Previous Page Next Page 
అగ్ని కెరటాలు పేజి 34


    "ఏమయ్యా! ఇల్లాలిని ఏడిపించుకు తినటం వల్ల నీకు మనశ్సాంతి వుంటుందా? స్త్రీ కన్నీళ్లు పెట్టనిచోట దేవత లుంటారని పెద్దవాళ్లు చెప్పగా వినలేదా?"

     "నా మనసెరిగి నడుచుకుంటే  నేనామెను ఎందుకంటాను? ఇన్నాళ్ళ కాపురంలో నాకెక్కడ  కోపం వస్తుందో తను తెలుసుకోనక్కరలేదా?"

    అతడి వాదనలో పురుషాహంకారం ప్రస్పుటంగా కనిపిస్తూంటే మండిపోయింది హరితకు.

    "ఎంతసేపు మీకు మీ మనసు, మీ కోపం సంగతి తప్ప ఆమె మనసు సంగతి ఆమె బాధ సంగతి మీకేం పట్టలేదన్నమాట. భార్య భర్తలంటే బానిసా యజమాని సంబంధం కాదండీ. ఒకరికి ఒకరు ఇచ్చుకోవడం, ఒకరి తప్పులు ఒకరు క్షమించుకోవడం, దాంపత్యాన్ని మధురంగా మారుస్తాయి ప్రమీల ఏం చేసినా తప్పు, మీరేం చేసినా తప్పు కాదు  అనుకొంటే అది మీ పురుషాహంకారం తప్ప ఇంకేం కాదు!"

    "నీ ప్రవర్తన ఇలాగే వుండి ఆమెను హింసిస్తూంటే వరకట్నపు వేధింపు చట్టం క్రింద నిన్ను అరెస్టు చేయిస్తాం! ఉద్యోగం ఊడగొట్టింస్తాం! ఇంతకు ఇంత అనుభవించేట్టు చేస్తాం. ఆమె ఒంటిమీద దెబ్బ పడిందని తెలిసిందా జాగ్రత్త!"

    కాని, ఈ బెదిరింపులేవీ అతడిమీద పనిచేయలేదని రెండు రోజుల తరువాత జరిగిన సంఘటన చెప్పింది.

     రాత్రి తొమ్మిది గంటల తరువాత చుట్టు ప్రక్కల ఇళ్లవాళ్ళంతా భోజనాలు చేసి పడుకోబోతున్న వేళ.

     "అమ్మోయ్ చంపేస్తున్నాడుబాబోయ్ అమ్మోయ్" తలుపులు మూసిన ఇంట్లోనుంచి ప్రమీల కేకలూ, ఏడుపూ వినిపించాయి.

    "చేత్తో కాదు, కర్రతోనే దేనితోనో బాదుతున్నట్టుగా పెద్ద శబ్దం వినిపిస్తోంది దెబ్బల శబ్దం.

    "రోజు ఈ దెబ్బలూ, ఈ పెడబొబ్బలూ వినలేక పోతున్నాం బాబూ.  రోజూ ఇదే వరుస అయితే చుట్టు ప్రక్కల  సంసారాలుండేది కష్టమే"అని విసుక్కుంటున్నారు చుట్టుప్రక్కల వాళ్లు.

    హరిత  వాళ్లింటికి ఇంకా స్పష్టంగా వినిపించసాగింది. కొడుతున్న శబ్దం.  ప్రమీల గోల.
 
    "చంటిబిడ్డ తల్లి  అని కూడా లేకుండా ఎలా కొడుతున్నాడో - పశువు!" అని విసుక్కుంది హేమలత.
 
    "అసలేమిటో నేను చూసి వస్తానమ్మా!" హరిత బయల్దేరబోతుంటే తల్లి కోపంగా అడ్డు తగిలింది. "నీకేమైనా పిచ్చా? వెళ్లి ఏం చేస్తావు? భార్య భర్తల గొడవ మధ్యకు వెళ్లకూడదని ఇదివరకే చెప్పాను. అనవసరంగా జోక్యం చేసుకొన్నావు! మహిళా సంఘం వాళ్లని తీసుకు వచ్చి తిట్టించి, అతడింకా రెచ్చిపోయేలా చేశావు. దాని ఫలితం ఇప్పుడు ప్రమీల అనుభవిస్తూంది. పులినో, సింహాన్నో కవ్విస్తే ఏమౌతుందో - అదే జరుగుతూంది ఇప్పుడు?"

    "అయితే ఇంతమంది మనుషులం చుట్టూ వుండగా వాడు పెళ్లాన్ని కొట్టి చంపిచాల్సిందేనా?" ఆవేశంగా అడిగింది హరిత.

    "అయితే, నువ్వెళ్ళి ఏం చేస్తావు?"

    "ప్రమీలను మనింటికి తీసుకు వస్తాను!"

    "తీసుకొచ్చి?"

    "ఏ అనాధ శరణాలయంలోనో ఆమెకింత చోటు దొరక్కపోదు! అక్కడ ఏ వృత్తి విద్యనో నేర్చుకొని, తనూతనబిడ్డా బ్రతక్కపోదు!"

      "అలా అనుకుంటే ప్రతి పది ఇండ్లకీ ఒక ప్రమీల దొరుకుతుంది నీకు. మీ మహిళా సంస్కర్తలకు, వాళ్లందరినీ నింపడానికి ఈ శరణాలయాలు సరిపోవు! కొంచెం ఓపిక  పట్టి సంసారాలను  చక్కదిద్దుకొనే మార్గం యోచించాలి గాని త్రెంపుకొనేది ఏం విజ్ఞత? అయినా  ఆ ప్రమీలనే  అడుగు -నా అన్న వాళ్లందరికీ దూరమై ఒక అనాధలా ఏ శరణాలయంలోనో తలదాచుకొనే బ్రతుక్కంటే భర్తవద్ద ఈ బ్రతుకే మెరుగు అంటుందో లేదో?  నీవన్నీ  ఆచరణ సాధ్యం కాని ఆలోచనలు హరితా!"

     "ఎందుకమ్మా నన్ను అడ్డగిస్తావు. తరువాత సంగతి ఇప్పుడు చర్చించడం అనవసరం. ప్రస్తుతం ప్రమీల ను రక్షించాల్సిన బాధ్యత సాటి మనిషిగా మనకుంది. ఇది మన సాంఘిక బాధ్యత."

    "ఈ రాత్రి రక్షించి మనింట్లో వుంచుతావు. తరువాత? మగడి దగ్గరి కెళ్లాల్సిందే కదా? ఇంతకు ఇంతా ప్రతీకారం చూపుతాడు కదా ఆ మగడు? అందుకే భార్యా భర్తల తగాదాలో జోక్యం చేసుకోకూడదు. అంత దుర్మార్గుడు నిన్ను తిట్టడని ఏమిటి? అనవసరంగా పరువు పోగొట్టుకోవడం తప్పితే!"

    ఈ రాత్రి వెళ్లి రక్షించలేకపోయినా, రేపైనా ఆ నరకకూపం నుండి ప్రమీలను బయటికి లాగాలన్న ఆలోచనతో అప్పటికి విరమించుకొంది  హరిత. కాని, ఆ రాత్రంతా ప్రమీల విముక్తి గురించే ఆలోచిస్తూ నిద్రకు దూరమైంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS