖాతం నుండి లేచి అరేబియా సముద్రంలో పడ్డట్లయింది.
నాకు ఇంగ్లీషు రాదు కదా! బజార్ల వెంట తిరుగుతూ పార్కుల్లో విశ్రాంతి తీసుకుంటూ మూడు రోజులు తిరిగాను. ముంచాదేవి దేవాలయం వద్ద అర్చకులతో సంస్కృతంలో మాట్లాడి నా కథ చెప్పాలని ప్రయత్నించాను. ఫలితం శూన్యమే. అక్కడ వారికి మంత్రాలు గుక్కపట్టి వప్పగించటమే తెలుసు. కాని సంస్కృతం రాదు.
తరువాత మహాలక్ష్మి టెంపుల్ చూచాను. అక్కడా ఇంతే? మలబార్ హిల్స్ చూశాను. అక్కడే ఒక పర్ణశాల వేసుకుని జీవితాంతమూ ఉండిపోవాలనిపించింది. వీధి వీధికీ కనిపించే శివాజీ విగ్రహాలు మనసులో విప్లవాన్ని రేపుతున్నాయి. ఒకచోట నిలువనీయటం లేదు.
