Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 35


                                         గణపతి

    ఆరోజు అమరావతీ నగరంలో దేవతలందరూ సమావేశమైనారు. "పూజాసమయాలలో పుణ్యవ్రతాలలో ప్రథమపూజ ఎవరికి చేయాలి? అందరికంటే ముందుగా అగ్రపూజ అందుకోవటానికి అర్హుడెవరు?" అని దేవతలందరూ ఆలోచనలు మొదలుపెట్టారు. ఎంతసేపటికి అగ్రపూజకు అర్హుణ్ణి నిర్ణయించుకోవటంలో అమరులమధ్య ఐక్యభావం కుదరలేదు. నాయకులందరూ ఎవరికివారు అగ్రపూజకు తామే తగినవాళ్లమని భావించారు. అందువల్ల ఆ సమస్య పరిష్కారం కాలేదు.
    దేవతలందరూ ఈ వివాదం తీర్చుకోవటం కోసం బ్రహ్మ దగ్గరకు బయలుదేరారు. సత్యలోకంలో చతుర్ముఖుడు సరస్వతీదేవితో కొలువుతీర్చి ఉన్నాడు. దేవతలంతా భక్తి పూర్వకంగా తాతగారి ముందు చేతులు కట్టుకొని నిలిచారు.
    దేవగురువు బృహస్పతి బ్రహ్మదేవునితో తమ వివాదం విషయం వివరించి చెప్పాడు. దేవకోటిలో ప్రథమపూజ్యుడెవరో నిర్ణయించమని బ్రహ్మదేవుని ప్రార్థించాడు. వాణీ పతి కొంచెంసేపు ఆలోచించి "దేవతలారా! మీ అందరిలో ఏ మహామహుడు భూప్రదక్షిణం చేసి మునుముందుగా నా ముందు వచ్చి నిలుస్తాడో అతడే సర్వశ్రేష్ఠుడు అవుతాడు. ఆ మహానుభావుడికే అఖిల ప్రపంచం ప్రథమపూజ చేస్తుంది. ఇక మీ బలాబలాలు పరీక్షించు కొనండి" అని పలికాడు.
    బ్రహ్మదేవుని పలుకులు వినగానే దేవతలందరూ భూప్రదక్షిణానికై పరుగులు పెట్టారు, కొందరు వేల్పులు ఏనుగులెక్కి బయలుదేరారు. మరికొందరు పక్షులమీదా కొందరు పశువులమీదా అతివేగంగా ప్రయాణం అయినారు. ఈ పరుగు పందెంలో పాల్గొని ముందుగా భూప్రదక్షిణం ముగించి వచ్చి అగ్రపీఠం అలంకరించాలని అందరూ తహతహలాడుతూ వెళ్లారు.
    కాని ఒక్క మహానుభావుడు మాత్రం కిక్కురుమనకుండా బ్రహ్మ ముందు చేతులు కట్టుకొని అలాగే నిలబడి ఉన్నాడు. "ఏమి గణపతీ! పరుగుపందెంలో పాల్గొనటానికి నీవు బయలుదేరలేదేమి!" అని అతనిని అడిగాడు బ్రహ్మ. గణపతి తల వంచుకొని నేలచూపులు చూస్తూ "ఎలా బయలుదేరమంటావు తాతా! పరుగుపందెంలో పాల్గొనటమంటే మరి నా తరం అవుతుందా! నాకేమో ఈ ఉదరం కొంచెం పెద్దదాయె? కదిలినా మెదిలినా అంతులేని ఆయాసం వస్తుంది! ఇక నా వాహనం చూద్దామా ఈ ఎలుకపిల్ల! దీనిమీద బయలుదేరితే భూప్రదక్షిణం ఎప్పుడు చేస్తాను? ఎప్పటికి తిరిగి వస్తాను? మరి వాళ్లంతా వాయువేగ మనోవేగాలతో మంచి మంచి వాహనాలు ఎక్కివెళ్లారు. నాకు చిక్కిన మహావాహనం ఈ చిట్టెలుకేగదా! ఇది ఏం పరుగెత్తుతుంది? ఎంత శ్రమపడితే మాత్రం నాకు ఫలితం ఏముంటుంది? అందుకే ఆలోచిస్తున్నాను. ఏమి చేద్దామా?" అని అన్నాడు రొప్పుతూ.
    ఆ మాటలు విని సరస్వతి పకపక నవ్వుతూ "ఓరి పిచ్చి నాయనా? అందుకా అలా విచారిస్తున్నావు. అయితే భూప్రదక్షిణం అంటే భూమి చుట్టూ తిరిగిరావటమేనా? అంతకంటే విశేషమేమీ లేదూ? బుద్ధిబలంతో బాగా ఆలోచించి కార్యసాధనం చేసుకోవాలి గాని ఇలా మూతి ముడుచుకొని కూర్చుంటే ఏం లాభం? ఈ విధంగా గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటే నీకు ప్రథమ పూజ ఎలా ప్రాప్తిస్తుంది? దానికేదో తగిన ప్రయత్నం చేసుకోవాలి" అని పలికింది.
    గణపతి కొంచెంసేపు కళ్లుమూసుకొని ఏదో ఆలోచించాడు. అతనికి ఒక మంచి ఉపాయం తోచింది. వెంటనే అతడు చివాలున లేచి తన చిట్టెలుకమీద ఎక్కి కూర్చున్నాడు. సత్యలోకం నుంచి బయలుదేరి గబగబా కైలాస పర్వతం మీదికి చేరుకున్నాడు. వినాయకుడు సరాసరి పార్వతీదేవి ముందుకు వెళ్లి నిలబడి "అమ్మా అమ్మా నీవు తొందరగా వచ్చి ఒక్కమాటు నాన్న ప్రక్కన కూర్చో. నాకు కొంచెం పని ఉన్నది. రా తొందరగా, ఆలస్యం చేయకు. ఈ మంచి తరుణం మించిపోతే అవతల నాకు చాలా ఆశాభంగం కలుగుతుంది" అని బ్రతిమాలుకున్నాడు.
    అతని ఆర్భాటం చూడగానే పార్వతీదేవికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఆమె చిరునవ్వు నవ్వుతూ "ఏమి జరిగింది గణేశా! అంత తొందరపడుతున్నావు. అసలు సంగతి ఏమిటి! అని అడిగింది. గణపతి మరింత తొందరపడుతూ "నీకు పదివేల దండాలు. ముందు నీవు పదమ్మా! అన్ని సంగతులూ తరువాత చెబుతాను. నీవు తొందరగా వచ్చి నాన్నగారి ప్రక్కన కూర్చో! ఆయన ఆ ప్రక్కన ధ్యాననిమగ్నులై కూర్చున్నారు. మళ్లీ కళ్లు తెరచి లేచిపోకముందే నీవు వచ్చి కూర్చోవాలి. నాకు చాలా పని ఉన్నది." అని పలికాడు. గణపతి తల్లి చేతులు పట్టుకొని ఆమెను గబగబా తండ్రిముందుకు తీసుకొని వెళ్లాడు. పార్వతీదేవి వెండికొండమీద ధ్యానమగ్నుడై ఉన్న పరమేశ్వరుని ప్రక్కన ఆసీనురాలైనది.
    గణపతి మీది ఉత్తరీయం నడుముకు చుట్టుకొని భక్తి పూర్వకంగా పార్వతీ పరమేశ్వరుల ముందు వ్రాలి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ జగత్పితల చుట్టూ చకచకా ఏడుసార్లు ప్రదక్షిణం చేశాడు. మళ్ళీ ఒక్కమాటు తల్లికీ తండ్రికీ ప్రణామం చేశాడు. అదంతా చూచి ఆశ్చర్యపడుతున్న పార్వతీదేవితో "అమ్మా! నేను కొంచెం అత్యవసరమైన పనిమీద సత్యలోకం దాకా వెళుతున్నాను. మళ్లీ వచ్చి అన్ని సంగతులూ మీకు మనవి చేస్తాను." అంటూ ఎలుక మీద ఎక్కి బ్రహ్మలోకానికి ప్రయాణమై వెళ్లాడు గణపతి.
    కొంతకాలానికి గొప్ప గొప్ప వాహనాల మీద బయలుదేరి వెళ్లిన దేవతలందరూ భూప్రదక్షిణం పూర్తిచేసుకొని ఒక్కరొక్కరే బ్రహ్మలోకానికి చేరుకొన్నారు. అప్పటికే గణపతి బొజ్జ నిమురుకుంటూ బ్రహ్మదేవుడి ముందు కూర్చుండి ఉన్నాడు. అతనిని చూచి దేవతలందరూ లోలోపల నవ్వుకుంటున్నారు. "పాపం! ఈ గణపతి కదలలేనివాడు కావటంవల్ల పందెంజోలికి పోకుండా తాతయ్య దగ్గరే కూలబడి ఉన్నాడు" అనుకున్నారు తమలోతాము దేవతలు.
    బ్రహ్మదేవుడు పందెంలో పాల్గొన్న దేవతలందరినీ చూచి "వీరశేఖరులైన వేలుపులారా! ఈ వెనకయ్యను చూచి మీరందరూ వేళాకోళంగా నవ్వుకుంటున్నారు. కాని మీ అందరిలోనూ ఇతడే అధికుడైనాడు. ఈ గణపతి మీకంటే ముందుగానే భూప్రదక్షిణం ముగించుకొని వచ్చాడు. పందెంలో జయం పొందటం వల్ల ఇకనుంచీ ముల్లోకాలలో అన్ని చోట్లా గణపతికే ప్రథమపూజ జరగాలి. ఇది నా నిర్ణయం" అని పలికాడు.
    ఆ మాటలు విని దేవతలంతా ఆశ్చర్య మగ్నులైనారు. అందరికంటే ముందుగా ఎలుకమీద ఎక్కి ఆ బొజ్జయ్య అఖిల లోకాలూ ఎలా చుట్టివచ్చాడో ఎవ్వరికీ తెలియదు. అంతలో ఇంద్రుడు వినయంగా "తాతా! మరి తమరు చెప్పిన ప్రకారం ఈ గణపతి భూప్రదక్షిణం చేసి వచ్చాడు? అని మా అనుమానం." అని తన సందేహం బయటపెట్టాడు.
    బ్రహ్మదేవుడు తల ఊపుతూ "అవును! గణపతి నియమానుసారం నిస్సందేహంగా భూమండలాన్ని చుట్టివచ్చాడు. ఒక్క భూదేవినే కాదు పదునాల్గు లోకాల బ్రహ్మాండాన్ని ప్రదక్షిణం చేసి వచ్చాడు గణపతి. అదీ ఒక్కసారి కాదు. సమస్త జగత్తునూ ఏడు పర్యాయాలు చుట్టివచ్చాడు ఈ వినాయకుడు. ఆ విధంగా పరీక్షలో జయంపొంది ముందుగా వచ్చి నా ముందు కూర్చున్నాడు. అందుచేత మీలో ప్రథమ పూజకు అతడే అర్హుడైనాడు" అని పలికాడు.
    ఆ మాటలు వినగానే దేవతలందరూ ఒకరిముఖాలు ఒకరు చూచుకోవటం మొదలుపెట్టారు. "ఇది ఎలా జరిగింది? ఇంతపని ఈ గణపతికి ఎలా సాధ్యమైంది?" అని ఆశ్చర్యపడటం ప్రారంభించారు దేవతలు. వాళ్ల ఉద్దేశం గ్రహించాడు బ్రహ్మదేవుడు. ఆయన "దేవతలారా! ఆశ్చర్యపడకండి. మన గణపతి తన తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్వరులకు ప్రణామపూర్వకంగా ప్రదక్షిణం చేసి వచ్చాడు. ఒకమారు తల్లికి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినంత ఫలం ప్రసాదిస్తుంది. పార్వతీపరమేశ్వరులలో నిఖిలలోకాలు నిండి ఉండటంవల్ల వారికి ప్రదక్షిణ చేస్తే సర్వలోకాలను చుట్టివచ్చినట్లే అయింది. అందువల్ల అతడు అన్నమాట ప్రకారం జగతినంతా మునుముందుగా చుట్టివచ్చి జయం పొందాడు. మాతా పితలను పూజిస్తే ఇటువంటి మహాఫలమే కలుగుతుంది. ఇక నుంచీ ఈ గణపతికే సకలలోకాలూ సర్వసమయాలలో ప్రథమ పూజ సమర్పిస్తాయి. ఇది బ్రహ్మవాక్కు" అని పలికాడు బ్రహ్మదేవుడు.
    దేవతలందరూ గణపతి ముందు చేతులు మొక్కి సెలవు తీసుకున్నారు. వెంటనే గణపతి బ్రహ్మదేవునికి ప్రణామం చేసి తన విజయవార్త అమ్మకూ నాన్నకు చెప్పటంకోసం ఎలుకమీద ఎక్కి కైలాసానికి బయలుదేరాడు.

                                      *  *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS