"బహుత్ అచ్ఛా! మాకీ బాగా తెలుసు! అద్భుత్ హై! అపురూప్ హై!" రామ్ సింగ్ అంటూంటే, ఇన్ స్పెక్టర్ తేలకళ్ళు వేశాడు. నేను తెల్లబోయాను.
"తెలుసా! తెలిస్తే ఇంతవరకూ ఎందుకు చెప్పకుండా వున్నావ్! వూ... క్విక్! చెప్పేయ్!" వర్ధనరావుకి బి.పి. పెరిగిపోయి వుంటుంది. ఓ ప్రక్క కంగారు, ఓ ప్రక్క తొందరపడుతూ ఆత్రుతగా అన్నాను.
"అరె! కోటీ యాభయ్ లక్షలకీ వజ్రాల్! చూడ్డానికి ఏమీ ఖుషీగా వుంది! తళుక్...తళుక్!" రామ్ సింగ్ ఆగిపోయాడు.
నోరు తెరుచుకొని వింటూన్న వర్ధనరావు, "ఊ... చెప్పు! మధ్యలో ఆగుతావేం! దొంగ పీనుగుల్లారా! తెలిసీ వేషం. మీకు తెలుసని నాకు ముందే తెలుసు. ఆ బచ్చాగాడు ఫోను చేయకముందే నేను కనిపెట్టాను. అరె! చెప్పు బే! ఆలస్యం చేస్తే వీపుమీద లాఠీ డ్యాన్సు చేస్తుంది. ఊ... చెప్పు!" గద్దిస్తూ అన్నాడు.
"బోల్తానూ సార్! బుల్ బుల్ బ్యూటీ హేమాకీమాలినీ వుందీ కదూ సార్! దానీకాడ కోటీ యాభయ్ లక్షల వజ్రాలూ దాచేస్ కుంటుందీ! అవీ దోచేస్ కోవటాన్కి ధర్మేంద్రాజీ, ఘోడామే ఆతాహై! ముందు హేమాకీమాలినీకీ కారు, ఫీఛే.ఫీఛే ఘోడేమే ధర్మేంద్రాజీ దౌడ్ తే, దౌడ్ తే చల్ తీహై! ముందుకీ కార్, వెమకకీ ఘోడా, అరెరె ఆ సీన్ మే నా ఫావెరెట్... ..."
"ఆపు! ముందు నీ దిక్కుమాలిన భాష ఆపవయ్యా! కారంటావూ, ఘోడా అంటావు, అది ఒదిలేయ్. అసలు ధర్మేంద్రజీగాడు ఎవడు? బందిపోటు దొంగా? పిక్ పాకెట్ గాడా? వాడికీ నీకు ఏం పరిచయం?"
"సార్! సార్!" అహోబిలం అడ్డువస్తూ కంగారుగా పిలిచాడు.
"ఏమిటి? ఏమిటయ్యా నీ గోల! మధ్యలో అడ్డు రావద్దని ఎన్నిసార్లు చెప్పాను?"
"అదికాదు సార్! ఒక్కసారి నా మాట వినండి సార్!" అహోబిలం జంకుతూ అన్నాడు.
"ఏమిటయ్యా వినేది? మధ్యలో అడ్డువచ్చింది కాక ఇక వినటం కూడానూ. సరేలే! అదేదో చెప్పు!" అన్నాడు విసుగ్గా వర్ధనరావు.
"ధర్మేంద్ర హిందీ సినిమా యాక్టరు సార్...!"
"ఏమిటీ హిందీ సినిమా యాక్టరయివుండీ, దొంగతనాలు చేస్తాడా?" ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టి మరీ అన్నాడు వర్ధనరావు.
"అదికాదు సార్! నేను చెప్పేది సాంతం వినండి. రామ్ సింగ్ కి సరీగా తెలుగు రాదుకదా! అందుకని అలా మాట్లాడుతున్నాడు. హేమమాలినీ, ధర్మేంద్ర సినిమా యాక్టర్లు. వాడేదో సినిమా గురించి చెబుతున్నాడు. ఆ విషయం చెప్పటానికే పిలిచాను సార్!"
"ఏమయ్యా ఇంతవరకూ నువ్వు చెప్పింది సినిమా గురించా? ధర్మేంద్రాజీ దొంగకాదా?" గద్దిస్తూ అడిగాడు వర్ధనరావు.
"బహుత్ అచ్ఛా పిక్చర్!" అన్నాడు రామ్ సింగు.
రాంసింగ్, వర్ధనరావు ఒకే జాతికి చెందినావాళ్ళు. వర్ధనరావు తన తెలివి తక్కువతనం మాటలతో బయటపెట్టుకుని అవతల వాళ్ళు నవ్వుకునేలా చేస్తే, రామ్ సింగు తాను తెలివితక్కువ వాడిలాగా నటిస్తూ, ఎదుటివాడిని నవ్విస్తాడు. వర్ధనరావుకి సరయిన జోడీ రామ్ సింగే అనిపించింది ఆ నిముషాన.
"సినిమా గురించి నిన్ను ఎవడు అడిగారయ్యా? పిచ్చి పిచ్చిగా వాగావంటే ఇక్కడే సినిమా చూపిస్తాను." అంటూ గద్దించాడు వర్ధనరావు.
"వాడో తిక్కల వెధవ. మీలాంటి తెలివిగలవారు టైమ్ వేస్టు చేసుకోకూడదు సార్! మీరేమి అడగదల్చుకున్నారో నన్ను అడగండి సార్!" అన్నాను.
అదీ నిజమేనన్నట్లు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు తల క్రిందికీ, పైకీ కుడికీ, ఎడమకీ అడ్డంగా కూడా ఆడించి, ఆ తరువాత తన తలకాయ సరయిన పొజిషన్ లో వుండదేమోనని రెండు చేతుల మధ్యా గట్టిగా ఇరికించుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయాడు.
ముందాలోచన చేయటానికి నాకు కొద్దిపాటి సమయం చిక్కింది. సమయం సద్వినియోగం చేసుకోటాన్కి ఈ కొద్ది టైమ్ చాలు నాకు.
నా బుర్ర పాదరసం వేపు ప్రయాణించటం మొదలుపెట్టింది.
17
"ఊ...ఇప్పుడు చెప్పండి" ఇన్ స్పెక్టర్ వర్ధనరావు గద్దిస్తూ అన్నాడు.
"ఏం చెప్పను సార్?" అమాయకంగా అన్నాను.
కుర్చీలో నిటారున కూర్చుని, కళ్ళు ఎర్రచేసే ప్రయత్నంలో ముఖాన్ని అదోలా పెట్టి, ముక్కు ఒకసారి ఎగబీల్చి, మొత్తానికి మనిషి ఒక ఫోజులోకి వచ్చేసి__
"నేను అడిగిన ప్రశ్నకి సరయిన సమాధానం చెప్పండి" అన్నాడు కరుకుగా.
