Previous Page Next Page 
ప్రతీకారం పేజి 35


    ఆ పెద్దమనిషి వెళ్ళిపోతున్న అంజిని రెప్పవాల్చకుండా చూస్తూ నిలబడ్డాడు. అంజి నడక చూస్తే తన కూతుర్ని లేవదీసుకుపోతున్నవాడు వీడు కాదేమోనని అనుమానం కలిగింది.
    "మనుషుల్ని పోలిన మనుషులుంటారంటారు" గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు.

                                            27

    అక్టోబరు ఇరవై రెండవతేదీ. వెలుగుతున్న దీపం మీద బుట్ట బోర్లించినట్టు ఆకాశంలో వెలుగు మందగించింది. సంధ్య చీకట్లు కమ్ముకుంటున్నాయి.
    రవీ, ఇందిర ఆ దుర్ఘటన జరిగిన చెరువు గట్టుమీద కూర్చుని ఉన్నారు. రవి ముఖం గంభీరంగా ఉంది. శరీరంలోని నరాలన్నీ బిగదీసిన వీణ తీగల్లా ఉన్నాయి. ఒక్కొక్క కంకరరాయి ఏరితీస్తూ నీళ్ళలోకి విసురుతున్నాడు. సుళ్ళు తిరుగుతున్న నీళ్ళలోకి చూస్తున్నాడు యాంత్రికంగా.
    "రవీ! నువ్వు పాపను ఒడ్డుకు చేర్చావు. ఆ సమయంలో ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. అందులో ఏ ఒక్కరు బోటు బోల్తాపడటం చూడకపోవటం, చూసీ చూడనట్టే వెళ్ళిపోవడం ఆశ్చర్యంగా వుంది. రజని కేకలు పెట్టలేదా? పెట్టిన పిల్ల మునిగిపోయిన హడావిడిలో ఎవరూ వినలేదా?" అంటూ ప్రశ్నలు వేయసాగింది ఇందిర.
    రవి ఓ క్షణం ఆ ముఖంలోకి తీక్షణంగా చూశాడు. చివుక్కుని లేచి నిల్చున్నాడు.
    "నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా?" అని విసురుగా లేవబోయాడు.
    ఇందిర అతని చెయ్యి పట్టుకుంది. రవి చెయ్యి విడిపించుకున్నాడు.
    "నేను నిన్ను అనుమానిస్తున్నానని ఎలా అనుకుంటున్నావు రవి? నేను లాయర్ని. కోర్టులో ఇలాంటి ప్రశ్నల్ని ఎదుర్కొంటూ వాదించాలి. అందుకే నేను కొన్ని ప్రశ్నలు వెయ్యాలనుకున్నాను. నిజంగా నాకు నీమీద అనుమానమే ఉంటే ఈ సమయంలో ఇక్కడ ఉండేదాన్నే కాదు. అసలు ఈ కేసు తీసుకునేదాన్నే కాదు" అంది ఇందిర బాధపడుతూ.
    "నిజంగానే నేను రజనీని హత్య చేశాను. నువ్వీ కేసులో వాదించడం అనవసరం. నేను హంతకుడ్ని. నామానాన నన్ను వదిలేయ్! నీకు పుణ్యం వుంటుంది" ఉద్రేకంతో అన్నాడు రవి.
    
                                         *  *  *

    "ఆఁ! గెలుస్తాను. గెల్చి తీరతాను" ధృడంగా అన్నది ఇందిర.
    "అసంభవం"
    ఇందిర చివ్వున తలెత్తి తల్లి ముఖంలోకి చూసింది.
    "ఎలా గెలుస్తావు? బాల్ - బేబీ కథ నిజమనే అనుకుంటున్నావా? ఆ కథ విన్న వాళ్ళంతా నవ్వుతున్నారు."
    "అనుకోవడం ఏమిటి? అది నిజమే! నవ్వినా నాపచేనే పండుతుంది చూస్తూ వుండు."
    "నిజం కాదు. నిజమే అయితే సాక్షులు ఎందుకు రావడం లేదు? రేడియో ఎనౌన్స్ మెంటు కూడా ఇస్తున్నారుగా!"
    "అదే అర్థం కావడంలేదు. ఆ సమయంలో మరో స్త్రీ కూడా వున్నదట. ఆమె రవిని దీవించిందట కూడా!" ఇందిర తనను తానే ప్రశ్నించుకుంటున్నట్టు అన్నది.
    రాధాదేవి ముఖకవళికలు మారిపోతున్నాయి. లోపల చెలరేగుతున్న సంచలనాన్ని అణచుకుంటూ "మరి ఆ స్త్రీ అయినా కనీసం ఎందుకు సాక్ష్యం ఇవ్వడానికి రాలేదు? అంతా అబద్ధం! కట్టు కథ. నువ్వు అనవసరంగా నమ్ముతున్నావు. హంతకుడు హత్య చేశానని ఒప్పుకుంటాడా?" అన్నది రాధాదేవి.
    "ఆమె తప్పక వస్తుందనే నమ్మకం నాకుంది. రోజూ రేడియో ఎనౌన్స్ మెంటు ఇస్తూనే వున్నాం! ఇంకా వారం రోజులు గడువుంది. ఆమె తప్పక వింటుంది! తప్పక వస్తుంది! రాకుండా వుండలేదు. వచ్చి తీరుతుంది" పిచ్చిగా అన్న మాటల్నే మళ్ళీ మళ్ళీ అనసాగింది ఇందిర. నూతిలోకి జారిపోతున్నవాడు జారుడు మెట్టు కోసం వెతుకుతున్నట్టు.
    "రాదు. ఆవిడ రాదు!"
    ఇందిర తల్లి ముఖంలోకి లోతుగా చూసింది.
    రాధాదేవి గిర్రున తిరిగి బయటికి వెళ్ళిపోయింది.
    ఇందిర 'లా' పుస్తకాలు ముందు వేసుకొని కూర్చుంది. బుర్ర పనిచెయ్యడం లేదు. మళ్ళీ మళ్ళీ తల్లి మాటలే చెవుల్లో విన్పిస్తున్నాయి. ఆమె రాదా? నిజంగా రాకపోతే ఒక్కరోజైనా రేడియో ఎనౌన్స్ మెంటు విని వుండదా? హత్య కేసు అనవసరపు గొడవ తనకెందుకని ఊరుకుందేమో? అదే నిజమైతే? ఆమె రాకపోతే? తన రవి...ఉరికంబం ఎక్కాల్సిందేనా? రెండు చేతుల్తో తల పట్టుకుని కూర్చుండిపోయింది ఇందిర.
    రాధాదేవి మనసులో వాత్సల్యం-ప్రతీకార వాంఛ- రెండూ బలిసిన ఆంబోతుల్లా కుమ్ములాడుతున్నాయి.
    తను ఇంతకాలం ఎవర్ని చూసుకుంటూ బ్రతికింది. ఎవరికోసం బ్రతికింది? ఎవరి చుట్టూ తన జీవితాన్ని పెనవేసుకుని బ్రతికింది? ఎవరిమీద ఆశల్ని పెంచుకుంది? ఇందిర కోసం...తన బిడ్డకోసం...తన రక్తమాంసాలు పంచుకుని పుట్టిన తన సంతానం కోసం... తన భర్త ప్రతిరూపం కోసం... కాని ఈనాడు తను చేస్తున్నదేమిటి? తన బిడ్డ జీవితాన్ని తెలిసి తెలిసి నరకప్రాయం చేస్తూంది. తను ఆడది కాదా? తల్లి మనసు తనలో లేదా? తన బిడ్డ జీవితాన్ని తనే చేజేతులా నలిపివేస్తుంది?
    భర్త ఫోటోకేసి దీనంగా చూసింది.
    అదే దృశ్యం కళ్ళముందు...అదే గావుకేక...ఆర్తనాదం...వికటాట్టహాసం చెవుల్లో...
    ప్రేమకంటే ద్వేషం బలమైనది. ప్రతీకార జ్వాల ఆమెలోని మమతను మాడ్చివేసింది. ఆమె కళ్ళు కణకణ లాడుతున్నాయి. కణతలు అదురుతున్నాయి. ఆమె కళ్ళలో చెమ్మ లేదు. గుండెల్లో తడిలేదు. కళ్ళలో అగ్ని...గుండెల్లో అగ్ని...శరీరంలోని అణువణువులో అగ్ని...పొగలు కక్కుతూంది. భరించరాని ఈ దారుణ బాధకు ఉపశమనం కావాలి. అగ్ని చల్లారాలి! ఈ బాధ నుంచి విముక్తి కావాలి రక్తం కావాలి! రక్తం రగిల్చిన ఈ అగ్ని రక్తంతో గాని చల్లారదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS