అరగంట గడిచిన తరువాత ఇద్దరూ అరుణ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరారు.
"ఇవ్వాళ సమ్రాట్ పుట్టినరోజు. వాళ్ళింటికి వెళ్దామా సాహితీ!" అడిగింది కొంటెగా చూస్తూ అనూష.
సాహితి మౌనంగా వుంది.
"సమ్రాట్ స్వయంగా చెప్పలేదనా అలా మౌనంగా వుండిపోయావు?"
"అబ్బే అలా అని కాదు. నాకు ఇవాళ సాయంత్రం పెళ్లిచూపులు ఏర్పాటు చేసింది ఆంటీ. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి" అంది సాహితి సిగ్గుపడుతున్నట్టు నేల చూపులు చూస్తూ.
"అవి నీ మనసులో నుంచి వచ్చిన మాటలేనా? అంతా శుద్ధ అబద్ధమని నీ ముఖమే చెబుతున్నది. ఒకవేళ ఆంటీ నిజంగానే అలాంటి ఏర్పాట్లు ఏమన్నా చేసినా, నీమీద నాకా నమ్మకం వుంది. నువ్వు తప్పకుండా నా అడుగుజాడల్లో నడుస్తావని!" భుజం తట్టి, కన్నుగీటుతూ అంది అనూష.
పకపకా నవ్వింది సాహితి. తన మనసును అనూష ఇట్టే పసిగట్టేసిందనుకుంది.
"నువ్వు రాకుంటే సమ్రాట్ ఊరుకుంటాడా? అసలు ఫంక్షన్ జరుపుకుంటాడా?" కవ్విస్తూ అంది.
అటుగా వస్తున్న ఆటో నొకదాన్ని ఆపింది అనూష. అనూష మరోసారి ప్రయత్నించేసరికి సాహితి ఆటో ఎక్కింది.
ఆటో వెళుతున్నది. అనూష తనలో తనే నవ్వుకుంది.
"సమ్రాట్ గురించి మీ అభిప్రాయం ఏమిటి?" 'అడుగుదామా వద్దా' అన్నట్టు సంశయిస్తూ అడిగింది సాహితి.
ఊహించని ప్రశ్న అది. అనూష ఆలోచనలో పడింది.
"అతన్ని గురించి నన్నడుగుతున్నావు. ఏమిటీ విశేషం?" అంది అనుమానంగా అనూష.
"సమ్రాట్ పనులన్నీ చూస్తున్నారు. ఎంచక్కా మీరిద్దరూ పెళ్ళి చేసుకుంటే కలసి రచనలు చేయవచ్చుగా!"
ఆ మాటకు అనూష ఖిన్నురాలయింది. ఈ పిల్ల సమ్రాట్ ను ప్రేమిస్తున్నదనుకున్నది తను. కాని తననే డబుల్ క్రాస్ చేస్తుందని తెలుసుకోలేకపోయింది. స్త్రీ సహజమైన ఈర్ష్యాసూయలతో సాహితి యిద్దరి మధ్యా ఉన్న సంబంధాన్ని అనుమానించి ఉండవచ్చు అనుకుంది.
"నాన్సెన్స్! సమ్రాట్ ని నేను ప్రేమించడ మేమిటి? ఈ మాటలు ఇప్పుడు ఇక్కడంటే అన్నావు గానీ, ఇంకెప్పుడూ అనకు. స్త్రీకీ పురుషునికీ మధ్య సంబంధం కేవలం ప్రేమ, పెళ్ళికే పరిమితం కాదు. ఇప్పటివరకు అతని వద్ద నా ఉద్యోగ ధర్మాన్ని నేను నిర్వర్తించాను. అంతకుమించి నువ్వూహిస్తున్నట్టు మా మధ్య ప్రేమ, గీమ అంటూ ఏదీ లేదు. అయినా నేను అతని దగ్గర ఉద్యోగానికి ఇప్పుడు రాజీనామా చేశాను." ఆమె మాటలలో ఆవేశం ఉంది.
సాహితి మనసు తేలికపడింది. ఇప్పటివరకూ తను అనవసరంగా సమ్రాట్ మీద లేనిపోని అనుమానాలు పెట్టుకుంది. అతనిమీదా, అతని ప్రేమమీదా తనకు పూర్తి విశ్వాసం కలిగింది.
సమ్రాట్ పుట్టినరోజు కానుకగా ఏమివ్వాలో క్షణం ఆలోచించింది సాహితి. ఆ ఆలోచనకే ఆమె బుగ్గలు సిగ్గుల మొగ్గలయ్యాయి.
"నీ మౌనం నన్ను బాధపెడుతోంది సాహితీ! సమ్రాట్ నిన్ను మనస్పూర్తిగా ప్రేమిస్తున్నాడు. లేనిపోని అనుమానాలతో సమ్రాట్ ను దూరం చేసుకోవద్దు. ఇందాక నువ్వు నన్నన్నమాట కేవలం నన్ను డబుల్ క్రాస్ చేయడానికే కదూ" నిలదీసి అడిగింది అనూష.
"సారీ! నేను నిన్ను అనుమానించలేదు అనూషా! కేవలం అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సజెస్టివ్ గా అన్నానంతే!" అంది ఆమె చేతిని తన చేతులలోకి తీసుకుంటూ సాహితి.
సమ్రాట్ ఇంటి ముందు ఆటో ఆగింది. ఇద్దరూ ఆటో దిగారు. సమ్రాట్ వాళ్ళను సాదరంగా ఆహ్వానించాడు.
"విష్ యూ హేపీ బర్త్ డే సర్!" అంది అనూష నవ్వుతూ.
"థాంక్యూ అనూషా! థాంక్యూ!" కృతజ్ఞతగా అన్నాడు.
ఓ పనిపిల్ల స్వీట్లు, హాట్లు తీసుకువచ్చి టీపాయి మీద పెట్టింది.
"సారీ! మా అమ్మా నాన్నా బజారు కెళ్ళారు."
"ఫరవాలేదు. మేమేమీ కొత్తవాళ్ళం కాదుగా!" అంది అనూష స్వీట్ తీసుకుంటూ.
సాహితి ముభావంగా కూర్చుంది.
సమ్రాట్ ఉత్సాహం నీరుగారిపోయింది.
అది గమనించిన అనూష వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలితే మనసు విప్పి మాట్లాడుకుంటారనుకుంది.
"సాహితీ! నువ్వు అమ్మా నాన్నా వచ్చేవరకు ఉండు. నేను వెళతాను" అంటూ అనూష కుర్చీలోంచి లేచింది.
"అప్పుడే వెళ్తావా అనూషా! భోజనం చేసి వెళ్ళొచ్చుగా?"
"లేదు సార్! పని వుంది. నేను వెంటనే వెళ్ళాలి" అంది తప్పదన్నట్టు.
అనూష రాక అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆమె రాజీనామా ఉపసంహరించుకుంటుందనుకున్నాడు. కాని ఆమెకా ఆలోచన ఉన్నట్టే లేదు.
"అనూషా! నువ్వు సమ్రాట్ కి సహాయంగా ఇక్కడే ఉంటే బాగుంటుంది. సమ్రాట్ ఇంకా వృద్ధిలోకి వస్తారు. నా మాట విని...." సాహితి అభ్యర్ధనగా అంది.
"సారీ! మీరంతా మరోలా అనుకోవద్దు. నేను ఎక్కడున్నా నా సహాయం మీకెప్పుడూ ఉంటుంది. జర్నలిజంలో నాకున్న ఆసక్తికొద్దీ వేరే మార్గం ఎన్నుకున్నాను గాని, సమ్రాట్ గారి దగ్గర మానేయడం నాకు కూడా నిజంగా చాలా బాధగానే ఉంది" అంది అనూష ఆమె అభ్యర్ధనను మృదువుగా త్రోసిపుచ్చుతూ!
ఆమె పట్టుదల తెలిసిన ఇద్దరూ మారు మాట్లాడలేకపోయారు.
"మీకు నా సహాయం ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు సందేహించకుండా పిలవండి సమ్రాట్! తప్పక వస్తాను. నాకు చేతనైన సాయం చేస్తాను." అనూష వాళ్ళిద్దరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది.
ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నట్టు సమ్రాట్ చేయి అందుకుని, చటుక్కున ముద్దు పెట్టుకుని, "హేపీ బర్తడే టూ యూ!" అంది సాహితి.
అటూ ఇటూ చూసి ఎవ్వరూ లేరని నిర్ధారించుకుని సాహితిని కౌగిలించుకున్నాడు సమ్రాట్.
"వదలండి! పనిపిల్ల వస్తోంది."
"ఊహుఁ!"
"అయ్యో! చెప్పేది మీకే!" గట్టిగా అతన్ని తోసింది.
"ప్లీజ్ సాహితీ!" సమ్రాట్ ఆమెను దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నించాడు.
"బాబోయ్!కొంచెం మెత్తబడితే మింగేసేట్టున్నారు. ఇక నేనుండను బాబూ, వెళ్తాను" అంటూ పరుగున బయటకు వచ్చింది.
