Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 34

    ఒక పూవు గాలివాటుకు కొట్టుకు వెళ్ళి నిప్పుల కొలిమిలో పడినట్లుగా అయింది ఆమె పరిస్థితి! ముందు నడవటం ప్రారంభించింది.

    దూరంగా వెహికల్ కన్పిస్తోంది!

    ఆమె మోసం చేయాలనే ఆలోచనలో లేదని అతడు అర్ధం చేసుకున్నాడు! అల్లరి చేసే ఘటం కాదని నిర్ణయించుకుని మాటలు ప్రారంభించాడు.

    "రమోలా! నన్ను ఎక్కడ చూచావమ్మా నువ్వు?" అని ప్రశ్నించాడు.

    "ఎక్కడా ఎప్పుడూ చూడలేదండి! అబద్ధం చెప్పాను" అంది భయంగా.

    "ఎందుకలా చెప్పావు? నన్నేం చేద్దామనుకున్నావు? నిప్పు అని తెలియక తాకావు. కాలిందనుకో! ఒకవేళ నిజంగా నేను అమాయక అర్భకప్రాణి అయితే నువ్వు చెయ్యాలనుకున్నదేమిటి?"

    "ప్రేమ గురించి మగవాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో స్టడీ చేద్దామనుకున్నాను"

    "నా గురించి స్టడీ చేశావా? ఏం తెలిసింది నీకు?"

    "మీ గురించి నాకేమీ తెలియలేదండి! నా గురించి నాకేమీ తెలియదని మాత్రం తెలిసింది. ప్రేమ గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం ప్రాణాలు మీదికి తీసుకురాగలదు, అని తెలిసింది సార్.

    నేను పొరపడ్డాను అని తెలిసింది. ఈ పని నా ద్వారా కాకుండా మరెవరి ద్వారా అయినా చేయించకూడదా? నా జీవితం బలి అవుతున్నది కదా?" అంది రమోలా!

    "నో! అనుకున్నది సాధించకుండా వదిలేయటం! అవసరాన్ని బట్టి అభిప్రాయాలు మార్చుకోవటం! భయపడి పారిపోవటం! ప్రాణాల కోసం యాచించుట ఇలాంటివి మా చరిత్రలో ఉండవు." అన్నాడు గెడకర్రలాంటి యువకుడు.

    ఆమె పార్కులోలాగే మోటార్ బైక్ ఎక్కి కూర్చుంది ముందుగా.

    అతడు రైఫిల్ ని ఒక రహస్య స్థావరంలో ఉంచి వచ్చాడు.

    "ఇదిగో ఈ రిమోట్ కంట్రోలర్ నా చేతిలో ఉంచుకుని మోటార్ బైక్ నడుపుతాను. నువ్వు దాన్ని యాభై మీటర్ల దూరంలో సగం కూడ విసరలేవు. అలాటి ప్రయత్నం చేశావంటే బటన్ నొక్కుతాను. ఆ విషయం గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా కూర్చో" అని హెచ్చరించాడు.

    అతని మోటార్ బైక్ వెనుక మరో రెండు బయలుదేరాయి.

    వారి దగ్గర బైనాక్యులర్స్, రివాల్వర్స్ ఉన్నాయి.

    రోడ్డు మీదికి వచ్చాక వెనుక వస్తున్న వారు రివాల్వర్స్ ఆమెకు చూపారు. చిన్న కదలిక అయినా అనుమానాస్పదంగా ఉంటే వారు కాల్చేస్తారు.

    మౌనంగా తలదించుకుని కూర్చుంది రమోలా? ఒక సైంటిస్ట్ ని బలి చేయటం ఎలా? తాను బ్రతకాలంటే అనేకమందిని చంపాలి.

    వారిని బ్రతికించాలంటే తాను చనిపోవాలి.

    సరదా కోసం ప్రారంభించిన ఒక చిన్న పొరపాటు ఎంత పెద్ద ఘోర దురంతానికి దారి తీసిందో తలుచుకుని భూమిలో కృంగిపోయింది ఆమె. అనాధ ఆశ్రమంలోకి సైంటిస్ట్ ఎందుకు వస్తున్నారు అనే సందేహం కలిగింది.

    కాని అది తెలుసుకోవటం ఇప్పటి తన సమస్య కాదు.

    తమ పరిశోధనలతో ప్రజలకు వెలుగుదారి చూపుతారు శాస్త్రవేత్తలు. అందుకోసం తమ సుఖాల్ని కాలాన్ని ఖర్చు చేస్తారు.

    అటువంటి ఒక మహానుభావుణ్ణి చంపటంకన్నా ఇక్కడే ఏదో అఘాయిత్యం చేసి వీరితో పాటుగా చనిపోవటం ఉత్తమం అనిపించింది.

    వేగంగా పోతున్న వాహనం మీదినించి క్రిందికి దూకేద్దామనుకుంది. ఆఖరు అవకాశం కోసం ఎదురు చూస్తోంది.


                                                                     *    *    *


    నిముషాలు దొర్లి పోయి గంటలుగా మారుతున్నాయి.

    రమోలా కోసం ఎదురు చూస్తున్న బెటాలియన్ అందరూ తమాషాగా జోక్స్ వేసుకున్నారు. సమయం గడచిన కొద్దివారిలో భయం పెరిగింది. ముక్కు ముఖం తెలియని వాడి వెంట కలలా మాయమయింది రమోలా?

    "ఇది తిరిగి వస్తుందా?" అనే సందేహం అందరినీ పట్టుకుంది.

    వారు ఎక్కడికి వెళ్లారనే విషయం ఊహించేందుకు ఎంతమాత్రం వీలుకాదు. క్షణక్షణానికి వారిలో క్నగారు మరింత ఎక్కువ అయింది.

    "ఒకసారిలాగే పరిశోధనకి అని వెళ్ళి ఒక ఛాయిస్ హాస్టల్ లో చిక్కడిపోయింది. బయటకు తీసి ఒడ్డున పడేయటానికి మూడు రోజులు పట్టింది. అలాంటిదే ఏదో జరుగుతూందని ఊహించాను. అలాగే జరిగినట్లు అనిపిస్తోంది.

    "ఇప్పుడేమిటి చేయటం?" అంది ఆమని సందేహంగా.

    "గార్దిన్ కాఫీ యిచ్చే ప్లేసెస్ లో ఎక్కడున్నాయో ఎంక్వయిరీ చేద్దాం"

    "ఇంత మహానగరంలో అది సాధ్యమంటావా?"

    "పోలీస్ ఎంక్వయిరీ యిస్తే ఎలా ఉంటుంది?"

    "అందుకు యింకా సమయం ఉంది. మరి కొంతసేపు చూడాలి. ఒకవేళ తిరిగి పబ్లిక్ గార్డెన్స్ కి కాని వచ్చిందేమో?" అందరూ తిరిగి పబ్లిక్ గార్డెన్స్ కి వచ్చారు.

    కాని అక్కడ రమోలా వచ్చిన జాడలు లేవు.

    ప్రేమ పరిశోధన అంటూ ప్రారంభించిన కార్యక్రమం రమోలా అన్వేషణగా మారింది. ఇద్దరు చొప్పున మూడు బ్యాచీలుగా చీలిపోయారు.

    తలకొక వైపు టాక్సీలు తీసుకుని బయలుదేరారు.

    ఎలాంటి వార్తను ఎవరు తీసుకువస్తారో అని దుఃఖంతో చూచుచున్నారు. కిష్కింద నించి వానరులు బయలుదేరుతున్న సమయంలో ఎవరయినా సీతమ్మ మరణవార్త దీసుకురాకూడదు అని అందరూ దైవాన్ని ప్రార్ధించారు.

    ఆమని వెంట రమ్మీ బయలుదేరింది.

    వారిద్దరూ ఒక టాక్సీ తీసుకుని దక్షిణం దిక్కుకు వెళ్ళారు. అన్వేషణ నిరాఘాటంగా సాగింది. ఎక్కడా హోటల్స్ తెరచి వున్న జాడలేదు. రమోలా కనిపిస్తుందన్న ఆశకూడ వారికి కలగటల్లేదు.

    రెండు గంటలు తాము విభజించుకున్న ప్రాంతమంతా కలియ తిరిగారు. ఫెయిర్ పెరిగిపోతూ ఉందని డ్రయివర్ అదొకలా చూస్తున్నాడు.

    "మన వాళ్ళంతా వచ్చేసి ఉంటారు. పబ్లిక్ గార్డెన్స్ కి పోదాం" అంది రమీ!

    "అంతకన్నా గత్యంతరం లేదనుకుంటాను" నిరాశగా అంది ఆమని.

    "టాక్సీ వెనక్కి పోనివ్వమంటారా?" ఆ లక్ష్యంలేని చిక్కు ప్రయాణం ముగించాలని కోరుతున్న డ్రయివర్ వారిని అడిగాడు ఆశగా.

    "పోనివ్వు" అంది ఆమని. టాక్సీ వెనక్కి తిరిగింది.

    ఒక వీధిలో ప్రత్యేకమయిన వాతావరణం కన్పించింది.

    జనం హడావిడిగా ముందుకుపోతూ కన్పించారు. మరికొంత ముందుకుపోయాక కారు ముందుకు వెళ్ళే అవకాశం లేకుండా ఒక భవనం ముందు వేదిక నిర్మించి ఉంది.

    "వెనక్కిపోయి ప్రక్కరోడ్డుకి తిరగండి! ముందుకువెళ్ళే దారిలేదు"

    "బాబూ ఏం జరుగుతోందిక్కడ?" అని అడిగింది ఆమని!

    "అనాధ శరణాలయంలో అపూర్వమయిన సన్నివేశం జరుగుతోంది"

    "ఏమిటా సన్నివేశం?" ప్రశ్నిస్తూ కారుదిగి వచ్చింది.

    "జెనెటిక్స్ లో అంతర్జాతీయ బహుమతులు పొందిన డాక్టర్ ఒకాయన ఈరోజు ఫంక్షన్ కి హాజరవుతున్నారు!"

    "ఇంత చిన్న అనాధశరణాలయానికి అంత గొప్పవారు ఎందుకు వస్తారు"

    "అదే ఈరోజు అద్భుతం! స్టేజిమీద కన్పిస్తోంది చూడండి. రెండు సంవత్సరాల పాప! ఆమే ఒక అద్భుతం! ఆ పాపకోసం ఆయన అమెరికానించి వచ్చారు"

    వినేందుకు విమీకి అమనికి ఈ కధ ఎంతో ఆసక్తిని కలిగించింది.

    అంత చిన్న పాపని అనాధ ఆశ్రమంలో వదిలేశారు. వారికి మనసెలా ఒప్పిందో?

    పాప ముద్దుగా బొద్దుగా ఉంది. చాలా బుద్దిమంతురాల్లా దిక్కులు చూస్తోంది.

    "ఏమిటి పాపకేమయింది?" అని అడిగింది విమీ!

    "ఆమెకేమీ కాలేదు. ఆరోగ్యంగానే ఉంది. కాని అమ్మాయి జన్మ కధ విన్నవాళ్ళకే మతులు పోతున్నాయి" అని యువకుడు సమాధానమిచ్చాడు.

    కొద్దిసేపు ఆగి ఆ విచిత్రం తెలుసుకోవాలనిపించింది.

    జనం అంతా ఎవరి ఆసక్తిలో వాళ్ళున్నారు.

    అడిగినా పొడి మాటలు చెప్పి వెళ్ళిపోతున్నారు. మరోవంక రమోలా ఏమయిందన్న అనుమానం బాధిస్తోంది.

    "ఈ విషయం రేపయినా తెలుసుకోవచ్చు. మనం త్వరగా వెళ్ళిపోదామే!" అంది విమీ! అమనికి ఆసక్తిగా ఉన్నా మనసులోని భయంవల్ల ఒప్పుకుంది. వారు కారు దగ్గరకు వస్తూ ఉండగా ఒక మోటార్ సైకిల్ ఏమాత్రం జనాన్ని లెక్కచేయకుండా ముందుకు దూసుకుపోయింది.

    రద్దీగా ఉన్న ఆ వీధిలో అంత నిర్లక్ష్యంగా డ్రయివ్ చేస్తోంది. ప్రాణంమీద ఆశలేనివారే అయి ఉండాలి. సహజమయిన ఆసక్తితో తల ఎత్తి చూచింది.

    పార్కులో కనిపించిన గెడకర్రలాంటి యువకుడే!

    వెనుక కూర్చుని ఉంది రమోలా!

    వారి బైకు ఒక చెట్టుక్రింద ఆగింది.

    ముందుగా రమోలా క్రిందికి దిగింది. ఆమె వెనుక మరో రెండు వాహనాలు వచ్చి ఆగాయి. రమోలాని చుట్టిముట్టినట్టు అతి జాగ్రత్తగా నిలబడ్డారు అయిదుగురు యువకులు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS