అరగంట తరువాత,
వీళ్ళు ఎదురు తెన్నుల చూస్తూవున్న పోలీసు జీపు మందీ మార్బలంతో వచ్చింది.
మరొకసారి వాళ్ళందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.
ఎవరికి వారే మరికొద్ది సేపట్లో వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు.
కానీ,
వాళ్ళకి తెలియంది ఒకే ఒకటుంది.
కొరివితో తల గోక్కోటం కన్నా, పోలీసులతో వ్యవహారం మా చెడ్డ చిరాకని.
మరికొద్ది సేపట్లో అందరికీ ఆ అనుభవం మొదలయ్యింది.
15
పోలీసువాళ్ళు ఎవరినీ అంత తొందరగా వదలరు.
శవాలని వివిధ కోణాల్లో ఫోటోలు తీసి, అక్కడ తతంగం అంతా పూర్తి చేసుకుని పోస్టు మార్టమ్ కి శవాలని తరలించి, బస్సులో ప్రయాణిస్తున్న అందరినీ పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారు.
అప్పటికే చాలామంది నీరసపడిపోయి వున్నారు. అయినా, పోలీసులతో వ్యవహారం తప్పదు మరి. నేరం చెయ్యక పోయినా, నేరస్తులలాగా అక్కడే వుండిపోవాల్సి వచ్చింది. ఒక్కొక్కళ్ళని లోపలకి పిలవటం, ఎడా పెడా ప్రశ్నలు వేసి, చివరకి వాళ్ళ ఎడ్రస్ లు తీసుకుని "మేము పిలిచినపుడు రావాలి." అని వార్నింగ్ ఇచ్చి, అప్పుడు ఒక్కొక్కళ్ళనీ ఇళ్ళకి పంపిస్తున్నారు.
మా వంతు ఎప్పటికి వస్తుందో, ఎప్పుడు ఇక్కడినుండి బయట పడతామో, అని అందరూ అనుకుంటునట్లే పుండరీకాక్షయ్య కూడా అనుకున్నాడు.
గంట తరువాత పుండరీకాక్షయ్యని లోపలకి పిలవటం జరిగింది.
పుండరీకాక్షయ్యకి పోలీసువాళ్ళంటే మహా భయం. లోపలకి పెడుతూనే, 'ఇక్కడ నుండి క్షేమంగా బయటపడితే నీ కొండకి వచ్చి తలనీలాలు సమర్పించు కుంటానని' ఏడుకొండలవాడికి ఒక మొక్కు మ్రొక్కేయటం కూడా చేసేశాడు.
"ఆ పచ్చ బ్యాగ్ లో వున్నవేమిటి?" పుండరీకాక్షయ్య చేతిలో వున్న పచ్చ బ్యాగ్ ని చూస్తూ ప్రశ్నించాడు ఇన్ స్పెక్టరు.
"పి__పి__ పిండి వంటలండీ!" కంగారు పడుతూ జవాబిచ్చాడు పుండరీకాక్షయ్య.
"పిండి వంటలా, ఎక్కడికి తీసుకి వెడుతున్నావ్? ఎందుకు?" ప్రశ్న అనవసరమైనదే అయినా అధికారం వుట్టిపడే కంఠంతో అడిగాడు ఇన్ స్పెక్టర్.
పిండి వంటల విషయం కధలాగా చెప్పాడు పుండరీకాక్షయ్య. చెప్పి, "కావాలంటే మీరు తీసుకోండయ్యా! మా పార్వతి చాలా మంచి అమ్మాయి. మీరు తీసుకున్నారంటే ఏమీ అనదు." అంటూ చేతిలో వున్న బ్యాగ్ ని క్రిందపెట్టాడు.
ఇన్ స్పెక్టర్ ఏ కళ నున్నాడో "వద్దులే!" అన్నాడు.
వెంటనే పుండరీకాక్షయ్య బ్యాగ్ ని చేతిలోకి తీసుకుని "మరి, నేను వెళ్ళొచ్చా అండీ! అన్నారు ఆశగా.
ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాడు ఇన్ స్పెక్టరు.
"మీతో పాటే నలుగురూ బస్సులో ప్రయాణిస్తూ వచ్చినట్లు తెలిసింది. వాళ్ళ ఆనవాళ్ళు చెప్పగలవా?" అన్నాడు ఇన్ స్పెక్టరు.
"అసలే కంగారూ, భయం, ఎవరికి గుర్తు వుంటుందండీ కానీ,... ..."
పుండరీకాక్షయ్య మాట పూర్తిచేసి అంతటితో, వూరుకోక 'కానీ... ...' అంటూ నసుగుతూ ఆగేసరికి ఇన్ స్పెక్టర్ కి అనుమానం వచ్చింది. "ఇంకేదయినా తెలిసి అనవసరంగా మమ్మల్ని చూసి భయపడి, చెప్పటం మానేస్తే ఆ తరువాత అది మీ కంఠానికే చుట్టుకుంటుంది. ఏ చిన్న విషయం దాచినా పెద్ద నేరమవుతుంది. తరువాత విచారించీ ప్రయోజనం లేదు. కాళ్ళు పట్టుకుని లాభం లేదు. గుర్తు తెచ్చుకుని అక్షరం పొల్లు పోకుండా చెప్పటం మంచిది." ఇన్ స్పెక్టర్ స్వరం కరుకుగా వినవచ్చింది.
