5. పూజా పుష్పాలు
నిర్మలమైన భక్తితో నిశ్చలమైన దీక్షతో పరమేశ్వరుని మెప్పించి ముక్తిగాంచిన భక్తాగ్రగణ్యుడు తిన్నడు. నిత్యశ్రద్ధతో నిరుపమత్యాగంతో పరమశివుని పూజించి ప్రత్యక్షం చేసికొన్న భక్తశిరోమణి తిన్నడు.
తిన్నడి తండ్రిపేరు నాథనాథుడు. తల్లిపేరు తందె. నాథనాథుడు ఉడుమూరును పాలించే శబరనాయకుడు. తెలుగుదేశంలోని పొత్తపినాడులో పేరుగాంచిన పెద్దపట్టణం ఉడుమూరు. నాథనాథుడి పరిపాలనలో ప్రజానీకం భోగభాగ్యాలతో శాంతి సౌఖ్యాలతో తూలదూగింది. శివభక్తుడైన నాథనాథుడికి పరమశివుని వరప్రసాదం వల్ల గుణవంతుడైన తిన్నడు కుమారుడై జన్మించాడు.
తిన్నడు చిన్నతనంలోనే కులవిద్యలన్నీ గ్రహించాడు. విలువిద్యలో గడితేరాడు. ఆటపాటలలో మేటియైనాడు. అతడు బాల్యం నుంచీ తండ్రితోపాటు పార్వతీపతిని పూజించేవాడు. తదేక దీక్షతో స్వామిముందు నిలచి ధ్యానం చేసేవాడు. కమ్మని కంఠంతో గంగాధరుడిమీద భక్తి గీతాలు పాడేవాడు. సంతోషపరవశుడై సదాశివుని ముందు చిందులు త్రొక్కేవాడు. ఈ విధంగా భక్తితత్పరుడై తండ్రికి తగిన కుమారుడైనాడు తిన్నడు.
ఒకనాడు తిన్నడు ధనుస్సూ బాణాలూ ధరించి తోడివారితో కూడి అరణ్యానికి వేటకు వెళ్ళాడు. కాననమంతా కలయదిరిగి క్రూర జంతువులను తరిమి తరిమి కొట్టాడు. శబరబాలకులు అరణ్యమంతా తిరిగి తిరిగి అలసిపోయారు. మధ్యాహ్నం కాగానే అందరూ ఒక చెట్టు నీడకు చేరుకొని హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు.
అంతలోనే ఒక అడవిపంది భయంకరంగా ఘుర్ఘురిస్తూ అక్కడికి వచ్చింది. దానిని చూడగానే తిన్నడి భుజాలు ఉప్పొంగినాయి. అతడు విల్లూ అంబులూ ధరించి ఆ వనవరాహాన్ని వెంబడించాడు. కాని అది వింటిదెబ్బకు అందకుండా దూర దూరాలకు పారిపోయింది. తిన్నడు దానిని వెన్నంటి తరుముతూ పరుగెత్తి వెళ్ళాడు. అది చెట్లచాటుగా గుట్టలమాటుగా సువర్ణముఖీ నదీతీరానికి పారిపోయింది. దానిని కొట్టి తీరాలనే పట్టుదలతో పరుగెత్తుతున్నాడు తిన్నడు. అడవిపంది అటూ ఇటూ తిరిగి ఒక్కమాటుగా ఎక్కడో మాయమైపోయింది. ఆ మధ్యాహ్నపు మండుటెండలో పరుగెత్తి పరుగెత్తి తిన్నడు చాలా అలసిపోయాడు. అతని ఒళ్ళంతా చెమటలు పట్టింది. నీడపట్టున సేదతీర్చుకుందామని ఒక జువ్వి చెట్టు క్రిందకు వెళ్ళాడు తిన్నడు.
ఆ జువ్వి చెట్టు నీడలో, ఆ సువర్ణముఖీ నదీతీరంలో ఒక చక్కని శివలింగం కన్నులవిందుగా కనిపించింది తిన్నడికి. ఆ శివలింగాన్ని చూడగానే అతనికి అపరిమితమైన ఆశ్చర్యం కలిగింది. తన పూర్వజన్మ పుణ్యం వల్లనే ఆ కానన మధ్యంలో గంగాధరుడు తనకు కనిపించాడని పొంగిపోయాడు తిన్నడు. పరమేశ్వరుని దర్శనం కోసమే తాను పందివెంట పరుగెత్తి వచ్చానని భావించాడు. అపారమైన ఆనందంతో సురుచిరమైన శివలింగాన్ని చూచి చూచి పరవశుడైనాడు తిన్నడు. వెంటనే అతడు పరమశివునికి ప్రదక్షిణం చేసి ప్రణామం కావించాడు. పరమభక్తితో పార్వతీపతికి చేతులుమోడ్చి ఈ విధంగా ప్రార్థించాడు.
"ఓసామీ! ఇది యేమి! ఈ కొండరాళ్ళ మధ్య కూరుచున్నావేమయ్యా! ఈ నట్టడవిలో ఈ నదీతీరంలో చెట్టునీడలో ఒంటరిగా ఇలా ఉన్నావేమయ్యా! అయ్యయ్యో! నా తండ్రీ! ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, నిరాధారంగా ఇక్కడ ఎలా నిలచావయ్యా! సింహాలూ, పులులూ చెరలాడుతూ ఉండే ఈ కీకారణ్యంలో ఏకాంతవాసం ఎలా చేస్తున్నావయ్యా! పార్వతీపతీ! నీకు ఆకలి దప్పికలు లేవా? మరి కూడూ నీళ్లూ ఏ చుట్టాలు తెచ్చిపెట్టుతారయ్యా! కొండంత బలగమున్నవాడవు! నీకు కారడవిలో కాపురం చేసేగతి ఏమి పట్టినదయ్యా! రా సామీ! మా ఇంటికి వెళదాము రా. అక్కడ నీకు కావలసినంతమంది సేవకులున్నారు. ఆవుపాలూ, గడ్డ పెరుగూ, మంచి జున్నూ, కమ్మని వెన్నా, పుట్టతేనే, తీయని పాయసమూ తిన్నంత తెచ్చిపెడతాను. హాయిగా ఆరగించవచ్చు. రా సామీ!" అన్నాడు తిన్నడు. కాని ఎంత ప్రార్థించినా పరమశివుడు బదులు పలుకలేదు.
తిన్నడు గద్గదకంఠంతో "ఏమిటి సామీ! ఎంత పిలిచినా పలుకవుగదూ! నా వెంట మా ఇంటికి రావుగదూ! అయితే నేనూ ఇక్కడే ఉంటాను. నా పెన్నిధివైన నీ సన్నిధిలోనే ఆజన్మాంతం హాయిగా ఉంటాను. ఇక నాకు తల్లివైనా నీవే! తండ్రివైనా నీవే! నిన్నే చూస్తూ నీ ధ్యానమే చేస్తూ ఇక్కడే కూర్చుంటాను." అని పరమశివుని ముందు పద్మాసనం వేసి కూర్చున్నాడు.
అంతలోనే అతనిని వెదుకుతూ శబరబాలకులు అక్కడికి వచ్చారు. జువ్విచెట్టు క్రింద శివలింగం ముందు కూర్చుని కన్నీరు కారుస్తూ తదేక దృష్టితో పరమేశ్వరుణ్ణి పరికిస్తున్న తిన్నడు వారికి కనిపించాడు. ఆ విచిత్రమైన పనికి శబరబాలకులు విస్మయపడుతూ "ఏమిరా తిన్నా! నీకేమైనా మతిపోయిందా? ఆ పాడుపంది వెంట పరుగెత్తివచ్చి ఈ చెట్టుక్రింద చేరి కూరుచున్నావా? ఎంతసేపైందిరా నీవు వచ్చీ? నీకోసం మేము అరణ్యమంతా వెదికి వెదికి విసుగెత్తిపోయాము. ఇప్పటికి దొరికావు మహానుభావుడివి! రా నాయనా! ఇకనైనా లేచిరా! ఇంటికి వెళదాము." అని పిలిచారు.
కాని తిన్నడు వారిని కన్నెత్తి చూడలేదు. పన్నెత్తి పలకరించలేదు. అతడు అలాగే దీనంగా శివలింగాన్ని అవలోకిస్తున్నాడు. అది చూచి అతని స్నేహితులు "పలుకవేం రా తిన్నా! నిన్ను ఇంటికి రమ్మని అడుగుతుంటే అలా పిచ్చి చూపులు చూస్తావేం? రా. రా. ప్రొద్దుపోతున్నది. ఇంటికి వెళదాము. రా." అన్నారు. తిన్నడు మాత్రం లేవలేదు. అతడు రెండు చేతులతో శివలింగాన్ని గాఢంగా కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టటం ప్రారంభించాడు. భక్తి పరవశుడైన తిన్నణ్ణి చూచి నిర్విణ్ణులైనారు స్నేహితులు.
తిన్నడు "అమ్మయ్యో! నా సామిని ఇక్కడ ఒంటరిగా విడిచి నేను ఇంటికి వచ్చి కూర్చుంటానా? రాను. రాను. ఎవరు పిలిచినా ఎంత బలవంతం చేసినా నేను మాత్రం ఇంటికి రాను. నేను లేకపోతే ఇక్కడ నా సామికి కూడూ నీళ్లూ ఎవరు తెచ్చి యిస్తారు! ఈ అడవిలో తోడునీడగా ఎవరుంటారు? అందువల్ల నేను ఇక్కడే ఉండి చేతులారా నా తండ్రిని సేవించుకుంటాను. మీరు వెళ్లిపొండి. అనవసరంగా నన్ను వేధించకండి." అని వాళ్లకు ఖండితంగా చెప్పాడు. మార్గాంతరం లేక శబరకుమారులు మౌనంగా ఇళ్లకు వెళ్ళిపోయారు.
అంతలోనే తిన్నడు లేచి నిలబడి "అయ్యయ్యో! నా తండ్రీ! ఇంతదాకా నేను ఆలోచించనేలేదు. నీవు అన్నం నీళ్లూ లేక ఎంత అలమటిస్తున్నావో? ఒక్క క్షణం ఆగు. ఇప్పుడే వెళ్లి మంచి మాంసం కొట్టుకు వస్తాను. నోటినిండా ఏటినీళ్లు తెచ్చి స్నానం చేయిస్తాను." అని అడవిలోకి వెళ్లాడు.
