యశ్వంత్ భట్టాచార్య గుర్రం బండి అతనితో మాట్లాడుతూ పరిసరాలు ఓ పక్క గమనిస్తూ కూర్చున్నాడు. అనుమానాస్పదంగ ఏది కానరాలేదు.
మరో అరగంట తర్వాత గుర్రం బండి బస్సుస్టాండుకి చేరింది.
యశ్వంత్భట్టా చార్యని దింపి బండి వాడు వెళ్ళి పోయాడు.
బస్సు టిక్కెట్టు కొనుక్కుని బస్సు ఎక్కాడు.
పది నిమిషాల తర్వాత బస్సు బైలు దేరింది.
యశ్వంత్ భట్టాచార్య ఆ వూరు వచ్చిన పని పూర్తి చేసుకుని తిరిగి వెళుతున్నాడు. ఆయన ప్రయాణిస్తున్న బస్సు ఎప్పుడో వూరు పొలి మేరలు దాటింది గాబట్టి యింకనటన చాలించవచ్చు. వేషం మార్చవచ్చు. కాని యశ్వంత్ భట్టాచార్య ఆ పనిచేయలేదు. ఒక్కోసారి చిన్నచిన్న విషయాలే పెద్దపెద్ద ప్రమాదానికి దారి తీస్తాయి.
యశ్వంత్ భట్టాచార్య బస్సు దిగి రైలు ఎక్కి నిజంగ కొంత దూరం తీర్ధయాత్రల నిమిత్తం ప్రయాణికుడి లాగానే వెళతాడు. నాలుగురోజుల తర్వాత అవతారం చాలించి హెడ్ కోర్టర్స్ కి వెళ్ళి పోతాడు. అయితే ఈ కేసు పూర్తయే రెండు నెలల కాలంలో యశ్వంత్ భట్టాచార్య వారానికో లెటర్ తన యాత్రా విశేషాలు వివరిస్తూ కీర్తికి రాయాలి.
ఆ పనికి వేరే మనుషులని నియమిస్తారు కనుక అనుమానం రాదు. ఎటొచ్చీ యశ్వంత్ భట్టాచార్య వేషం మార్చి తన అసలు రూపు దాల్చే వరకూ జాగ్రత్తగా వుండాల్సిందే.
యశ్వంత్ భట్టాచార్య రెండు రోజులు ప్రయాణం చేసిం తరువాత నీడలా ఓ మనిషి తన్ని వెంటాడు తున్నాడని గమనించాడు. అతని కళ్ళు గప్పి తప్పించు కోవాలని ఆ నిమిషానే అనుకుని సమయం కోసం చూస్తూ వుండిపోయాడు.
ఆ సమయం మరో నాలుగు గంటల్లోనే లభ్యమైంది.
కాళహస్తి వెళ్ళటానికి డైరెక్ట్ బస్సు టిక్కెట్టు కొన్నాడు. యశ్వంత్ భట్టాచార్య నీడలా వెంటాడేమనిషి కూడా టిక్కెట్టు కొని బస్సు ఎక్కాడు.
"బస్సు బయలు దేరటానికి యింకా ఎంతసేపు పడుతుంది?" కండెక్టర్ ణి అడిగాడు యశ్వంత్ భట్టాచార్య.
"పావుగంట దాకా కదలదు." కండెక్టర్ చెప్పాడు.
"ఆ ఎదురు హోటల్లోకి వెళ్ళి కాఫీ టిఫెన్ తీసుకునే టైముందా!
"ఆ....ఇలా వెళ్ళి అలా వచ్చేయి."
కండక్టర్ ఆమాట అనంగానే" సంచి యిక్కడ పెడతాను. చూస్తుంటావా బాబూ!" అన్నాడు.
"సంచి ఎంత బరువయ్యా వెంట తీసుకుని వెళ్ళుకన్ను మూసి తెరిచేలోగా దొంగిలించేవాళ్ళు బస్సుస్టాండు నిండా వున్నారు. భలే ముసలాడివే." కండక్టర్ అనంగానే యశ్వంత్ భట్టాచార్య సంచి చేత పుచ్చుకుని బస్సు దిగి హోటల్ కి బైలుదేరాడు.
వెంటాడే మనిషి బస్సు దిగలేదు.
యశ్వంత్ భట్టాచార్యకి సమయం కలసి వచ్చింది. తను హోటల్ కి వెళ్ళి కాఫీ టిఫెన్ తీసుకొని తిరిగి వస్తాననుకుని వాడలాగే బస్సులో సీటుకి అతుక్కుపోయి కూర్చున్నాడు. ఇదే సందు తప్పించుకోటానికి అనుకున్నాడు.
యశ్వంత్ భట్టాచార్య హోటల్ దాకా సరీగ వచ్చి ఆపై కాస్త పక్కకు తిరిగి ఆటోమాట్లాడుకుని ఎక్కేశాడు.
"ఎక్కడికి వెళ్ళాలి!" ఆటో డ్రైవర్ అడిగాడు.
"పోలీసు స్టేషనుకి పోనియ్యి."
"పోలీస్ స్టేషన్?"
"ఎస్. ఎందుకంత ఆశ్చర్యం?" యశ్వంత్ భట్టాచార్య గంభీరంగ అడిగాడు.
ఆటో డ్రైవర్ ఏమనుకున్నాడో మరి మారు మాట్లాడకుండా ఆటోని ముందుకు పోనిచ్చాడు.
తనని నీడలా వెంటాడే మనిషి నుంచి చాలా తేలిగ్గా తప్పించు కున్నాడు యశ్వంతు భట్టాచార్య.
మరి కొద్ది సేపటిలో ఆటో పోలీసు స్టేషను ముందు వచ్చి ఆగింది.
యశ్వంతు భట్టాచార్య ఆటో దిగాడు.
25
ఆ యింట్లో కీర్తి పూర్తి స్వేచ్చ సంపాదించింది.
కీర్తి ఆ యింటికి వచ్చిన మొదట్లో దాదాపు వారందాకా కీర్తి మీద నిఘా వేశారు. చాటుగ ప్రతి నిమిషంకీర్తి మీద ఓ కన్ను వేసే వున్నారు.
కీర్తి యిలాంటి చిన్నచిన్న విషయాలలో బహుమెలుకువగ వుంటుంది. ఓ వేళ చిక్కినా జర్రున జారి పోగలదు. అప్పటి కప్పుడు కొత్త కధ అల్లగలదు.
శరీరం ఎదిగి బుద్ది ఎదగని అమ్మాయిగ కీర్తి మీద నిఘావేసిన వాళ్ళు పొరబడేటట్లు చేయగలిగింది.
ఇది కీర్తి సాధించిన ప్రధమ విజయం.
ఓ రోజు కీర్తి వంటరిగ గదిలో వుంది. అంతకు క్రితం లంగాలో రహస్యంగ దాచుకున్న పెన్ను క్యాప్ లూజు అయి పడిపోయేటట్లు వుంటే కీర్తి సరిచేసుకోటానికి గదిలోకి వచ్చి గది తలుపులు లోపల గడియ వేసుకుంది. అదే ఏబాత్ రూమ్ లోనో దూరినట్టయితే ఎవరూ చూసేవాళ్ళు కాదు.
