Previous Page Next Page 
పరిహారం పేజి 34


    "నువ్వు ఉత్త అమాయకురాలివి పారూ?" మనోహర్ పేలవంగా నవ్వాడు. అక్కడికి వచ్చి వాళ్లడిగే ప్రశ్నలకు నేనేం జవాబు చెప్పగలననుకొన్నావు?నీకూ ఆ పిల్లకూ ఏం సంబంధమని అడిగితే నేనేం చెప్పాలి? మన మధ్యలేని కథ ఒకటి సృష్టించడం నా కిష్టం లేక పోయింది. ఎంత చెడ్డది అయినా ఆవిడకు నీ మంచీ చెడ్డా చూసే అధికారముంది. నాకేముంది? కేవలం చిన్నప్పటి నుండి ఒకర్ని ఒకరం ఎరిగున్న మనుషులం"
    "అంతేనా, మనూ? ఇంకేమీ లేదా? ప్రపంచానికి కాదు. నువ్వు నా కోసం ఒకమాట చెప్పు. ఆ మాట పట్టుకొని నిన్ను ప్రపంచం ముందు నిలబెట్టబోను"
    "నా మనసులో ఏముందో నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు పారూ? దానివల్ల నీకేం ప్రయోజనం లేదు. నా పెళ్ళి రజని అనే అమ్మాయితో స్థిరపడింది. ఈనెలలోనే నిశ్చయ తాంబూలాలు తీసుకోవడం జరుగుతుంది"
    "ఓ!" పారిజాత ముఖం పాలిపోయినట్టుగా అయింది. తనను తను సంభాళించుకొంది, చిరునవ్వు నవ్వింది "ఆ అమ్మాయి ఎలా ఉంటుంది?"
    "బాగుంటుంది"
    "ఏం చదువుకొంది?"
    "బి.ఎ"
    "ఇప్పటికే ఆ పిల్ల పేరున కొన్ని లక్షల ఆస్తి వుంది తండ్రికి ఒక్కతే కూతురు!"
    ఈ మాటలు చెబుతున్నప్పుడు మనోహర్ లో తనాశించిన భావాలు కాక ఏదో ఉత్సాహం వ్యక్తమైంది. అంతగొప్ప శ్రీమంతుల అమ్మాయి తనకు భార్యగా లభిస్తున్నందుకు గర్వంతో కూడిన చిరునవ్వు ముఖాన్ని వెలిగిస్తోంది.
    "మీ అమ్మగారి కోరికలు ఫలించాయి. ఎక్కడ నా లాంటి దరిద్రురాలు కోడలుగా వస్తుందో నని బెదిరి చచ్చింది" కసిగా నవ్వింది. పారిజాత లేచింది  "వస్తాను మనూ! ఇవాళ నువ్వు ఇచ్చిన ఆతిధ్యాన్ని ఎప్పుడూ మరిచిపోను!"
    "ఎక్కడికి?"
    "లలిత దగ్గరికి. వచ్చి వాళ్ళింట్లోనే దిగాలనుకొన్నాను కాని అనుకోనివిధంగా ముందుగా మీ ఇంటికే రావలసి వచ్చింది. నువ్వు పెట్టించిన భోజనం తినాల్సివచ్చింది. మీ అమ్మ వచ్చాక ఈ సంగతి తెలిసి నన్ను ఎన్ని చవాట్లు పెడుతుందో? ఎన్ని అభాండాలు వేస్తుందో?"
    "అభాండాలు వేయడానికి నేను ఆడపిల్లనా?"
    "నువ్వు ఆడపిల్లకంటే ఎక్కువ భయస్తుడివి!" వెళ్ళడానికి రెండడుగులు వేసింది.
    "లలిత లేదనుకుంటాను. ఉదయం పెట్టి, బెడ్డింగు రిక్షాలో పెట్టుకుని వెళ్ళగా చూశాను"
    పారిజాత ముఖంలో చెప్పలేని దిగులు ఆవరించుకొంది.
    దిక్కు తోచనట్టుగా, అయోమయంగా నిలబడిపోయిన పారిజాత ముందు కోమలమ్మ ఇంట్లోంచి బయట పడితే చాలనుకొని మేడదిగి క్రిందికి వచ్చి రంగనాధం ఇంటివైపు నడిచింది.
    "ఎప్పుడొచ్చావు, పారూ?" నాగలక్ష్మి ఆశ్చర్యంతో ప్రశ్నించింది.
    "ఇప్పుడే బాగున్నావా అత్తా? మామయ్య ఏడి?"
    ఆయన బయటికి పనిమీద వెళ్ళాడని, సంగతులేమిటని ప్రశ్నించింది నాగలక్ష్మి.
    పారిజాత తను పారిపోయి రావడంగురించి చెప్పింది మేనత్త ఎలాంటిదో, ఏ ఉద్దోశ్యంతో తనను తీసుకెళ్ళిందో అంతా చెప్పింది.
    అంతా విని ఆవిడ ఏదీ వ్యాఖ్యానించలేదు. కాని, ఆమె ముఖంలో ఒక సంగతి మాత్రం వ్యక్తమౌతూంది. "మా గిరిధర్ ను చేసుకొంటే నీకీ కష్టాలు ఉండేవు కాదుగా!" అన్నదే ఆ భావం.
    లలిత ఆ ఉదయమే వాళ్ళ అత్తకు ఆరోగ్యం బాగాలేదని తెలిసి వెళ్ళిందట.
    "ఇక్కడికే వచ్చావా? మీ మామ నీకోసం వచ్చాడు!" రంగనాధం ప్రవేశిస్తూ అన్న మాటలకు గతుక్కుమన్నది పారిజాత. ఆయన వెనుక ఉగ్రంగా చూస్తూ నిలబడిన బసవయ్యను చూచి పులిని చూసి బెదిరిన లేడిలా అయింది. లేని శక్తి కూడదీసుకుని చెవులకున్న దుద్దులు మెడలోనాను, తీసి,  "ఇవిగో మామయ్యా?" అంటూ ఇవ్వబోయింది.
    "పతకం ఏదీ?" ఆయన గర్జిస్తున్నట్టుగా అడిగాడు.
    "నానుమాత్రం పెట్టింది. పతకం సంగతి నాకు తెలీదు."
    "నాలుగు అంటిస్తే తెలుస్తుంది!" ఆయన చేతిబెత్తం పైకెత్తి ముందుకు వచ్చాడు.
    పారిజాత నాగలక్ష్మి వెనుకగా చేరింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS