అయినా కిటికీలో తలదూర్చి చూస్తూ "బంగళా చాలా పెద్దదిగా వుంది. అందంగా కూడా వుంది." అనేసింది కన్పించని బంగళా గురించి. కేవలం జరీనాను సంతృప్తి పర్చాలనే తల తిప్పకుండా దీక్షతో చూస్తున్నట్టు కూర్చుంది.
ఆమె పక్కన ఎవరో దబుక్కున కూర్చున్నట్టనిపించి తల తిప్పి చూసింది. పక్కన ఒక లావుపాటి స్త్రీ కూర్చుని వుంది.
జానకి ఆశ్చర్యంగా బస్ డోర్ కేసి చూసింది. ఆమె బస్ ఆగకముందే డోర్ దగ్గిరగా నిలబడి వుంది. బస్ ఆగీ ఆగకముందే దిగేసి చీకట్లో కలిసి పోయింది. ఆమె ముందుకే నడిచిందో, వెనక్కే నడిచిందో కూడా కన్పించలేదు.
జానకికి ఆమె ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగించింది.
తనతో ఇంతసేపూ ఆప్యాయంగా మాట్లాడి, చెప్పాపెట్టకుండా దిగిపోయిందేం? ఆమె చెప్పినవన్నీ అబద్ధాలేనా? అసలు డిప్యూటీ కలెక్టర్ భార్యేనా! టికెట్ కూడా కొనలేదే? కనీసం మర్యాదకైనా డబ్బులిస్తాననలేదే?
అన్నీ లేనిపోని అనుమానాలు. తనపాటికి తను నిలవుంటే దగ్గిరకు వచ్చి అన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఆమెకేం వుంది? దానివల్ల ఆమెకు లభించేదేమిటి? అంతమంది స్టాప్ దగ్గిరకు రాగానే దిగేవాళ్ళను తోసుకుంటూ వెళ్ళి ముందు దిగేస్తారు. అలాంటి వాళ్ళంటే తనకు మహా చిరాకు.
జానకి మనసులో రేగిన అనుమానాలను పక్కకు నెట్టేసింది. ఉద్యోగావసరం, అది కొరుకుతుందన్న ఆశా ఆమె మనసును జోకొట్టినై.
తను ఎల్లుండి తప్పక ఆమె ఇంటికి వెళ్ళాలి. ఎలాగయినా ఆమె రికమండేషన్ తో ఉద్యోగం సంపాదించాలి.
మరో పది నిముషాల కల్లా జానకి దిగవలసిన స్టాప్ వచ్చింది.
ఆమె హడావుడిగా పుస్తకాలు సర్దుకొని లేవబోతూ పర్స్ కన్పించక సీట్లో కూలబడి పోయింది. షాక్ కొట్టినట్టు అయిపోయింది. సీటు వెదికింది. సీటు క్రింద వెదికింది. పర్సు కన్పించలేదు.
జానకి నిర్విణ్నురాలై పోయింది. కళ్ళలో గిర్రున నీరు తిరిగింది.
కండక్టర్ కూడా బస్ అంతా తిరిగి చూశాడు. పర్స్ కన్పించలేదు.
ప్రయాణీకులు కూడా తమతమ సీట్ల కింద వెదక సాగారు.
"ఇందాక మీపక్కన కూర్చున్న ఆమె ఎవరు? కండక్టరు ప్రశ్నించాడు.
"నాకు తెలియదు. డిప్యూటీ కలెక్టరు భార్యనని చెప్పింది." అతి కష్టంమీద సమాధానం ఇచ్చింది జానకి.
బస్సులోని కొందరు ఫక్కున నవ్వారు.
జానకి బిక్క మొహం పెట్టింది.
"అమ్మా మీరు అమాయకుల్లా వున్నారు. ఈ మధ్య అక్కడ జేబుదొంగలు ఎక్కువైనారు." అన్నాడు కండక్టరు సానుభూతిగా.
"జేబుదొంగా? గొప్పింటి మనిషిలా కన్పిస్తుంది?" అన్నది జానకి నూతిలోనుంచి మాట్లాడుతున్నట్టు."
"అలాగే కన్పిస్తారు."
"నైలాన్ చీరెల్లో కూడా తిరుగుతున్నారే."
"వాళ్ళకేం? నెలంతా కష్టపడిన వాళ్ళ జీతం ఇలాంటి వాళ్ళు ఒక్క క్షణంలో సంపాదిస్తారు."
"పాపం! చిన్నపిల్లను ఎంత మోసం చేసింది?"
తలొక మాటా అంటున్నారు.
జానకికి ఎవరి మాటలూ సరిగా విన్పించడం లేదు.
ఒక్కసారిగా శరీరంలోకి దెయ్యం బలం వచ్చినట్టు లేచి విసురుగా బస్సు దిగింది.
కాని ఇంటికేసి నడుస్తుంటే కాళ్ళల్లో సత్తువ లేనట్టు విన్పించ సాగింది.
అడుగుతీసి అడుగు వేస్తుంటే తానేదో ఇసుకలో దిగబడిపోతున్నట్టు భయం వేసింది.
జానకి ఎలాగో ఇంటిముందుకు చేరుకుంది. వరండాలో గోడకు చేరబడి ఊపిరి అందక ఆయాసపడుతూ వుంది.
"ఇంత పొద్దు పోయిందేం! ఎక్కడికెళ్ళావు?" వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ అడిగింది. మరుక్షణంలో ఉక్కిరిబిక్కిరైంది.
ఎన్నడూ లేంది జానకికి ఆ క్షణంలో తల్లి ప్రశ్న ఏదో తిట్టుగా, నేరారోపణలా విన్పించింది.
"ఆఁ వెళ్లాను యమలోకానికి. అక్కడా చోటు దొరక్క తిరిగొచ్చాను." విసురుగా జవాబిచ్చింది జానకి. తల్లి కూతురి ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది.
జానకి చిరచిరలాడుతూ లోపలకు వెళ్ళిపోయింది.
ఏం జరిగి వుంటుంది? అనుకుంటూ లేవబోయి దగ్గు తెర రావడంతో ఉక్కిరిబిక్కిరై పోయింది తల్లి.
జానకి గుండెలు తరుక్కుపోయే బాధతో మంచానికి అడ్డుపడి వెక్కివెక్కి ఏడవసాగింది.
"అక్కయ్యా!" అంటూ కోడిగుడ్డు లాంతరు దగ్గిర చదువుకుంటున్న తమ్ముడు పిల్చాడు.
ఆమె పలకలేదు.
"అక్కయ్యా రేపు ఫీజు కట్టాలి." మళ్ళీ వాడే అన్నాడు గొంతు పెద్దదిచేసి."
గుండెలు అవిసిపోయేలా దగ్గుతున్న తల్లి దగ్గూ, పదేళ్ళ పసివాడి దీన వచనాలూ జానకి వెక్కిళ్ళతో కలిసి గాఢ నిద్రలో వున్న ధర్మదేవతకు మేలుకొలుపు పాడాయి.
ఆ ఇల్లు ఓ వింత వాతావరణంతో నిండిపోయింది.
రాబందులు అన్ని కాలాల్లోనూ విశృంఖల జీవులు. వాటికి నైతిక విలువలంటూ వున్న సంగతే తెలియదు. వాటికి ఆ నైతిక విలువల అవసరం కూడా లేదు.
అందుకేనేమో హత్య కంటే దొంగతనం పెద్ద నేరంగా నైతిక శాస్త్రంలో నిర్వచించబడింది.
