"ఏమిటి రవీ! నీ వరస ఏం బాగాలేదు. నీకు సహాయం చెయ్యాలని వచ్చినవాళ్ళను అవమానిస్తావా?" జగన్నాథం కోపగించుకున్నాడు.
రవి అదేమీ పట్టించుకోకుండా "బేబీ! నువ్వు మీ అమ్మా, నాన్నతో ఎప్పుడూ చెరువు గట్టుకు వెళ్ళలేదా?"
"ఊహూఁ! వీళ్ళు అసలికి మా నాన్న కానేకాదు అంజీ, అంజి పెళ్ళాం! నన్నేమో అట్లా పిలవమన్నారు. బోలెడన్ని చాక్లెట్లూ, బొమ్మలూ కొనిపెట్టారు" అనేసింది బేబీ.
రవి అంజి ముఖంలోకి తిరస్కారంగా చూశాడు. అంజి సిగ్గుతో తల వంచుకున్నాడు. రమ దిక్కులు చూడసాగింది.
జగన్నాథం అయోమయంగా అందర్నీ మార్చి మార్చి చూస్తున్నాడు.
"క్షమించండి! బుద్ధి గడ్డితిన్నది! పదివేల కోసం ఇంత నాటకం ఆడాను. ఈ రోజుల్లో మీలాంటి నిజాయితీ పరులుంటారని ఊహించలేకపోయాను" అంజి అంటూ వుంటే రమ తనలోకి తనే కుంచించుకు పోతున్నట్టు నిలబడింది.
ఇందిరా, జగన్నాథం బల్లుల్లా కుర్చీలకు అతుక్కుపోయారు.
"వస్తాం సార్! మీలాంటి నిజాయితీపరులు చెయ్యని నేరానికి శిక్ష అనుభవించకూడదు. సాక్ష్యులు ఎక్కడున్నా నేను వెతికి పట్టుకొస్తాను. ఈ దౌర్భాగ్యపు పనికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నన్ను క్షమిస్తారు గదూ?" అంటూ అంజి చెయ్యి చాపాడు. రవి అంజి చెయ్యి పట్టుకుని స్నేహపూర్వకంగా ఊపాడు.
బయటికి రాగానే "బాగా అయింది. నీ తెలివితేటల సంగతి తెలిసి కూడా బోల్తా కొట్టాను. పదివేలు సంపాదిస్తానంటూ చేతిలో వున్న డబ్బు ఆరొందలు ఖర్చు పెట్టావు" అని రమ అంజిని సాధింపు మొదలుపెట్టింది.
అంజి మౌనంగా నడుస్తున్నాడు.
"నాన్నా! నాకు ఐస్ క్రీం కావాలి."
అసలే ఒళ్ళు మండిపోతున్న అంజికి ఆ పిల్లను నాలుగు తన్నాలనిపించింది.
"ఎవరే నీకు నాన్న? ఐస్ క్రీం లేదు...నీ బొందా లేదు. నోరు మూసుకో" గద్దించాడు అంజి.
రవి దగ్గిర తమ పరువు తీసినందుకు రమ మొట్టికాయ వేసింది.
అలివేలు బిక్కమొహం వేసింది.
అంజీ, రమా అలివేలును తీసుకొని సరాసరి కుటుంబయ్య ఇంటికి వచ్చారు.
"ఇదిగో ఈ తద్దినం మాకక్కర్లేదు. నువ్వే పెట్టుకో" అన్నాడు అంజి.
కుటుంబయ్య వెర్రిచూపులు చూశాడు. రామసుబ్బమ్మ పిల్లను దగ్గిరకు తీసుకుని ఒళ్ళంతా నిమరసాగింది.
"మీ పిల్లను మీకిచ్చేశాం! మా ఐదువందలు ఇచ్చెయ్యండి!" అన్నాడు అంజి.
"ఇంకెక్కడున్నాయ్! ఎప్పుడో ఖర్చయిపోయినై" అన్నాడు కుటుంబయ్య పూర్తి షాక్ నుంచి కోలుకోకుండానే.
"నిన్ననే కదయ్యా ఇచ్చాం! ఖర్చెలా అయింది?"
"నిన్ననే అయిపోయినై. ఇంట్లోకి వెచ్చాలూ, పిల్లలకు బట్టలూ కొనేశాను."
"ఎవరి సొమ్మనుకున్నావయ్యా అది? అదంతా నాకు తెలియదు. నా డబ్బు నాకివ్వాల్సిందే."
"ఐదువందలు కాదు ఐదు నయాపైసలు కూడా నా దగ్గిర లేవు. నువ్వు చచ్చి గీ పెట్టినా లాభంలేదు" కుటుంబయ్య మొండికెత్తాడు.
ఇద్దరూ చాలాసేపు ఘర్షణ పడ్డారు. చివరకి అంజి ఓడిపోయాడు. చేసేది లేక అంజీ, రమా బయటికి వచ్చేశారు.
ఎలాగయినా నిజమైన సాక్ష్యుల్ని వెదికి రవిని రక్షించాలనే నిర్ణయానికి వచ్చాడు-మొదట రమ అంగీకరించలేదు. రమను ఒప్పించేసరికి అంజి తలప్రాణం తోకకు వచ్చింది.
ఐదేళ్ళ పిల్లతో యువజంట కన్పిస్తే చాలు అంజి వాళ్ళ దగ్గిరకు పరిగెత్తి ప్రశ్నలు వేసి తిట్లు తింటున్నాడు. కొందరు అంజిని పిచ్చివాడిగా భావించి నవ్వుతూ వెళ్ళిపోయారు. కొందరు వాళ్ళ పిల్లకు నీళ్ళగండం తప్పిందా అని అశుభం పలికినందుకు తిట్టిపోశారు. కొందరు కొట్టడానికి సిద్ధం అయ్యారు. అయినా అంజి తన ప్రయత్నం మానలేదు.
బజార్లో అందరి మొహాల్లోకి చూస్తూ తిరుగుతున్న అంజిని ఒకరోజు ఓ పెద్దమనిషి చొక్కా పట్టుకుని నిలదీశాడు.
"ఏరా నా కూతుర్ని ఏం చేశావ్? ఇదేవర్తి?" అన్నాడు ఆ పెద్దమనిషి రమను ఎగాదిగా చూస్తూ.
"ఏయ్! ముసలోడా. మాటలు జాగ్రత్తగా రానియ్! ఎవర్తె గివర్తె అన్నావంటే దవడ పళ్ళు రాలగలవు జాగ్రత్త" రమ కస్సుమంది.
"ఏమిటమ్మాయ్! మహా పతివ్రతలా ఎగురుతున్నావ్? వీడు నీకంటే ముందే నా కూతుర్ని, వితంతువును, ఐదేళ్ళ పిల్లతో సహా లేవదీసుకు పోయాడు. వాళ్ళను ఏం చేశాడో తెలియదు. మళ్ళీ నిన్ను"
అంజి నిజంగానే మతిపోయినంత పనయింది.
"ఏయ్ మర్యాదగా మాట్లాడు. అతడు నా భర్త మాకు పెళ్ళయి ఆరేళ్ళయింది" కళ్ళెర చేసింది రమ.
"ఏమిటీ? వీడు నీ మొగుడా? నేనంత పిచ్చోడ్ని కాను నమ్మడానికి! జుట్టు కత్తిరించుకున్నంత మాత్రం చేత నేను మనిషినే గుర్తించలేవనుకున్నావా?" అన్నాడు ఆ పెద్దమనిషి తన ధోరణిలో.
అంజి బుర్రలో ఒక మెరుపులాంటి ఆలోచన తళుక్కుమంది. ముఖం విప్పారింది.
"ఏయ్ అట్టే వాగకు. నా పేరు అంజిబాబు! ఈమె నా భార్య రమ. బహుశా నా పోలికలు ఉన్నవాడే మీ అమ్మాయిని లేవదీసుకుపోయి ఉంటాడు. మేమూ వాళ్ళ కోసమే వెదుకుతున్నాం. కనిపిస్తే మీ నాన్న నీకోసం బెంగట్టుకున్నాడని నీ కూతురికి చెబుతాలే! పద రమా. ఇప్పుడు మనకు మంచి క్లూ దొరికింది" అంటూ అంజి రమ చెయ్యి పట్టుకుని ముందుకు సాగిపోయాడు.
