కవిగారి బిక్కమొఖం చూచి కిసుక్కున నవ్వాడు నా వెనుకనే నిలిచి ఉన్న యువకుడు.
అతనితో కలిసి నేనూ వరండాలోకి నడిచాను. చెరొక కుర్చీలో కూలబడ్డాం. ముసలాయను దగ్గరగానే.
"బాబుగారూ! దగ్గి దగ్గి మీరు చాలా అలసిపోయారు. ఆరోగ్యం ఎలా వుందీపూట?" పలకరించాను కావాలని.
"బాబూ! వయోభారంతో సడలిపోయిన శరీరం విశ్రాంతిని తప్ప దేన్నీ భరించలేదు. చివరకు మందుల్ని కూడా తట్టుకోగల స్థితిలో లేదు, నిట్టూర్చారాయన.
"మరిటువంటి అనారోగ్య స్థితిలో ఇల్లు కదిలి వచ్చావంటే మీ ఉద్దేశ్యం ఏమిటి? కొంచెం చొరవ తీసుకుంటున్నాను. "ఇటువంటి స్థితిలో ఉన్నాను కనుకనే పట్టుపట్టి వచ్చాను. మరికొంతకాలం జీవిస్తానన్న నమ్మకముంటే ఇక్కడకు రావటం ఇంకా ఆలశ్యం చేసేవాడిని. చిన్న దగ్గు తెర. డాడీగారు మరింత మాట్లాడకండి అంటూ హెచ్చరించాడు యువకుడు. ఆయన ఫర్వాలేదన్నట్లు చప్పరించేశాడు.
"బాబు నువ్వడగబోయే తరవాత ప్రశ్న కూడా నాకు తెలుసు. అంతగా అవస్థపడి రావాల్సిన కారణమేమిటాని కదూ!" ఆయన మేధాసంపత్తికి విస్తుపోయి అభిమానంగా నవ్వాను.
"చెప్తావిను" ప్రారంభించాడాయన. ఆ యువకుడు తనమాట వినలేదని రవ్వంత చిరాకుతో లేచి లోపలకు వెళ్ళాడు. ఆయన చెప్పిన కథ వింటుంటే మధ్య మధ్య నాకు కన్నీరాగలేదు.
"బాబూ! ఈ కొండవీటికి పశ్చిమోత్తరంగా అమరావతి వున్నది. తెలుసుక కదూ! ఆ గ్రామంలోనే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను నేను. నా పేరు రవివర్మ!
జీవితం ఎంత అగాధమైనదో అప్పట్లో నాకు తెలియదు. నాకు శాస్త్రోక్తంగా వుపనయం చేసి మంత్రాలూ అవీ చెప్పించారు! తెలుగు సంస్కృతాల్లో పంచకావ్యాలూ మా నాన్నగారే చెప్పారు! నన్ను ఇంగ్లీషు చెప్పే బడిలో చదివించటానికి మా నాన్నగారు ఒప్పుకోలేదు! అప్రాచ్యపు చదువులొద్దు అని ఈసడించాడు! బ్రాహ్మణ కుటుంబాల్లో వుండే ఆచారాలూ, ఆలోచనలూ నాకూ అబ్బాయి! అవి తీర్చుకుంటూ, తీరిక వేళల్లో పొలం పని చూచుకుంటూ వుండటమే అప్పట్లో నా నిత్యకృత్యం!
ఓరోజు పొలం పనిలో మునిగిపోయి వున్నాను.
"సామీ! అప్పచ్చులు తెచ్చాను తలెత్తండీ." ఉర్దూ యాసలో ఒక కోకిల కంఠం వినిపించింది. తలెత్తి చూచాను!
అప్పటికి నాకు బాగా యుక్త వయస్సు వచ్చింది. పంచరంగుల సీతాకోక చిలుకలా ఉన్న ఓ బూబులపిల్ల నాకంట పడింది. ఆమె చేతిలో బారెడు కర్ర ఉన్నది. కర్ర చివర చిన్న మూట కట్టి ఉన్నది. రెండో చివరను ఆ పిల్ల చేతితో పుచ్చుకొని భుజాన పెట్టుకున్నది. ఆ పిల్లను చూసిన క్షణం ఎలాంటిదో కాని నాకు 'కళా పూర్ణోదయం' గుర్తుకొచ్చింది. ఆ పిల్ల నన్ను చూసి నవ్వింది.
నేను చేన్లో పనిచేసి బాగా అలసిపోయి వుంటానని మా అమ్మ ఏదో పిండివంట చేసి పంపిందని ఊహించాను, ఆ వంటకాలను ఆ పిల్ల తాకకూడదనే చాందసపు ఆలోచనతో మా అమ్మ కర్రపుల్లకు మూటకట్టి పంపించింది.
'ఎందుకలా నవ్వుతున్నావు?' అడిగాను ఆ పిల్ల తల వొంచుకుని నవ్వు మాయం చేసుకుంది.
'అమ్మ ఇంకా ఏమి చెప్పింది?' ఏదో మాట్లాడాలి కదా?
'పెందరాడే ఇంటికి చేరమంది. చీకటి పడేవరకు పొలాల వెంట తిరగొద్దని చెప్పమన్నారు' అన్నది. ఆమె గొంతు వింటుంటే నాకేదో ఆత్మీయంగా అనిపించసాగింది. నాతోపాటు ఆమెనూ తినిపించాను. ఆమె భయపడుతూనే తీసుకుంది. ఒదిగిఒదిగి కూర్చుంది బిడియంతో.
'బాబయ్యా! కాసిన్ని నీళ్ళు తాగిరండి' సలహా ఇచ్చింది. నీవే కాసిన్ని తెచ్చిపెట్టకూడదూ!' అర్థించాను.
"అమ్మో మైలపడిపోతారు. అమ్మగారికి తెలిస్తే నా ప్రాణం తీసేస్తారు. మీరే..." తన అనుమానం బయటపెట్టింది. "మరేమి ఫర్వాలేదు. నేను మైల పడిపోను. అమ్మకూ ఎవరూ చెప్పరు. వెళ్ళి తీసుకురా ప్రోత్సహించాను.
ఆమె రివ్వున పోయి మంచినీళ్ళు తీసుకొచ్చింది. త్రాగాను. "ఇప్పుడు నావంక చూచి చెప్పు. నువ్వు తెచ్చిన నీళ్ళు త్రాగాక నాలో ఏదైనా మార్పొచ్చిందా" అన్నాను. ఆ పిల్ల కిలకిలా నవ్వుతూ పారిపోయింది.
ఆ తరువాత అప్పుడప్పుడూ ఆ పిల్లను చూడాలనిపించేది. ఒకే వూళ్ళో ఉంటున్నవాళ్ళు కావటం చేతా, మా పొలం పనుల్లోకి వాళ్ళూ తరచూ రావటం చేతా మేము కలుసుకోవటం జరిగేది. మా స్నేహం త్వరగానే పెరిగింది. కావాలనే ఒకళ్ళ నొకళ్ళు చూడాలనీ కలుసుకోవాలనీ తాపత్రయపడేవాళ్ళం. అవకాశాల కోసం వెదికే వాళ్ళం. ఇది కాస్తా వూళ్ళో పొక్కింది. ఏ మహా నగరాల్లోనో అయితే ఎవరూ పట్టించుకునేవాళ్ళు కారు. అంత మాత్రపు పల్లెటూరు కావటం చేత చిలవలు పలవలతో నవరసాల అలంకరణతో మామీద ఓ కథ ప్రచారంలోకి వచ్చింది. అయినా మేము భయపడలేదు. ఆకర్షణ పెరిగింది. కథ బాగా ముదురుపాకాన పడ్డాక మేము ఆ ఊళ్ళో ఉండటం అసాధ్యమనిపించింది.
