ఆరుణి
అది వర్షాకాలం. ఆకాశం అంతా నీలిమేఘాలతో నిండి ఉన్నది. అప్పుడే చిరుచీకటి వ్యాపిస్తున్నది. కొంచెం సేపటిలో నింగినిండా ఉరుములూ మెరుపులూ క్రమ్ముకొన్న మేఘగర్జనలతో దశదిశలూ తల్లడిల్లి బ్రహ్మాండమైన కుంభవృష్టి కురియసాగింది. ఆకాశం చిల్లిపడినట్లు వర్షధారలు పడుతున్నవి. కొంతసేపటికి ధౌమ్యమహర్షి ఆశ్రమ ప్రాంతం అంతా జలమయం అయిపోయింది. ఆశ్రమం పొలాలన్నీ మునిగిపోయాయి.
ధౌమ్యమహర్షి అరణ్యమధ్యంలో ఆశ్రమం నిర్మించుకొని, అసంఖ్యాకమైన శిష్యకోటికి అన్నంపెట్టి చదువు నేర్పుతున్నాడు. శ్రద్ధాసక్తులతో జపతపాలుచేస్తూ ప్రియశిష్యుల చదువు సంధ్యలు చూస్తూ కాలం గడుపుతున్నాడు. ధౌమ్య మహర్షి ఆయన సమక్షంలో శిష్యులందరూ ఆనందంగా అన్ని విద్యలూ అభ్యసిస్తూ ఆశ్రమంలోని పర్ణశాలల్లో నివశిస్తూ ఉన్నారు.
ఆనాడు కురుస్తున్న పెనువానకు పర్ణశాలలన్నీ నేల గూలుతున్నవి. ఆశ్రమమంతా చెల్లాచెదరై పోయింది. అప్పుడు ధౌమ్య మహర్షి అన్నాడు : "అబ్బ! ఈమధ్య ఎప్పుడూ ఇంత పెద్ద వాన కురియలేదు. మన పొలాలన్నీ మునిగిపోయి ఉండాలి, ఆ చేని ప్రక్క కాలువకట్ట గట్టిగా లేకపోతే పంట అంతా నీళ్లపాలయి పోతుంది! అలా అయితే ఈ యేడు గిద్దెడు గింజలు కూడా మనకు దక్కవు. ఆశ్రమంలోని ఆబాలగోపాలమూ ఆకలితో పస్తులు చేయవలసి వస్తుంది. ఎలా ఉన్నదో ఏమో! ఎవరో ఒకరు అలా పొలంవైపు వెళ్లి చూచిరావాలి."
గురువుగారి మాటలు విని శిష్యులందరూ ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు. ఆ గాలివానలో చేనిదాకా వెళ్లిరావటానికి ఎవ్వరూ సిద్ధం కాలేదు. అంతలో ఒక శిష్యుడు చివాలున లేచి "నా కుటీరం అంతా కురుస్తున్నది! వెళ్లి చూచుకోవాలి. ఇల్లంతా నీళ్లతో నిండిపోయిందో ఏమో!" అని అంటూ గబగబా బయలుదేరి వెళ్ళాడు.
"నా కుటీరం వెనుక తడిక విరిగి పోయింది. అది కాస్తా ఏ ప్రక్కకి ఎగిరిపోయిందో వెదుక్కోవాలి!" అంటూ మరొకడు లేచి వెళ్లాడు. "నా నారబట్టలు బయట ఆరవేసి ఉన్నాయి. అవి నాల్గూ ఎటు కొట్టుకుపోయినాయో మరి! అంటూ ఇంకొకడు పరిగెత్తాడు. "నా చాప బయటపెట్టి వచ్చాను. దాని సంగతి ఎలా ఉన్నదో!" అంటూ వేరొక శిష్యుడు దారిపట్టాడు.
ఈ విధంగా ఒక్కొక్కడూ ఎవడి పనిమీద వాడు వెళ్లిపోయాడు. ఒక్క బాలుడు మాత్రం గురువుగారివైపు కన్నార్పకుండా చూస్తూ అలాగే కూర్చుండి ఉన్నాడు. వర్షం జోరుగా కురుస్తూనే ఉన్నది. ధౌమ్యమహర్షి అతనివంక చూచి, "ఏమి నాయనా! ఆరుణీ! నీవు ఒక్కడివే ఇక్కడ ఉన్నావేం నీ వస్తువులేవీ నీళ్ల పాలయ్యేవి లేవా?" అని అడిగాడు.
ఆరుణి చేతులు కట్టుకొని "గురుదేవా! మాకందరికీ గ్రాసం కల్పించే పొలం సంగతి ముందు చూడాలి. ఆ పంటంతా నీళ్లపాలైతే ఆశ్రమవాసులకు అన్నం లేకుండా పోతుంది. అందువల్ల అన్నిటికంటే ముందు ఆ పంట కాపాడుకోవటం అత్యవసరం. మరి అందుకు నన్ను ఏమి చేయమంటారో చెప్పండి.' అని వినయపూర్వకంగా వేడుకున్నాడు.
ఆరుణి మాటలు విని మహర్షి ఆలోచనామగ్నుడైనాడు. "వరద నీటితో పంటచేను మునిగిపోకుండా ఉండాలంటే గట్టుకు ఎక్కడా గండి పడకుండా చూడాలి. అయితే అది ఇప్పుడు ఎలా సాధ్యమౌతుంది. ఈ కుంభవృష్టిలో ఆ కష్టకార్యం ఎవరు నిర్వహిస్తారు." అనుకున్నాడు ధౌమ్య మహర్షి.
అంతలో ఆరుణి "గురుదేవా! తమ ఆజ్ఞ అయితే నేను ఇప్పుడే వెళ్ళి గట్లు తెగకుండా కట్టుదిట్టంచేసి వస్తాను. సెలవు ఇవ్వండి" అని ప్రార్థించాడు. మహర్షి అందుకు అంగీకరించాడు. ఆ వర్షంలో ఆరుణి గబగబా పొలంవైపు పరుగెత్తుకొని వెళ్ళాడు. మంటికీ మింటికీ ఏకధారగా వర్షం కురుస్తూంది.
అప్పటికే చేనిగట్టుకు ఒకచోట చిన్నగండి పడి ఉన్నది. ఆ గండి గుండా ప్రక్కన పారుతున్న కాలువ నీళ్లు అప్పుడప్పుడే పొలంలోనికి ప్రవేశిస్తున్నవి. దానికి అడ్డం వేయకపోతే తెల్లవారేసరికి పంట అంతా వరదపాలై పోతుంది. ఆశ్రమవాసులు ఏడాది పొడుగునా అన్నం లేకుండా అలమటించవలసివస్తుంది. "అమ్మయ్యో! అలా జరుగకూడదు. ఈ చిన్న గండి వల్ల అన్ని కష్టనష్టాలు కలగకూడదు." అనుకున్నాడు ఆరుణి.
ఇంకా వర్షం కురుస్తూనే ఉన్నది. ఆ వానలోనే అతడు వెంటనే గడ్డీ మట్టీ తెచ్చి గండికి అడ్డువేశాడు. కాని ప్రవాహం ఆగలేదు. ఆరుణి ఆ ప్రక్కన ఉన్న రాళ్ళూ రప్పలూ గడ్డీ గాదమూ తెచ్చి గండికి గట్టువేశాడు. కాని ప్రవాహవేగం తగ్గలేదు. ఎంత ప్రయత్నం చేసినా కాలువ నీళ్లు పంటపొలంలో ప్రవేశిస్తూనే ఉన్నాయి. కుంభవృష్టి కురుస్తూనే ఉన్నది.
అప్పుడు ఆరుణికి ఏమిచేయాలో తోచలేదు. "గురువుగారు పంట పొలం భద్రపరచుమని నన్ను పంపించారు. నేను తగుదునని తల ఊపించి వచ్చాను. మరి ఇప్పుడు నేను వర్షానికి తల ఒగ్గటమో, వర్షమే ముందు తలవంచటమో తేలిపోవాలి" అనుకున్నాడు ఆరుణి.
అతడు వెంటనే తానేవెళ్లి గండికి అడ్డంగా పడుకున్నాడు. రాళ్లూ రప్పలతో ఆగని ప్రవాహాన్ని ఆత్మదేహంతో అడ్డగించాడు ఆరుణి. జల ప్రవాహం ఆగిపోయింది. ఆరుణి అలా సజీవసేతువుగా ఆ జడివానలో పడుకొని ఉన్నాడు. క్రమంగా అర్ధరాత్రి అయింది. ఆరుణి అలాగే పొలం గండికి అడ్డం పడుకొని ఉన్నాడు. వాన జోరు కొంచెం తగ్గింది. తెలతెలవారుతున్నది. ఆరుణి అలాగే స్పృహతప్పి పడి ఉన్నాడు. ఆరుణి అదేవిధంగా అచంచలంగా పడి వున్నాడు. తెల్లవారింది. మెల్లగా వర్షం తగ్గిపోయింది.
ఆశ్రమంలో ధౌమ్యమహర్షి ఆరుణి రాకకోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు. రాత్రి అనగా వెళ్లిన ఆరుణి ఎంత సేపటికి ఇంటికి తిరిగిరాలేదు. ఆ ప్రొద్దున విద్యార్ధులంతా గురువుగారిముందు గుమిగూడారు. ధౌమ్యమహర్షి శిష్యులను చూచి "ఏడీ! ఆరుణి ఇంకా చేనిదగ్గరనుంచి రాలేదుగదూ" అని అడిగాడు.
ఒక శిష్యుడు పకపక నవ్వుతూ "ఆఁ! అసలే నిద్రముఖం వాడు! ఎక్కడో ఆగట్టు మీదనే నిశ్చింతగా నిద్రపోతూ వుంటాడు" అని పలికాడు. మరొకడు "అక్కడెందుకు పడుకుంటాడు! హాయిగా కుటీరంలో పడుకొని గుర్రుపెడుతూ ఉంటాడు" అన్నాడు. ఇంకొకడు "కాదు కాదు. వాడి కుటీరం గాలివానకి కూలిపోయిందిలే; వాడు ఏ ఊరో పారిపోయి ఉంటాడు" అని తన ఉద్దేశ్యం వెల్లడించాడు.
మహర్షి ఆ మాటలు వినిపించుకోలేదు. ఆయన మౌనంగా ఆశ్రమం ముందు కొంచెంసేపు నిలబడ్డాడు. వెంటనే గబగబా పొలం వైపు బయలుదేరాడు. శిష్యులందరూ గురువుగారిని వెంబడించారు. ధౌమ్యమహర్షి చేనిగట్టు దగ్గరకు వెళ్లాడు. ఆ చుట్టు ప్రక్కల ఎంత వెదికినా ఆరుణి కనబడలేదు. మహర్షి "ఆరుణీ! ఆరుణీ; ఎక్కడ ఉన్నావు నాయనా!" అని ఎలుగెత్తి పిలిచాడు. కాని సమాధానం రాలేదు.
ధౌమ్యమహర్షి పొలంచుట్టూ వెదకటం మొదలుపెట్టాడు. కొంతసేపటికి కాలువ గండికి అడ్డంగా పడివున్న ఆరుణి కనిపించాడు. ఆవిధంగా అచంచల కర్తవ్యనిష్ఠతో, కళ్లలో ప్రాణాలు పెట్టుకొని, కాలువకు అడ్డంగా పడుకొని ఉన్న శిష్యుణ్ణి చూడగానే మహర్షికి అంతులేని ఆశ్చర్యం కలిగింది. ఆరుణి గురుభక్తికి ఆయన కన్నులవెంట ఆనందబాష్పాలు స్రవించినవి.
ఆయన వెంటనే ఆరుణి దగ్గరకు వెళ్లి మెల్లగా అతనిని లేవదీశాడు. శిష్యుల సహాయంతో ఇంటికి తీసుకొని వెళ్లి ఎన్నో ఉపచారాలు చేశాడు. ఆరుణి కొంచెం తెప్పరిల్లి మెల్లగా కళ్లు తెరచాడు. మహర్షి అతని శరీరం అంతా శుభ్రంగా తుడిచాడు. మంటలముందు కూచోబెట్టి ఒళ్లంతా వెచ్చ వెచ్చగా కాచాడు. వేడివేడి ఆవుపాలు త్రాగించాడు. క్రమంగా ఆరుణి కోలుకున్నాడు.
ధౌమ్యమహర్షి ప్రేమపూర్వకంగా ప్రియశిష్యుడి శిరస్సు నిమురుతూ "నాయనా! ఆరుణీ! నీ గురుభక్తికీ, కార్యదీక్షకీ నేను మెచ్చుకుంటున్నాను. నీవు ప్రాణం ఒడ్డి పంటపొలం కాపాడావు. ఆశ్రమానికి అన్నదానం చేశావు. నీవు నా ఆశీర్వాద బలం వల్ల సర్వవిద్యావేత్తవవుతావు! నీవు సుఖంగా శాంతంగా జీవనయాత్ర గడుపుతావు. నీకు సమస్త సుఖాలు సమకూరుతాయి" అని ఆశీర్వదించాడు. ఆరుణి వినయంగా శిరస్సువంచి గురువుగారికి నమస్కరించాడు. ఆశ్రమవాసులందరూ ఆదర్శమూర్తులైన ఆ గురుశిష్యులవైపు చూస్తూ నిలబడ్డారు.
* * * *
