Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 34

    ఈ లోకంలో దేనిమీదయినా, ఎవరిమీదయినా ఏదో విధంగా  ఏదో నెపంతో  తిరుగుబాటు చేస్తూనే వుంటారు. విమర్శలు ఉంటూనేవుంటాయి. ఒకరికోసం  మనం తినడంలేదు. గుడ్డ కట్టడంలేదు.

    అనే వాళ్ళ  నోళ్ళని  అరికట్టలేం.

    నేను మహాప్రస్థానం  రాసిన రోజుల్లో అది 'కవిత్వం కాదు, నినాదం' అన్నారు. ఇరవై సంవత్సరాల తర్వాత దానిని  కవిత్వంగా  అంగీకరించారు. కల్లోలం పెరిగిన కొద్దీ దూరం తగ్గిపోతుంది. ఇది ఈనాటి వాస్తవికత.

    పైగా సినిమాల్లో నేను ఎక్కువగా  రాస్తున్నవి పాటలే. పాటల రూపంలో వచ్చే కవిత్వం  కూడా ప్రజలకు త్వరగా  అందుతుంది.

    మార్పు  దేనికయినా, ఎప్పటికయినా  తప్పదు. సినిమాల ద్వారా కూడా ప్రజల్లో  మంచి మార్పు తీసుకురావచ్చని  నా ఉద్దేశం. చాలా మందికి సినిమా అనేసరికి 'అవినీతి' అని ఒక అభిప్రాయం వుంది.

    ఈ అవినీతి, అన్యాయం ఎందులోలేదు ? అవినీతి, లంచగొండితనం, ఆశ్రిత పక్షపాతం మన కళ్ళముందు నాట్యం  చెయ్యడం  మనం రోజూ చూస్తూనే వున్నాం.

    ఎందరెందరు  ఎన్నెన్ని  విధాలుగా మోసపోయారో, మోసపోతున్నారో చెప్పాలంటే  చేట భారతమే అవుతుంది.

    ఇంత జరుగుతున్నా  మన కళ్ళ ఎదుట  కనబడుతున్న  కఠోరసత్యాల జోలికి మాత్రం ఎవరూ పోరు.

    ఎవరో ఏదో అనుకుంటున్నారానీ లేక అంటున్నారనీ  మనం  అనుకుంటే బ్రతకలేం  సరోజా!

    ఒకనాడు  నేను "ఫిలిం ప్రపంచం ఫిల్తీ" అన్నాను. కొందరికి కోపం కూడా వచ్చింది.

    మరి ఇలాంటి ఫీల్డులో  ఎందుకున్నానని అడగవచ్చు. అది సబబే. ఈ పరిశ్రమని  కాదు_ఈ ఫిల్తును ప్రక్షాళన చెయ్యగలనన్న  నమ్మకం ఏ కొంచెమో  ఇంకా నాలో మిగిలివుంది.

    నాలాగే  ఆవేదన  పడుతున్న వాళ్ళూ  ఇంకా కొద్దిమంది వున్నారని కూడా నాలు తెలుసు. ఈ వ్యవస్థ ఇలాగే వుండిపోదనీ, దీన్ని  మార్చగలం అని, నేనూ, వాళ్ళూ కూడా నమ్ముతుండడం  వల్లనే  ఇంకా ఈ ఫీల్డులో వున్నాను.

    అది కూడా చూసేస్తాను. తర్వాత మనం విశాఖపట్నం వెళ్ళిపోదా అక్కడ సముద్రపుటొడ్డున  ఒక చిన్న  స్థలం కొంటాను. అందులో చిన్న కుటీరం కట్టుకుందాం. దానికె_'నిరీశ్వశ్రమం' అని పేరు పెడతాను.

    మన పిల్లల్ని అక్కడే చదివించుదాం. విశాఖలో  స్థలం  దొరికితే  సంతోషం. లేక విశాఖకి  కొద్ది దూరంలో  దొరికినా  కారు కొని, వాళ్ళని కార్లోనే స్కూలుకి పంపుదాం.

    మన రిటైర్డ్ లైఫ్ ని నేను పుట్టిన  విశాఖలోనే  హాయిగా  గడుపుదాం. మనకెందుకీ అరవదేశం? ఉన్నంత కాలం ఉన్నాం చాలు. చలసాని ప్రసాద్ నాకు సముద్రపు ఒడ్డున  స్థలం చూస్తానని, తీసుకుందామని చెప్పాడు. మనం అక్కడికి పోదాం.

    నేను హాయిగా  నీ రక్షణలో వుండి, రాయదలచుకున్నవి రాస్తాను. నేను రాయవలసినవి చాలా వున్నాయి.

    నా జీవితంలో చివరి  కోరికకూడా అదే. విశాఖలోనే  సెటిల్ అవ్వాలి. ఈ విశాల విశ్వంలోని  విశాఖపట్నంలో  నేను పుట్టాను. విశాఖపట్నాన్ని  కౌగిలించుకోవడం అంటే విశాఖ విశ్వాసాన్ని  నా అక్కున చేర్చుకోవడమనే  నా భావన.

    విశాఖపట్నం  ఎప్పుడు  పుట్టిందో  నాకు తెలియదు. కానీ, నేను మాత్రం 1910 లో  విశాఖలో  పుట్టాను. అప్పటినుండి  నేనూ, విశాఖపట్నం కలిసే పెరుగుతూ వచ్చాం. నేనే విశాఖని  దూరం చేసుకున్నాను. అయినా విశాఖ జ్ఞాపకాలని మాత్రం నేను మరచిపోలేదు.

    విశాఖపట్నంలో హార్బర్  వచ్చినప్పుడే  నాకు యౌవనం వచ్చింది. నాకు బాగా జ్ఞాపకం. నాకంటే ముందుగానే పిచ్చాసుపత్రి వెలిసింది.
    అసలు  అందరూ చూసే విశాఖపట్నం  కాదు నాకు కనిపించేది. నా విశాఖపట్నం వేరు. మా మేడ ఎక్కితే సముద్రం కనిపించేది.

    నా కవిత్వానికి సముద్రం ఆవేశం.

    నా విశాఖ  జ్ఞాపకాలలో కొన్ని భయంకరమైన సంఘటనలున్నా, మహదానందం అనుభవించిన క్షణాలు కూడా అనేకం వున్నాయి.

    యారాడ  కొండమీద  ఒంటరిగా  నిలబడి  ఒక్కోరోజు  ఒక్కోరకమైన విశాఖపట్నాన్ని  చూసేవాడిని.

    నువ్వు కూడా విజయనగరం  పిల్లవేగా?" అని అడిగారు.

    అంతవరకూ  వారి మాటలలో  మునిగిపోయిన  నేను ఉలకలేదు, పలకలేదు.

    "ఏమిటాలోచిస్తున్నావు  సరోజా?" అని అడిగారు.

    "ఏం లేదు_కానీ ఎక్కడి నుండి వచ్చారు? 70 నుండి 60 కి అక్కడి నుండి 10కి...మళ్ళీ అలా అలా వాయువేగ మనోవేగాలతో  పయనిస్తున్నారే! షష్టిపూర్తితో  ఆవరించిన ఆవేశం  ఇంకా తగ్గలేదా?

    విశేషాలు  చెప్పమంటే  మీ లోకంలో  మీరు రౌండ్ కొట్టేసి  వచ్చేశారు. అయ్యబాబోయ్_ఏమిటండి  మీ ఆవేశం? ఒళ్ళంతా  గగుర్పొడుస్తోంది" అన్నాను.

    "సరేకానీ_నేనడిగిన  దానికి  సమాధానం చెప్పు. విశాఖపట్నానికి మకాం మార్చేదాం, వస్తారా?" అని అడిగారు.

    "ఏమిటా అర్ధంలేని ప్రశ్న ? మీరు లేకుండా ఇక్కడ నాకు మాత్రం ఏమిటి పని? మీరెక్కడ వుంటే  మీతోపాటు నేనూ అక్కడే  వుంటాను. కానీ విశాఖ సన్మానం విషయాలు చెబుదురూ" అన్నాను.

    చాలా  విషయాలు చెప్పారు. ఆశ్చర్యపోయాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS