Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 35


    కాని నమ్మలేకపోతుంది. కేవలం చేతులకి గ్లవ్స్ తో మాత్రమే వచ్చిన అతని చేతిలోకి పిస్టలెలా వచ్చింది. అసలది పిస్టలేనా.


    ఆమె ఆలోచిస్తుండగానే చెప్పాడు శశాంక నవ్వుతూ...!! నా చేతి వ్రేలితో పిస్టల్లా మభ్యపెడుతున్నానని పొరపాటు పడకు సోఫియా. ప్రమాదాన్ని వూహించిన నేను బయలుదేరేముందే కుడిచేతి గ్లవ్స్ లో పట్టే ఆటోమేటిక్ షార్ట్ పిస్టలును వుంచానని మణికట్టు దగ్గర కాస్త వంచిన మరుక్షణం గ్లవ్ జిప్ వూడి అరచేతిలోకి వస్తుందని నువ్వు అంచనా వేయలేకపోవడం నీ తప్పు కాదు. కమాన్...నీ అనుచరులకి చెప్పు ఆయుధాలు నేలపై పడేయమని. క్విక్...


    ఆమె కొద్దిగా భయపడింది. కాని వెంటనే ఆదేశమివ్వకుండా తన చేతిని నెమ్మదిగా వెనక్కి చాచి శశాంక గురిపెట్టిన షార్ట్ పిస్టల్ మజిల్ ని ఓసారి తడిమి చూసింది.


    ఏ ఆయుధమూ ఆమెకు కొత్తకాకపోవడంతో సునాయాసంగా గుర్తించగలిగింది. శశాంక నిజంగా పిస్టల్ నే గురిపెట్టాడని, అప్పుడు చూసింది తన అనుచరులవేపు.


    ఆమె ఆదేశాన్ని అర్థం చేసుకున్న ఆ వ్యక్తులు ఒక్కో ఆయుధాన్ని క్రింద వుంచారు.


    'గుడ్' అభినందనగా చూశాడు శశాంక. "నేను కారు దగ్గరికి వెళ్ళేదాకా మీరెవరూ మీస్థానం నుంచి కదలొద్దు. అనవసరమైన ఉత్సాహం ప్రదర్శిస్తే ఎంప్రెస్ ప్రాణాలు పోతాయి. నా గురి ఆ గురిలో వేగాన్ని పరీక్షకు ప్రయత్నం చేయకండి. ఇన్ యువరోన్ ఇంట్రస్ట్ ఒకే" నడిచాడామెతో బయటికి.


    తొణక్కుండా మారుతి కారు దాకా నడిచిన సోఫియా నవ్వింది క్రీగంట చూస్తూ "ఐ కంగ్రాచ్యులేట్ యు" అంది.


    "దేనికి?"


    "నిన్ను ఆయుధంగా మార్చుకుని వాడుకుందామనుకున్న నన్ను నీ ఆయుధంతో నొక్కిపట్టి ఇలా తప్పించుకుంటున్నందుకు" ఆ మాటల్లోని నిగూఢతని అర్థం చేసుకోలేని అమాయకుడు కాడు శశాంక.


    "నీ మీద కోపం రావడం లేదు శశాంకా..."


    "మరి!"


    "ఇలాగైనా నీ చేత తాకించుకున్నందుకు ఆనందపడుతున్నాను. వాత్స్యాయనుడి కామ సూత్రాల్లో అయిదు ఆరు, ఏడు ఆధ్యాయాల్ని గుర్తుచేసుకుంటున్నాను."


    శశాంకకి అర్థం కాలేదు.


    "అవును శశాంకా... ఆడా మగా శారీరకంగా కలిసేముందు ఆలింగనం, నఖక్షతం, దంతక్షతం లాంటి ప్రక్రియలతో ముందు మూడ్ లోకి రావాలన్నది ఆ అధ్యాయాల్లో వివరించబడింది. వీపుపై గన్ పెట్టిన పిస్టల్ కూడా నఖక్షతంలా అంటే గోరుతో గీస్తున్న అనుభూతి చెందుతూ రేపటి మన పడకటింటి సుఖానికి ఇది ప్రిపరేషన్ గానే అనుకుంటున్నాను..."


    ఆమెను నెమ్మదిగా వెనక్కి తిప్పుతూ కారులో కూచున్నాడు.


    తలకి ఏదో తాకడంతో అనుమానంగా వెనక్కి చూడబోయాడు.


    కదలకు శశాంకా... నీ కారు వెనుకసీటులో షాట్ గన్ రూపంలో ఓ ప్రమాదం పొంచి వుంది. పాపం వూహించలేదు కదూ" సోఫియా పెదవులపై అదే నవ్వు. "పిచ్చి శశీ ఈ మాత్రం తెలివిలేకపోతే ఇంతటి సామ్రాజ్యాన్ని నేనెలా ఏలగలననుకున్నావ్. చేవ సరుకూ వున్న వాడివైనా ఈ చీకటి ప్రపంచపు ప్రమాదాలను వూహించలేని పసివాడివి" అనుచరులవేపు చూసి దిగి వెళ్ళమన్నట్టుగా సౌంజ్ఞ చేసింది.


    అనుచరుడు వెళ్ళిన వేపే చూస్తూ కారు స్టార్ట్ చేశాడు.


    "వెళ్ళే ముందు ఒక్కమాట" కాంక్షగా చూస్తూ అంది. నీ భార్యని చంపింది ధనుష్కోటి అనుకుంటున్నావు కదూ."


    క్షణం నిశ్చేష్టుడై వెనువెంటనే కట్టెలా బిగుసుకుపోయాడు... ధనుష్కోటి చనిపోయేముందు అన్నదీ అదే మాట.


    "నాకు ధనుష్కోటి శతృవే శశీ! కాని నీకు తెలీదు, చంపాలనుకున్నాడు. కాని, చంపింది మాత్రం తను కాదు."


    "మరి" శశాంక ఫాలభాగంపై స్వేదం నిండిపోయింది.


    "ఇప్పుడే చెబితే నా గురించి నువ్వాలోచించవుగా."


    "చెప్పు సోఫియా... నా భార్యని చంపింది ధనుష్కోటి కానప్పుడు ఎవరు చంపారు? ఎందుకు చంపాల్సి వచ్చింది చెప్పు. ప్లీజ్" ఉద్రేకం తెరలు తెరలుగా అతడ్ని చుట్టుముడుతూంది.


    "చెబుతాను... ఇప్పుడు కాదు... రేపు మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకి..."

    
    "అంతవరకూ..."


    "నా ప్రపోజల్ గురించి ఆలోచిస్తూ గడుపు..."


    "ప్లీజ్ సోఫియా..."


    వెనక్కి మరలిన సోఫియా ఓ క్షణం ఆగింది ఓ చిన్నచప్పుడికి కోథంగా సర్పమైత్తిన కళింగ నాగులా...


    "గో ఎవే మిస్టర్ శశాంకా..."


    ఆమె కంఠంలో శశాంక అంతవరకూ వినని స్థిరత్వం... అదీ కాదు... ఓ విచిత్రమైన శాసింపు...


    లోపాలకి నడుస్తున్న సోఫియా కొన్ని క్షణాల క్రితందాకా కామంతో దహించుకుపోయిన ఆడదానిలా లేదు...

    
    కొన్ని నిమిషాల క్రితమే తనను అనుభవించిన ఓ సైనికుడ్ని హత్యచేసిన రోషనారిలా వుంది.


    శశాంక కారు కదిలింది వేగంగా.


    ఆలోచనల ఒరిపిడితో కారు నడుపుతున్న శశాంకకి తెలీదు సరిగ్గా ఆ వరుసకి అభిముఖంగా వున్న మూడవ బిల్డింగ్ పై అంతస్తు చీకటిలో నుంచి ఓ యువతి తన కారునే గమనిస్తూందని...


    ఆమె వినీల...


                                                         *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS