Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 35

ఉన్నమాట చెబితేనే మంచిది అనుకున్నాడు పుండరీకాక్షయ్య.
ఉన్నమాట చెప్పటం వల్ల, మాటి మాటికీ పోలీసులు కబురు చేస్తూంటారని, మనిషిని గుర్తుపట్టడం సాక్ష్యాదారాలు చాలా తతంగం వుంటుందనీ, తెలియని పుండరీకాక్షయ్య నీతిగా నిజాయితీగా వున్న విషయం చెప్పటానికి సిద్ధమయ్యాడు.
పల్లెటూరి బైతుల వేషాల్లో వున్న ఇరువురి దొంగల ఆనవాళ్ళూ తనకి తెలిసినంతలో చాలా వివరంగా వర్ణిస్తూ చెప్పాడు పుండరీకాక్షయ్య.
అంతా విన్న ఇన్ స్పెక్టర్, "మీరొక్కరే చాలా చక్కగా సమాచారం వివరించారు!" అంటూ మెచ్చుకున్నాడు.
పుండరీకాక్షయ్య ముఖం ఆనందంతో విప్పారింది.
"అయ్యా నేనింక శలవు తీసుకోవచ్చంటారా?" వినయంగా అడిగాడు.
"అప్పుడే నువ్వెట్లా వెళతావ్? ఇంతమందిని అడిగితే ఒక్కడూ సరైన సాక్ష్యం చెప్పలేదు. ఎవరికి వాళ్ళు అబద్ధాలు చెప్పి తప్పించుకున్న వాళ్ళే. మేం సరీగ్గా చూడలేదూ అంటే మేము సరిగ్గా చూడలేదు. అని తప్పించుకున్న వాళ్ళే. దుండగుల రూపు రేఖలని చక్కగా వర్ణించేది నీవొక్కడివే. ఇప్పుడు నేను కొన్ని ఫోటోలు తెప్పిస్తాను. ఆ ఫోటోల్లో వ్యక్తులని చూసి దుండగులలో ఎవరైనా ఈ ఫోటోల్లో వున్నారేమో చెబుదువు గాని, ఒకవేళ ఆ ఫోటోలో లేకపోతే కొందరు దొంగలని, నేరస్తులని పిలిచి చూపిస్తాం. వాళ్ళల్లో ఎవడైనా నీవు చూసినవాళ్ళలో వున్నాడేమో కనిపెట్టి చెబుదువు గాని__ __"
అంటూ ఇన్ స్పెక్టర్ అసలు విషయం వివరంగా చెబుతూంటే పుండరీకాక్షయ్య బుర్ర గిర్రున ఒకసారి తిరిగి వేగంగా పని చెయ్యటం మొదలుపెట్టింది.

పోలీసులతో వ్యవహారం కొరివితో తల గోక్కున్నట్లే అని అందరికీ తెలుసు కాబట్టే ఎవరికి వారే ఏమీ ఎరగనట్లు తప్పించుకున్నారు. మనుష్యులని గుర్తుపట్టినట్లు తను మాత్రమే చెప్పటం జరిగింది. ఇంక ఇప్పుడు వీళ్ళు దొంగ వెధవల ఫోటోలు అన్నీ చూపించి 'వీడా? వీడా?' అని అడుగుతూంటే తను అవుననో కాదనో చెప్పాల్సి వుంటుంది. 'కాదూ' అంటే చిక్కేలేదు. అవును అంటే మాత్రం తనపని చచ్చేచావు అవుతుంది. ఏదో ఒకనాడు ఆ వెధవ తనకి ఎదురుపడి "ఒరేయ్ పుండరీకాక్షయ్యా! నా రూపురేఖలు వర్ణించి నన్ను పోలీసులకు అప్పచెప్పావు. నేను ఇప్పుడు యమలోకం నుంచీ ఇక్కడికి వచ్చాను యమధర్మరాజు నీ రూపురేఖలు వర్ణించి, నీలాంటి వాడు కనపడితే సరాసరి పైకి పంపించమన్నాడు, పంపిస్తున్నా రెడీగా వుండు." అంటూ కత్తి తీసి తనని రెండు పోట్లు పొడిస్తే 'హరీ" అంటం తప్పించి తను చేసేదేమీ లేదు. "ఓరి దేముడో! వచ్చీ వచ్చీ ఎంత చిక్కులో పడ్డాను...."
అని తనలో తాను వాపోయిన పుండరీకాక్షయ్య ఆపద గడిస్తే డిబ్బెనలో పదిరూపాయలు వేస్తానని ఏడుకొండల వాడిని తలచుకుని మరో మొక్కు మ్రొక్కుకున్నాడు.

పది నిముషాల తరువాత,
నేరస్తుల ఫోటోలను తెప్పించాడు ఇన్ స్పెక్టర్.
"కాసిని మంచినీళ్ళు ఇప్పిస్తారా?" భయపడుతూ, భయపడుతూ అడిగాడు పుండరీకాక్షయ్య.
కాకీ దుస్తుల్లో వున్న కరుకుదనం అలాంటిదేమో!
మంచినీళ్ళు తెప్పిస్తాను అని చెప్పకుండా, కానిస్టేబుల్ వైపు తిరిగి కనుసైగ చేశాడు ఇన్ స్పెక్టర్.
కానిస్టేబుల్ అవతలకి వెళ్ళి గ్లాసు నిండుగా చల్లటి మంచినీరు తీసుకువచ్చాడు.
చల్లగా ఆ మంచినీళ్ళు త్రాగేసరికి పుండరీకాక్షయ్య ప్రాణం కాస్తంత కుదుట పడ్డది.
"ఇంకా కావాలా!" కానిస్టేబుల్ అడిగాడు.
మరోసారి అవసరమయితే అడగవచ్చులే అనుకున్న పుండరీకాక్షయ్య "చాలండీ చాలు!" అన్నాడు.
ఆ తరువాత అసలు తతంగం మొదలయ్యింది.
ఇన్ స్పెక్టరు ఒక్కో నేరస్థుడి ఫోటో తీసి పుండరీకాక్షయ్యకి చూపిస్తూ, "వీడి ఫోటో బాగా చూసి చెప్పండి. ఏ కొద్ది పోలికలు వున్నా దాయకుండా చెబితే మిగతాది మేం చూసుకుంటాం!" అన్నాడు ఇన్ స్పెక్టరు.
ఎందుకైనా మంచిదని, పుండరీకాక్షయ్య ఎంతో ముందు జాగ్రత్త వహించి నేరస్తుడి ఫోటోని బాగా పరికించి చూసి, "ఎబ్బే! వీడు కాదండీ!" అంటూ ఫోటోని ప్రక్కన పెట్టడం మొదలుపెట్టాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS