మొన్న మౌనికకు పాము కరిచిన రోజు బయటకు వచ్చినా అప్పుడు ఆ విషాదం వల్ల ఆ స్వేచ్ఛను ఎంజాయ్ చేయలేకపోయారు. ఇప్పుడు ఆ బాధలేదు. సంవత్సరం తరువాత అంతమందితో కలిసి సినిమాకు పోతుండడం ఎంతో ఎగ్జెయిటింగ్ గా వుంది.
మహిళాసదన్ ఆవరణ దాటి కాలిబాటను ఎక్కారు. ఆకాశంలో చందమామ సగానికి పగిలిన కొబ్బరి చిప్పలా వుంది. గాలి చలికి వణుకుతున్నట్లు వీస్తోంది.
"ఆవరణ దాటి అరఫర్లాంగ్ నడిచాం. ఏమిటి ఒక్కరూ మాట్లాడడం లేదు?" అన్నాడు తరుణ్ నిశ్శబ్దాన్ని భరించలేక.
"సినిమాకు పోతున్నప్పుడు ఎలా వుండాలి? ఎన్ని జోక్ లు, ఎన్ని నవ్వులు."
"మీరే చెప్పండి. మేం వింటాం" కైవల్య అంది.
"ఎప్పుడూ నేను చెబుతా వుంటే మీరు వినడమేనా - ఆడపిల్లంటే మా సత్యవతిలా వుండాలి"
"సత్యవతా? ఆమెవరు?" శృతి అతని పక్కకు వస్తూ కుతూహలంగా అడిగింది.
"అదో పెద్ద కథలే"
"చెప్పు - కిలోమీటరు దూరం తెలియకుండా వుండాలంటే చెప్పు."
"సరే అయితే. ఈ కథ విన్నాకన్నా మీరు మీ మూగనోము వదిలెయ్యాలి. సరేనా?"
"అలానే" అందరి తరపునా తనే చెప్పింది శృతి.
అతను చెప్పడం ప్రారంభించాడు.
"సత్యవతిది దొన్నెపూడి. ఓ మోస్తరు పల్లెటూరు. టౌన్ కి దూరంగా వుండేది. సినిమాలు, షికార్లకు వెళ్ళాలంటే రెండు కిలోమీటర్లు నడిచి బస్సెక్కాలి. అందుకే మరీ అర్జెంట్ పనులుంటే తప్ప ఎవరూ టౌన్ కి వెళ్ళేవాళ్ళు కారు.
సత్యవతి ఒకతే కూతురు. పదోతరగతి వరకు చదివింది. ఆ పైన చదవాలంటే టౌన్ కి వెళ్ళాలి. అది కుదరదు కాబట్టి అక్కడితో చదువు మానేసింది.
టౌన్ కి దూరంగా వుండడం వల్ల ఈ ఊర్లో ప్రజలకు సెక్సే పెద్ద రిక్రియేషన్. రచ్చబండల దగ్గర్నుంచి, పొలాల్లో పనిచేసే కూలివాళ్ళ వరకు సెక్స్ కబుర్లు తప్ప మరొకటి వినపడవు.
ఇలాంటి ఊర్లో వుండడం వల్ల ఆడపిల్లలకు తొందరగా వయసొచ్చేస్తుంది. వయసుతోపాటు కోర్కెలు కూడా వాటంతటవే పుట్టుకొస్తాయి.
లవ్ ఎఫైర్ సాగించని ఆడపిల్ల ఆ ఊర్లో అరుదు. చీకటిపడితే చాలు చెట్లంట, పుట్లంట కాస్తంత చాటుకోసం వెదుక్కునే జంటలే కనిపిస్తాయి.
సత్యవతి చామనఛాయతో, పొడవుగా, సెక్సీగా వుండేది. చూస్తూనే అన్నీ ఉడిగిపోయిన ముసలాడికయినా నరాలు జల్లున లాగేసే ఆకర్షణ. ముఖ్యంగా ఆమె ఎద, కళ్ళు. కళ్ళు ఎంత అందంగా వుంటాయో, ఎద అంత ఆకర్షణగా వుండేది.
ఒక్కతే కూతురు కాబట్టి సత్యవతి వయసుకొచ్చిన రోజు ఆమె తల్లిదండ్రులు పెద్ద ఫంక్షన్ చేశారు. లౌడ్ స్పీకర్ కూడా పెట్టి పెద్ద హంగామా చేశారు.
ఇదంతా చూసి ఓ పెద్దాయన అన్నాడు - "ఇలాంటి ఆచారాలు ఎంత పనిచేస్తాయో చూడండి. ఫలానా ఆడపిల్ల వయసుకొచ్చిందని మగపిల్లలందరికీ తెలుస్తోంది. ఇంతకంటే మంచి ఏం జరగాలి?"
లౌడ్ స్పీకర్లో పాటలు విని చిన్నపిల్లలు సంతోషిస్తే, సత్యవతి లాంటి పిల్ల వయసు కొచ్చిందని కుర్రకారంతా హుషారుపడింది.
కానీ సత్యవతి కుదురైన పిల్ల. ఊరు అలా వున్నా ఆమె మాత్రం ఆ విషయాలకి దూరంగా వుంది. ఎదురైన మగవాడు తన కళ్ళ తరువాత చూసేది తన ఎదనేనన్న విషయం తెలిశాక పైట జారనిచ్చేది కాదు. పైట వంపులు తిరిగిన వైనం జూసి, దాని వెనక నున్న అందాలను ఊహించుకోవలసి వచ్చేది.
ఎదురుపడ్డ ప్రతిసారీ కన్ను కొట్టేవాడు ఒకడు, ఇంటికెళ్ళి ఆమె తల్లిదండ్రులు చెప్పిన ప్రతి పనీ చేసి మంచివాడన్న బిరుదు కొట్టెయ్యాలని ఇంకొకడు. ఇలా ప్రతి ఒక్కడూ ఆమెకు దగ్గర కావాలని ప్రయత్నించేవాడే. కానీ సత్యవతి ఎందరు ఏ వేషాలు వేసినా ఏ ఒక్కరితోనూ చనువుగా మసిలేది కాదు.
ఇరవయ్యేళ్ళు వచ్చేసరికి ముద్దబంతి పూలతోటలా తయారైన తమ కూతురికి పెళ్ళి చేసెయ్యాలని ఆమె తల్లిదండ్రులు ప్రయత్నాలు ప్రారంభించారు.
చివరికి ఓ సంబంధం సెటిలైంది. పెళ్ళి కొడుకుది తిరుత్తణి దగ్గర పల్లెటూరు. ఒక్కడే కొడుకు. ముసలి తల్లి తప్ప మరెవరూ లేరు. పిల్లాడికి ఏం ఉద్యోగం లేకపోయినా కాస్తో కూస్తో పొలాలున్నాయి. భుక్తికి ఏ దిగులూ లేదు. తమ తాహతుకి ఇంతకంటే మంచి సంబంధం రాదని తెలిసిన సత్యవతి తల్లిదండ్రులు ఈ సంబంధాన్ని ఖరారు చేసుకున్నారు.
పెళ్ళి జరిగిపోయింది.
సత్యవతి అత్తగారింటికి బయల్దేరింది.
తమను ఊరించి, తమకు దొరక్కుండా వెళ్ళిపోతున్న ఆమెను చూసి కసికసిగా తిట్టుకున్న కుర్రవాళ్ళే ఎక్కువ. ఆమెను మెల్లగా మరిచిపోయింది ఊరు.
సత్యవతికి అత్తగారింట్లో బాగానే వుంది. భర్త శివరావు మెత్తటి మనిషి. సంపాదించాలన్న యావ తప్ప మరో దురలవాటు లేనివాడు.
భార్యతో బాగానే వుండేవాడు.
రెండేళ్ళు గడిచిపోయాయి.
తమ ఊర్లోకంటే తన అత్తగారి ఊర్లో పొలాలు చౌకగా వస్తాయి కాబట్టి ఆ వూరికి వెళ్ళిపోవాలన్న కోర్కె పుట్టింది శివరావుకి. అందుకు సత్యవతి కూడా వెంటనే ఒప్పేసుకుంది.
శివరావు మొదట సత్యవతిని అత్తగారింట్లో దింపాడు. అతని తల్లి ఆ మధ్యనే చనిపోయింది.
పొలం అమ్మి డబ్బు తేవడానికి శివరావు తిరిగి తన స్వగ్రామానికి వెళ్ళాడు.
సత్యవతి పుట్టింటికి వచ్చేసిందని తెలిసి మళ్ళీ కుర్రకారుకి హుషారు పుట్టుకొచ్చింది. పెళ్ళయిందన్న మాటేగానీ సత్యవతి ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు. పైపెచ్చు అవయవాలన్నీ అనుభవంతో మరింత విచ్చుకున్నాయి. మావటివాడికి లొంగని మదపుటేనుగులు గుర్తొచ్చేవి ఆమె ఎదను చూస్తుంటే.
శివరావు పొలం అమ్మి డబ్బులతో వచ్చాడు.
సత్యవతి ఒక్కతే కాబట్టి వేరే ఇంట్లో వుండడానికి ఒప్పుకోలేదు ఆమె తల్లిదండ్రులు అత్తా మామలతో కలిసి అదే యింట్లో సెటిలై పోయాడు శివరావు.
తన పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో తిరిగి పొలం కొనాలని బేరాలు చేయడం ప్రారంభించాడు.
సత్యవతి తల్లిదండ్రుల పొలం రైల్వే బ్రిడ్జి దగ్గర వుండేది. ఊరికి అది కాస్త దూరం. ఆ పొలం దాటితే ఇక వున్నదంతా అడవి.
శివరావు పొలం దగ్గరికెళ్ళి వస్తూ వుండేవాడు. ఎండాకాలంలో వేరుశెనగ వేశారు. పంట బాగా ఊరింది. చివరిసారి నీళ్ళు కట్టాల్సి వుంది.
