గొప్ప ఖర్చుతో దినక్రియలు దాటించారు సూర్యదేవులు.
కర్మ ప్రారంభించిన నాటినుండి గరుడపురాణం చెప్పించారు. దేవదాసి అతిజిజ్ఞాసాపూర్వకంగా విన్నది. జీవుడు భౌతికదేహం వదిలాక ప్రేతరూపంలో ఉంటాడట. అతడి కొడుకు లేక వారసుడు కర్మ సక్రమంగా నెరవేర్చి ప్రేతత్వం నుండి విముక్తి కలిగిస్తే ఆ జీవుడు అంగుష్ఠ ప్రమాణంలో వుండే వస్తురూపం ధరించి పదమూడవ నాటినుండి ప్రయాణం సాగిస్తూడట పదిహేను పట్టణాలలో మజిలీలుచేసి పంహారవది అతడి పుణ్య.పాపకర్మలననుసరించి ప్రాప్తించే లోకం చేరి పితృరూపం పొందుతాడట. భౌతిక దేహం వదిలిన ఏడాదికి జీవుడు పితృదేవతల్లో కలుస్తాడు. ఒకవేళ అతడికి కర్మచేసే దిక్కులేకపోతే ఆ జీవుడికి ప్రేతత్వం నుండి విముక్తిలేదట!
దేవదాసికి నవ్వు తెప్పించిన విషయం ఒకటుంది జీవుడు పదిహేను పట్టణాలలో మజిలీలు చేస్తాడు. ప్రతి మజిలీకి ఇక్కడ వీళ్ళు పెట్టాలి మాసికమని! ఆ మాసికంలో పెట్టే శ్రాద్ధం ఆ జీవుడికి దారిభత్యం! ఏ మాసికం వదిలినా జీవుడు తిండిలేక ఆకలిగొంటాడు! ఆ అంగుష్ట ప్రమాణుడు. కర్మలో చెప్పుల దానం, గొంగళి దానం, గోదానం ఇంకా చాలాదానాలు చెప్పారు. చెప్పులు దానమిస్తే ఆ జీవుని పాదాలకు వెడతాయి. గొంగళి ఆ జీవుడిని చలినుండు కాపాడుతుంది. దారిలో చీము రక్తాలతో ప్రవహించే వైతరణి అనే నది అడ్డమొస్తుందట. ఇక్కడ దానమిచ్చి గోవుతోక పట్టుకొని నది దాటేస్తాడట జీవుడు!
జీవుడు ఒకవేళ పాపి అయితే అతడిని యమదూతలు ఎన్నో నరకయాతనలు పెడతారట. ఆ అంగుష్ఠ ప్రమాణుడిని. ఏనుగులచేత తొక్కిస్తారట! ఇది మరీ నవ్వు తెప్పించింది దేవదాసికి. పాపి అయిన జీవునికి మరెన్నో చిత్రవిచిత్రమైన నరకయాతనలు వర్ణింపబడ్డాయందులో.
గరుడ పురాణం అతి శ్రద్ధగా విన్నవారిలో కృష్ణవేణి కూడా ఉంది. తండ్రి వైతరణి దాటడానికి ఆమె గోదానం ఇచ్చింది. ఆవిడ అదంతా నమ్మేయడంకాదు. సర్వంమిద్యంటూ దేవుడంటూ ఒకడున్నాడని ఒప్పుకోని తన కొడుకు తాము చేస్తే కర్మచేసి తమకు ప్రేతత్వం నుండి విముక్తి కలిగిస్తాడా అన్న సందేహం తీవ్రంగా పీడించసాగింది. బ్రతికుండగానే తను కష్టసుఖాలు విచారించని నిర్మోహి! చచ్చాక తల్లిదండ్రుల ఋణం తీర్చుకొంటాడని ఎలా ఆశించడం?
ఈ సందేహమే భీభత్సమైన ఒక దృశ్యం కల్పించిందామె మనః ఫలకంపైన, కొడుకు శ్రాద్ధ ఖర్మ చేయలేదు తాము ప్రేతత్వం నుండి విముక్తి లేక పరితపిస్తూ అంతరాళంలో తిరుగుతున్నారు!
"శ్రాద్ధం పెట్టనివారికి ప్రేతత్వం నుండి విముక్తి పొందడానికి మార్గాంతరం లేదా?" కృష్ణవేణి ప్రశ్నించింది.
"వారసులూ, కొడుకులూ లేని పక్షంలో, మరణానంతరం ప్రేతత్వం పొందకుండా జీవప్రాయశ్చిత్తమని ఒకటి శాస్త్రాలలో చెప్పారు. బ్రతికుండగానే తన శ్రాద్ధం తాను పెట్టుకోవడమన్నమాట!" చెప్పాడు బ్రాహ్మణుడు.
"విపులంగా చెప్పండి, అదేమిటో."
"మీకెందుకు, తల్లీ? రత్నంలాంటి కొడుకున్నాడు."
కృష్ణవేణి నోరు మూతబడింది!
13
ఆరోజు పొరుగూరికి పనిమీద వెళ్ళిన సూర్యదేవులు ఒక వార్తను తీసుకువచ్చారు. అది అందరినీ ఆశ్చర్య విభ్రమాలకులోను చేసింది.
ఆ ఊరి కరణం కృష్ణవేణి భర్తకు పినతండ్రి కొడుకు. అతడికి ముగ్గురు కొడుకులు. మధ్యవాడు రమణారావు. యిరవై యిరవై ఒకటి ఏళ్ళవాడు పెద్దచదువులు చదివించే స్తోమత తండ్రికి వున్నా అతడికి చదువు సరిగ్గా అంటలేదు. మెట్రిక్ అనిపించుకొని తండ్రివద్ద కరణీకం లెక్కలు నేర్చుకొంటూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఇంటి దగ్గరే అతడిని దత్తత చేసుకొంటానని కృష్ణవేణి కబురుచేసిందట!
"ఇదేం విడ్డూరం? చెట్టంతకొడుకు వుండగా ఈ దత్తతేమిటి?" విస్తుపోయింది శ్రీలక్ష్మి.
"విన్నవాళ్ళు అదే అడుగుతున్నారు. తనకు కొడుకే లేడనుకొంటుందట! దత్తు విషయం భార్గవుడికి వ్రాస్తే, ఆస్తిమీద తనకు వ్యామోహం లేదని, ఎవరిని దత్తుచేసుకొన్నా, ఎవరికి ఆస్తి పంచిపెట్టినా తన అడ్డు అభ్యంతరం లేవని వ్రాశాడట."
"అది సరే. కొడుకు, కష్టసుఖాలు విచారించని వాడేకానీ! అయినా ఇప్పుడు దత్తు చేసుకోవలసినంత అవసరం ఏం కలిగింది?"
"కొడుకు బ్రతికుండగా ఎంత ఉపయోగపడ్డాడో చచ్చాక కూడా అంతేనని నిర్ణయించుకొందట లోకరీతితప్పిన వాడు చస్తే తమకు కర్మచేస్తాడని నమ్మకం లేదట అందుకని ఈ దత్తు చేసుకోవడం."
"కృష్ణవేణి వదినను తిక్కపట్టినట్లుంది లేకపోతే ఈ ఆలోచనేమిటి? విన్నవాళ్ళు నవ్విపోతారు. భార్గవుడు ఏనాటికైనా మారవచ్చు అప్పుడు అతడి గతేమిటి? ఇది అన్నగారికి కూడా సమ్మతమేనా?"
"అక్క పట్టుదల ముందు బావ ఇష్టాఇష్టాలు ఏం నిలుస్తాయి? ఆ సంగతి మనకు తెలియందేముంది?"
"అక్క పట్టుదల ముందు బావ ఇష్టాయిష్టాలు ఏం నిలుస్తాయి? ఆ సంగతి మనకు తెలియందేముంది?"
ఇది మంచిపని కాదని అక్కకు నచ్చచెప్పడానికి అక్కగారి ఊరువెళ్ళారు సూర్యదేవులు.
"ఈ ఆలోచనెలా కలిగిందక్కా?"
