Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 35


    లలితాంబ ఓ సారి కళ్ళజోడుని సవరించుకొని మేనల్లుడికేసి చూసింది.


    "మాట్లాడవే!" అడిగింది చిన్న నవ్వుతో.


    "నిన్నో మాట అడగనా?" అన్నాడు సారధి.


    ఆ ఇంట్లో ఆమెని ఇంతవరకు అలా ప్రశ్నించి వుండరు.


    సారధి అలా అడిగేసరికి ఆమెకి కాస్త ఆశ్చర్యం కలిగింది.


    "ఏమిటది"


    "నువ్వు మరోలా అనుకోవద్దు. నిన్ను చూస్తుంటే పజిల్ గా వుంటోంది. ఒక్కోసారి అసలు అర్థం కూడా కాదు" అన్నాడు.


    "సరిగ్గా చెప్పు" అంది తీవ్రంగా.


    సారధి సన్నగా దగ్గి అన్నాడు.


    "నీవు బయటవాళ్ళతో ప్రవర్తించే తీరు చూసినప్పుడు నీ అంత విశాల భావాలుగల వ్యక్తి ఎవరూ వుండరనిపిస్తుంది. కానీ ఇంట్లో నువ్వు అందరిపట్ల ఎందుకంత కఠినంగా ఉంటావో నాకసలు అర్థం కావడంలేదు."


    లలితాంబ రెండు నిమిషాలు సారధికేసి, భారతికేసి చూస్తూ వుండిపోయింది.


    అతనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి.


    ఆమెకేదో సన్నని వణుకు వచ్చింది. వంటిమీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి.


    "నిజమేనయ్యా. నేను ఇంట్లో, అందరిపట్ల కఠినంగానే ప్రవర్తిస్తాను. అది పచ్చి నిజం. కాదనను. నా ధోరణి మీకు అర్థం కాదు. నిజమే బయటవాళ్ళ విషయంలో ఒకరీతిగా, మీ విషయంలో మరోరీతిగా ఎందుకుంటానో ఎలా చెప్పనూ?


    నేనూ మీలాంటి మనిషినే.


    నా గుండెలోని బాధ ఏమిటో నేనెవరికీ చెప్పుకోలేనురా!


    నీ అత్త గుండెల్లో అగ్ని పర్వతాలున్నాయిరా. నీ అత్తమనసులో దావానలం వుందిరా.


    నాకెందుకో ఏదో ఊబిలో చిక్కుకొన్న దానిలా అనిపిస్తుంది. నా గుండెని చేత్తో పట్టుకొని ఎవరో నలిపేస్తున్నట్టుంటుంది. అదే భయం...... ఆ భయంతోనే నేను గిలగిల లాడిపోతున్నాను.


    మీకెవరికీ నేను అర్థంకానురా. అర్థం అయ్యేట్టు నేను చెప్పలేనురా సారథి. నీకు తెలుసో తెలీదో ఈ వ్యాపకాలన్నింటిని నేను తెచ్చి పెట్టుకొంటున్నవి. ఎందుకనడక్కండి, వెళ్ళిపో. నా ముందు నించి వెళ్లిపో" అరిచింది లలితాంబ.


    ఆమె ఎప్పుడూ లేనిది ఒక్కసారిగా అలా ఎందుకు మారిపోయిందో సారధికి అర్థంకాలేదు.


    భారతి అయోమయంగా చూసింది.


    ఆమెలో ఎవరికీ చెప్పుకోలేని ఏదో ఓ బాధ ఆమె గుండె లోతుల్లో చిక్కుకొని ఆమెని నలిపేస్తోందని మాత్రం సారధి గ్రహించాడు.


    భారతికి తల్లినలా చూస్తే భయం వేసింది.


    "సారీ మమ్మీ" అంది మెల్లగా.


    "ప్లీజ్. బోత్ ఆఫ్ యు గెటవుట్" అరిచింది లలితాంబ చేతులతో తలని గట్టిగా పట్టుకుని.


    వాళ్ళిద్దరూ అక్కడినించి కదిలి మేడమెట్లు ఎక్కుతూ ఒకేసారి వెనక్కి తిరిగి చూశారు.


    లలితాంబ పవిట చెంగుతో కళ్ళొత్తుకుంటోంది.


    లక్ష్మిపతి అదే సమయంలో ఆఫీసు గదిలోంచి బయటకొచ్చి ఆమెకేసి చూస్తున్నాడు.


    భారతిగానీ, సారధికాని ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు.


    చెరో వైపుకి మౌనంగా నడిచారు.


    లక్ష్మిపతి మెల్లగా వచ్చి -


    "లలితా, అంతా విన్నాను. బాధపడకు. నేనేమన్నా అంటే కదా నువ్వు బాధ పడాలి ప్లీజ్" అంటున్నాడు.


    లలితాంబ భర్త గుండెలపైన వాలిపోయి బావురుమంది. ఆయన ఆమె వీపుపైన చేత్తో టాప్ చేస్తూ అన్నాడు.


     "టేకిట్ ఈజీ, టేకిట్ ఈజీ, నువ్వు అనవసరంగా పాతరోజుల్ని గుర్తు చేసుకోవద్దు. గతం నాస్తి నీకు నేనున్నాను లలితా!" తలెత్తి భర్త మొహంలోకి చూసింది లలితాంబ.


    ఆ మాటలంటున్న భర్త మొహంలో ఎంతో ప్రశాంతత గోచరిస్తుంది.


    ఆ సమయంలో లక్ష్మిపతి ఆమెకి అభయం ఇస్తున్న దేవుడిలా కనిపించాడు.


    కొంతసేపయిన తర్వాత భారతి మేడదిగి కిందికొచ్చింది. అక్కడ తల్లిగానీ తండ్రిగానీ లేరు.


    అటు ఇటు చూసి తండ్రి గదిలో అడుగుపెట్టింది భారతి.


    ఏదో పిటీషన్ రాస్తున్న లక్ష్మీపతి భారతి అడుగుల చప్పుడు విని తలెత్తి చూశాడు.


    "డాడీ!" అంది భారతి.


    "ఏమ్మా, ఏం కావాలి?"


    "ఏం లేదు డాడీ, మమ్మీ ఎందుకలా ప్రవర్తించిందో నాకు అర్థం కావడంలేదు. ఆమె ఎందుకలా అయింది?"


    లక్ష్మీపతి చేతిలో వున్న పెన్ను టేబుల్ పైన పెట్టిలేచి నించున్నాడు. మెల్లగా చేతుల్ని వెనక్కి కట్టుకొని కిటికీ దగ్గరగా నడిచాడు.


    కిటికీలోంచి బయట తోట అందంగా కనిపిస్తోంది. మాలి తిరుపతి మొక్కలికి నీళ్ళు పడుతున్నాడు.

    "ఏం డాడీ? మాట్లాడవే? నాకు చెప్పకూడదా?" అడిగింది.


    లక్ష్మీపతి ఆమె మాటలకి మెడతిప్పి చూసి మెత్తగా నవ్వాడు. కళ్ళజోడుని సవరించుకొని చెప్పాడు.


    "మా పెళ్ళికి ముందు మీ మమ్మీకి ఫిట్స్ వచ్చేవమ్మా. ఆ సంగతి పెళ్ళికి ముందే నాకు తెలుసు. అదృష్టవశాత్తూ పెళ్ళయిన తర్వాత రావడం మానేశాయి. కానీ ఆమెకి ఆవేశం కలిగేలా ఎవరైనా మాట్లాడితే ఆమె భరించలేకపోవచ్చని, తిరిగి ఏ క్షణంలోనైనా ఫిట్స్ ఎటాక్ అవుతాయని డాక్టర్లు చెప్పారు. అందుకేనమ్మా, తను ఏం చెప్పినా వినడంగానీ తన కిష్టంలేని పని చేయను" అన్నాడు.


    కానీ తను కట్టుకథని అందంగా అల్లి కూతురికి చెబుతోన్న విషయాన్ని భారతి అతి సులువుగా గ్రహించింది.


    కానీ తనుకుగా తను తనకు తెలిసిన నిజాన్ని చెప్పడు. చెప్పలేడు. చెప్పకూడదు.


    భారతి తండ్రికేసి నిర్లిప్తంగా చూసింది. "నువ్వు నాతో అబద్ధం చెబుతున్నావు డాడీ!" అని తండ్రిని క్రాస్ చేసి అడగనూలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS