Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 35


    సాహితీ! ప్లీజ్! ఆగు! నేను చెప్పేది విను" సమ్రాట్ ప్రాధేయపూర్వకంగా అన్నాడు.
    సాహితి క్షణం ఆగి, ఏమిటన్నట్టు చూసింది.
    "మనం వెంటనే పెళ్ళి చేసుకుందామా సాహితీ!"
    అతని మాటల్లో ఆరాటం, చూపుల్లో ప్రేమానురాగాలు తొణికిసలాడాయి.
    "నాకిష్టం లేకపోతే ఏం చేస్తారు?" ఉడికిస్తూ అంది.
    "నీ ప్రేమకరవైన తరువాత నాకీ జీవితం ఎందుకు? జీవచ్చవంలా బతికేకన్నా...." అతని మాటలు పూర్తికాకుండానే పరుగున వచ్చి, అతని పెదాలు మూసింది.
    "అంతమాట అనకండి! జీవితంలో నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకుంటాను." అతని చేతిలో చేయి వేసింది.
    "థాంక్యూ సాహితీ!" ఆమె చేతిపై ముద్దు పెట్టుకున్నాడు.
    "ఎన్ని అవాంతరాలు ఎదురైనా మనం పెళ్ళి చేసుకుందాం. గుళ్ళో పెళ్ళికి ఏర్పాట్లు చేయండి" అంది.
    "థాంక్యూ వెరీమచ్!" అతని కళ్ళలో ఆనందభాష్పాలు!
    అతని మనసు తేలికపడింది.
    పరోక్షంగా అనూష చేసిన సహాయానికి ఆమెకు మనసులోనే కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు.
    "సాహితీ! నేను అన్ని ఏర్పాట్లూ చేసి, అనూషను నీ దగ్గరకు పంపుతాను. వెంటనే బయలుదేరి వచ్చేద్దువు గాని."
    "అలాగే!" అంటూ సాహితి వెళ్ళిపోయింది.
    పెళ్ళికి ఏ గుళ్లో ఏర్పాట్లు చేయాలో ఆలోచించాడు సమ్రాట్.


                                              *    *    *    *


    ఇన్ స్పెక్టర్ వీరేష్ తను వేసిన పథకం బెడిసికొడుతుందని ఎప్పుడూ అనుకోలేదు.
    అనూష, తన శ్రీమతి అరుణ క్లాస్ మేట్స్ అని ముందుగా తెలియకపోవడం వలన తన పథకం నీరుకారిపోయింది. తను నవ్వులపాలయ్యాడు.
    ఫోన్ మోగడంతో ఆలోచనల్లోంచి తేరుకుని రిసీవర్ ఎత్తాడు వీరేష్.
    "సారీ! నేను ఆరోజు మీకు ఖచ్చితంగా చెప్పాను. సివిల్ కేసులలోకి మమ్మల్ని లాగవద్దని మరోసారి చెబుతున్నాను. ఇంకెప్పుడూ నా సహనాన్ని పరీక్షించవద్దు!" విసుక్కున్నాడు వీరేష్.
    "సారీ ఇన్ స్పెక్టర్! ఆరోజు నా ప్రవర్తనకు నామీద నాకే అసహ్యం వేసింది. ఇంకెప్పుడూ అలా జరగదు. దయచేసి నాకో సహాయం చేసిపెట్టండి!" శ్రీపతి ఫోనులో ప్రాధేయపడుతున్నాడు.
    అతని మాటలలో ఆవేదన ఉంది. అతను మళ్ళీ తననుంచి ఏం సహాయం ఆశించనున్నాడో తెలుసుకోవడం వల్ల నష్టమేమీ లేదు. సహాయం చేయగలిగిందయితే చేయవచ్చు. లేదా కాదనవచ్చు ననుకున్నాడు వీరేష్.
    "ఆల్ రైట్, చెప్పండి!"
    "ఇన్ స్పెక్టర్! మా అనూష, మీ శ్రీమతిగారు క్లాస్ మేట్స్ అని తెలిసింది. ఒకసారి వారితో ప్రయత్నిస్తే అనూష మనసు మారుతుందని నా ఆశ. దాని సంతోషం కోసం నేను ఏదైనా చేస్తానని, నాతో ఒక్కసారి మాట్లాడదామని దానికి నచ్చచెపితే చాలు, మీ భార్యాభర్తలకు నేనెంతో రుణపడి ఉంటాను!" శ్రీపతి గొంతు బొంగురుపోయింది.
    "అలానే ప్రయత్నిస్తాను!" అతని బాధను అర్థం చేసుకున్నట్టున్నాడు వీరేష్.
    సురేఖ, గౌతమి, కళ్యాణి కేసుల గురించి పేపర్లలో రోజురోజుకూ చిలవలు పలవలుగా రాస్తున్నారు.
    ఈ కేసులలో పోలీసు దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా ఉంది.
    మహిళా సంఘాలు ధర్నాలు, పికెటింగ్ లు జరుపుతున్నాయి. కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు సమ్మె చేస్తున్నారు.
    పోలీసు దర్యాప్తుపై నమ్మకం లేనట్టు అభియోగం లేవనెత్తారు.
    వాళ్ళు అలజడి చేస్తున్నారని ఆవేశపడటం మాట అలా ఉంచి, తను తన వృత్తిలో ఎంతవరకు కృతకృత్యుడయ్యాడు? ఈ కేసులలో మిస్టరీని తాను వెలుగులోకి తేగలడా?
    ఆలోచిస్తే ప్రజలు చేస్తున్న గోల న్యాయమేననిపిస్తున్నది. తను ఈ కేసుల దర్యాప్తుకు ఒక సవాలుగా తీసుకున్నాడు.
    రాష్ట్రంలోనే కలవరం పుట్టించిన ఈ కేసుల్లోని నిజానిజాలు బయటపెట్టగలిగితే నేరస్తుల ఆట కట్టించడమేకాక, ప్రజలలో ప్రతిష్ఠ పెరగడంతోపాటు డిపార్టుమెంటులో విశిష్ఠ స్థానమూ లభిస్తుంది.
    అయితే దర్యాప్తులో అన్నీ అవరోధాలే ఎదురవుతున్నాయి. నేరస్తునికి ఉన్న అవకాశాలు, ఒక విధంగా దర్యాప్తుకు ఆటంకాలే!
    దర్యాప్తు పూర్తిచేసి మిస్టరీని ఛేదించేలోపు ధర్నాలు, పికెటింగ్ లు, నిరవధిక సమ్మెలు, నిరాహార దీక్షలు, బంద్ లు ఇంకా....ఇంకా....ఏమైనా జరగవచ్చు.
    పరిస్థితి పూర్తిగా చేజారిపోకముందే తగిన సాక్ష్యాధారాలతో నేరస్థుని చేతులకు సంకెళ్ళు వేయగలిగితే బాగుంటుంది.
    వీరేష్ ఆలోచించి డి.ఎస్.పి. మార్తాండ్ ఇంటికి బయలుదేరాడు.
    ఆయన ఎదురుపడగానే సెల్యూట్ చేసి, తను వచ్చిన విషయం చెప్పాడు వీరేష్.
    డి.ఎస్.పి. ముఖం మ్లానమయింది. పొంగివస్తున్న దుఃఖానికి అధికార హోదా అడ్డుపడి దిగమింగేటట్టు చేసింది.
    "సారీ వీరేష్! మా కళ్యాణికి, సమ్రాట్ కు గతంలో పరిచయం ఉందని, అతని వల్లే తను ఆత్మహత్య చేసుకుందని చెప్పి, తరువాత డిఫెన్స్ వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగల సహనం నాకు లేదు. అయినా చనిపోయిన నా ఒక్కగానొక్క కూతురు తిరిగి రాదుగా? దాని జీవితం ఎలాగో అర్థంతరంగా ముగిసిపోయింది. కేసుపెట్టి, చనిపోయిన దాని ప్రవర్తన గురించి డిఫెన్స్ వాళ్ళు న్యాయస్థానంలో అవహేళన చేస్తే నేను తట్టుకోలేను. ప్లీజ్! నా మీద గౌరవం ఉంచి, కళ్యాణి కడుపునొప్పితో బాధపడలేక ఆత్మహత్య చేసుకుందని సాక్ష్యం తీసుకుని, ఇంతటితో ఆ ఫైల్ ను క్లోజ్ చెయ్!" చెప్పి మార్తాండ్ కళ్ళు తుడుచుకున్నాడు.
    వీరేష్ తనను తనే నమ్మలేకపోయాడు. తను విన్నది ముమ్మాటికీ వాస్తవమే అనుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది. నేరస్తుల పాలిట సింహస్వప్నంగా పేరుపొందిన పోలీసు ఆఫీసరేనా ఇలా మాట్లాడింది! ఇక ఒక సామాన్యుడు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు సాక్ష్యం చెపుతాడనుకోవడం నిజంగా తన భ్రమే!
    తను అనవసరంగా బాధ్యతను గుర్తుచేసి ఆయనను బాధపెట్టాననుకున్నాడు.
    "సారీ సార్! మన సర్వీస్ లో ఇది మొదటి కేసు కాదుగా! తెలిసిన వ్యక్తులు నష్టపోయారనే బాధతోనే సమ్రాట్ ను చట్టం ముందు దోషిలా నిలబెట్టాలన్న పట్టుదలతో ఈ కేసులను సవాలుగా తీసుకున్నాను. మీ మనసును కష్టపెడుతున్నాననుకోలేదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS